ఉత్తరప్రదేశ్ లో ఏం జరుగుతున్నదో చూడండి…

(PK Roy from Lucknow)

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయడంలో కీలక పాత్ర వహించే ఉత్తర ప్రదేశ్ లో ప్రతిపక్షాల మధ్య సయోధ్య కుదరలేదని,దానితో కాంగ్రెస్ తో కలసి సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు ఒక కూటమి ఏర్పాటుచేయలేకపోయాయని చాలా మంది సెక్యులర్ పండితులు బాధపడుతున్నారు.

యుపిలో యుపిఏ లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తుంటారు. ప్రతిపక్ష కూటమి ఏర్పాటు కాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఒక దారిలో, సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీల ‘కూటమి’ మరొక దారిలో పోతున్నాయని, ఇది బిజెపికి అనుకూలమని అంటుంటారు.

అయితే, కాంగ్రెస్ ఈ కూటమిలో చేరకపోవడం ఒక పక్కా ఏర్పాటు అని, ఈ పార్టీ లన్నింటి మధ్య అవగాహన తో నే కాంగ్రెస్ , కూటమి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని ఈ పార్టీల అభ్యర్థుల ఎంపిక చూస్తే అర్థమవుతుంది.

కాంగ్రెస్ ఎక్కడ బలముందో, కూటమి అభ్యర్థులకు ఎక్కడ పట్టు వుందో తెలుకుని అక్కడ ఆయాపార్టీల అభ్యర్థులు గెలిచేలా ఈ పార్టీలన్నీ సహకరించుకుంటున్నాయి. అదెలాగో ఇక్కడ చూడండి…

ఫతేపూర్ సక్రిలో కాంగ్రెస్ అభ్యర్థి పిసిసి అధ్యక్షుడు రాజ్ బబ్బర్. అక్కడ పోటీ ప్రధానంగా బిజెపి కాంగ్రెస్ ల మధ్య ఉంది. బిజెపికి పడే హిందువుల వోట్లు చీలాలి. ఎలా? . ఇక్కడ మాయావతి నాయకత్వంలోని బిఎస్ పి శ్రీభగ్వాన్ శర్మ (గుడ్డు శర్మ) అనే బ్రాహ్మణ అభ్యర్థిని రంగంలోకి దించింది. కారణం, ఇక్కడ బ్రాహ్మణుల వోట్లన్నీ బిజెపికి పడకుండా చూడాలి. బిఎస్ పి  చిన్నపాటి రౌడీ అయిన  బ్రాహ్మణ అభ్యర్థిని నిలబెట్టడంతో నియోజకవర్గంలోని ముస్లిం, దళిత వోట్లు కాంగ్రస్ కు పడే అవకాశం ఉంది. ఉందో లేదో గాని బ్రాహ్మణ వోటర్లను చీల్చడం బిఎస్ పి లక్ష్యం.

ఇలాగే మధుర నియోజకవర్గంలో కాంగ్రెస్ బ్రాహ్మణ అభ్యర్థి మహేష్ పాథక్ ను నిలబెట్టింది. ఇక్కడ పోటీ ప్రధాని బిజెపి హేమమాలినికి, రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి నరేంద్ర సింగ్ మధ్యే ఉంది. బ్రాహ్మణుల వోట్లనీ బిజెపికి చీలకుండా, కాంగ్రస్ ఓటమి గ్యారంటీ అయినా బ్రాహ్మణుడికి సీటు ఇచ్చింది.

మీరట్ నియోజకవర్గం పరిస్థితి చూడండి. ఇక్కడ బిజెపి అభ్యర్థి రాజేంద్ర అగర్వాల్. ఇక్కడ బిఎస్ పిని గెలిపించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. బిఎస్ పి ముస్లిం అభ్యర్థి యాకుబ్ ఖురేషిని నిలబెట్టింది. కాంగ్రెస్ మరొక బనియా అభ్యర్థి హరేందర్ అగర్వాల్ ను నిలబెట్టి బనియా వోట్లను చీల్చి, బిఎస్ పి కి సహకరించాలనుకుంటున్నది.

ఘాజియాబాద్ లో కాంగ్రెస్ బ్రాహ్మణ అభ్యర్థి డాల్లీ శర్మను నిలబెట్టింది. అక్కడ బిజెపి అభ్యర్థి కేంద్ర మంత్రి వికె సింగ్. బిజెపికి పడే  బ్రాహ్మణుల వోట్లను చీల్చి బిజెపి ఓడిపోయేలా చూడటం కాంగ్రెస్ లక్ష్యం. ఇక్కడ కాంగ్రె స్ కూటమికి సహకరిస్తున్నది.

ఇక అమ్రోహా ఎలా ఉందో చూడండి . కాంగ్రెస్ పార్టీ మొదట రషీద్ అల్వీని నిలబెట్టింది. రషీద్ అల్వీ కొంతకాలం ఉమ్మడి ఆంధ్ర నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ బిఎస్ పి డానిష్ అలీ అని ముస్లిం అభ్యర్థిని నిలబెట్టింది. రషీద్ అల్వీ ని కంటిన్యూ చేస్తే ముస్లిం వోట్లు చీలి బిఎస్ పికి హాని జరుగుతుంది. అపుడు బిజెపి గెలిచే అవకాశం ఉంటుంది. అందుకని రషీద్ అల్వీని తీసేసి కాంగ్రెస్ పార్టీ సచిన్ చౌదరి అనే చిన్న లీడర్ ని   హిందువుని నిలబెట్టింది. దీనితో ముస్లిం వోట్లన్నీ బిఎస్ పికి పడతాయని అంచనా. ఆశ.

ముస్లింల మెజారిటీ ఉన్ సంభల్ లో కాంగ్రెస్ పార్టీ పోటీ నామమాత్రంగా ఉండేందుకు అప్పర్ క్యాస్ట్అభ్యర్థి కెప్టెన్ జెపి సింగ్ ని నిలబెట్టింది. ఆయన ఠాకూర్. అక్కడ బిజెపి అభ్యర్థి ఠాకూరే. అందువల్ల ఠాకూర్ వోట్లలో చీలిక వస్తుందని అంచనా. ఇక్కడ కూటమి అభ్యర్థి ముస్లిం షఫీకుర్ రెహ్మాన్ బర్క్ గెలవాలని లక్ష్యం.

తెలుగు హీరోయిన్ జయప్రద పోటీచేస్తున్న రామ్ పూర్ సంగతి తీసుకుందాం. అక్కడ ఆజాం ఖాన్ అనే వివాదాస్పద నాయకుడు సమాజ్ వాది పార్టీ అభ్యర్థి. ఇక్కడ కూడా ముస్లిం జనాభా ఎక్కువ. నియోజకవర్గంలో ముస్లింలు 50 శాతం పైబడే ఉన్నారు. అక్కడ బిజెపి అభ్యర్థి జయప్రద. ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ వోట్ల పోలరైజేషన్ జరగకుండా చూసేందుకు, సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహం పన్నింది.  సంజయ్ కపూర్ అనే హిందువును నిలబెట్టింది. ఏమవుతుందో చూడాలి.

కేవలం మూడు చోట్ల అంటే షహరాన్ పూర్, బిజ్నోర్, బదౌన్ లలో మాత్రమే కాంగ్రెస్, ఎస్ పి, బిఎస్ పి, ఆర్ ఎల్ డి కూటమిల మీద బలమయిన అభ్యర్థులను నిలబెట్టింది. ఒక్కషహరాన్ పూర్ లో మాత్రమే మాయావతి కాంగ్రెస్ ను ఓడించండని పిలుపునిచ్చింది.

ఈ కూటమిలో బిఎస్ పి 38 స్థానాలలో, ఎస్ పి 37 స్థానాలలో, ఆర్ ఎల్ డి 3 స్థానాలలో పోటీచేస్తున్నది. రెండునియోజక వర్గాలలో అంటే అమేధీ (రాహుల్ గాంధీ), రాయ్ బరేలి(సోనియా గాంధీ) ల మీద అభ్యర్థులను పెట్టరాదని కూటమి నిర్ణయించింది.

మాయావతి అపుడపుడు కాంగ్రెస్ ను విమర్శిస్తున్నా, ఎన్నిలక ప్రచారంలో కూటమి ని విమర్శించరాదని కాంగ్రెస్ ఒక నియమంగా పెట్టుకుంది.
ఇలా చాలా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలలో ఈ పార్టీ కూటమికి మేలుచేసేందుకు వీలుగా అభ్యర్థులను నిలిపింది. అలాగే కాంగ్రెస్ బలంగా ఉన్న చోట కూటమి కూడా బిజెపి వోట్లను చీల్చేలా అభ్యర్థులను నిలబెట్టంది. అదీ ఈ పార్టీల మధ్య అవగాహన అనిపిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *