Home Politics ఎన్నికల కమిషనా, బిజెపి అనుబంధ సంస్థా : చంద్రబాబు అనుమానం

ఎన్నికల కమిషనా, బిజెపి అనుబంధ సంస్థా : చంద్రబాబు అనుమానం

82
0
SHARE

రాజ్యంగబద్ధంగా ఏర్పాటయిన  ఎన్నికల కమిషన్  భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చేసే ఫిర్యాదుల మీద స్పందించేందుకు అమితోత్సాహం చూపిస్తు ఉందని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అదే తెలుగుదేశం పార్టీ చేసే ఫిర్యాదుల మీద, అందునా ఆధారాలతో చేసే  ఫిర్యాదుల మీద కూడా సకలాంలో సరైన విధంగా స్పందించడం లేదన ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన  ఎన్నిక కమిషన్ కు లేఖ రాశారు. లేఖను ఇక్కడి అందిస్తున్నాం.

 

కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్,
ఎన్నికల కమీషనర్లకు…
నమస్కారం !
భారత ఎన్నికల సంఘం పక్షపాత, ఏకపక్ష ధోరణితో అప్రజాస్వామికంగా వ్యవహరించేలా ప్రవర్తిస్తున్న తీరును తీవ్రంగా పరిగణిస్తూ ఈ లేఖ రాస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఈ అంశాన్నిమీ దృష్టికి తెచ్చాను. 166-చంద్రగిరి శాసనసభ నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 19వ తేదిన రీపోలింగ్ కు ఎన్నిల సంఘం ఆదేశించింది. ఈ నియోజకవర్గంలో ఓటర్ల తొలగింపు విషయంలో వచ్చిన అనేక ఫిర్యాదుల విషయాన్ని చెబుతూనే ఉన్నాము. వైఎస్ఆర్సీపీ కి చెందిన వారు ఓట్ల తొలగింపు విషయంలో తప్పుడు నకిలీ ఫిర్యాదులు చేశారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఓట్లను తొలగించేలా కుట్ర చేశారు. ఇక్కడే కాదు రాష్ట్రమంత అనేక నియోజకవర్గాల్లో ఈ కుట్రకు వారు పాల్పడి ఓటర్ల హక్కును కాలరాసారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం చేసిన విజ్ఞప్తిని, నకిలీ ఫిర్యాదులు వచ్చిన కంపూటర్ల IP నంబర్ల ను రుజువుగా చూపెట్టినా ఎన్నికల సంఘం స్పందించక పోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఇది తీవ్ర అభ్యంతరకరమైన అంశం.
ఇంకా బాధ కలిగించేది, అభ్యంతరకరమేమిటంటే తెలుగుదేశం చేసిన ఫిర్యాదులన్నిటినీ ఎన్నికల సంఘం పక్కన పెట్టేయడం! వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఫిర్యాదులు చేస్తే ఎన్నికల సంఘం రీపోలింగ్ కు ఆదేశం ఇవ్వడం మరీ ఆశ్చర్యకరంగా ఉంది. అక్రమాలు జరిగిన 166,172,173,192,193,194, 310,311,323 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ పెట్టమని ఏప్రిల్ 12నే టీడీపీ ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం స్పందించలేదు. వచ్చిన ఫిర్యాదులన్నిటినీ పరిగణలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి రీపోలింగ్ జరపాల్సిన కేంద్రాలను ఎన్నికల సంఘం నిర్ణయించాలి.

తెలుగు కుర్రాడి కోసమ అమెరికా ప్రభుత్వం మీద కేసు

గత 6వ తేదీనే కొన్ని చోట్ల రీపోలింగ్ జరిపితే, ఇంత కాలం తర్వాత ఇప్పుడు రీపోలింగ్ మరి కొన్ని పోలింగ్ కేంద్రాల్లో జరపడానికి ఎన్నికల సంఘం ఆదేశించడం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. సాధారణంగా రీపోలింగ్ ఒకే సారి నిర్వహించేలా ఒకే సమయంలో నిర్ణయం తీసుకుంటారు. కేవలం వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుల ఆధారంగా మాత్రమే దశల వారీగా రీపోలింగ్ జరుపుతున్నారంటే ఏమనుకోవాలి ! ఇంకా ఫిర్యాదులు అందితే, ఓట్ల లెక్కింపు తర్వాత ఫలితాలు వెల్లడయ్యాక కూడా రీపోలింగ్ జరుపుతారా ? ఎన్నికల సంఘం న్యాయవిరుద్ధంగా, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ తన మార్గాదర్శకాలనే ఉల్లంఘిస్తూ, సంప్రదాయాలకు తిలోదకాలిస్తోంది.
ఈ ధోరణి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కొనసాగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇంటిలిజెన్సు ఏడీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి … ఇలా ముఖ్యమైన అధికారుల బదిలీలు కూడా ఇదే కోవలో జరిగాయి. కాని టీడీపీ ఓట్లు తొలగించేస్తున్నారు అని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఈసీ నుండి చర్యలే లేవు. బీజేపీ, దాని మిత్ర పక్షాల ఫిర్యాదులపై స్పందించి, విపక్షాల ఫిర్యాదులను విస్మరించడం ఈసీ ఏకపక్ష ధోరణికి అద్దం పడుతోంది. చాల వేగవంతంగా బీజేపీ పక్షాల ఫిర్యాదుల పై స్పందిస్తున్న ఎన్నికల సంఘం- ప్రతిపక్షాల ఫిర్యాదులపై కనీసస్పందన కూడా లేకపోవడం విచారకరం.
ఈ సందర్భంగా బంగాల్ లో జరుగుతున్న పరిణామాలు కూడా ప్రస్తావించాలి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఫిర్యాదు చేసిన తడవే… అక్కడ ఎప్పుడు లేని విధంగా ముందుగానే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్టు ఆదేశాలివ్వడం ఆశ్చర్యం. వివిధ పత్రికల్లో వార్తా కధనాలు ప్రకారం బీజేపీ కి చెందిన రౌడి మూకలు అరాచకాలను సృష్టించడం, బహుముఖ ప్రజ్ఞాశాలి, మహనీయుడు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా బీజేపీ చేసిన ఫిర్యాదులపైనే స్పందిస్తున్న ఈసీ .. తృణముల్ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదులను ఎందుకు స్పందించడం లేదు. ఇది చాల విచారకరం. ఏకపక్ష ధోరణితో ఈసీ రాజ్యాంగంలోని తనకు సంక్రమించిన 324వ ఆర్టికల్ ను ఉపయోగించి బంగాల్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలను నిషేధించేలా నిర్ణయం తీసుకుంది. అక్కడి హింసకు కారణాలపై కనీసం నిష్పక్షపాత విచారణ జరిపించి ఆ నిజాల ఆధారంగా ఈసీ చర్యలు చేపట్టాల్సి ఉండేది.
ఏకపక్షంగా ఈసీ తీసుకుంటున్న చర్యలు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలో 126 సెక్షన్ ఉల్లంఘించినట్టే. పోలింగ్ కి 48 గంటల ముందు వరకు మాత్రమె ప్రచారాన్ని నిలిపివేయాలన్న ఈ నిబంధనను ఎన్నికల సంఘం తుంగలోకి తొక్కింది. పశ్చిమ బెంగాల్లో రాజకీయ కార్యక్రమాలపై నిషేధాన్ని విధించి, రాత్రి 10 గంటలకు ప్రచారాన్ని ముగించాలని నిర్ణయించిన ECI, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ర్యాలీలకు మాత్రం అవకాశం కల్పించింది. అంతకుముందు కూడా MCCని ఉల్లంఘించిన నరేంద్రమోదీకి ఆయన కోరిక మేరకు ECI అనుమతిచ్చింది. రాష్ట్రేతర శక్తులు హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు బీజేపీ కారణం కావడం విచారించదగ్గ విషయం.
బెంగాల్ సంస్కృతి సంప్రదాయాలను విధ్వంసం చేసేలా, బెంగాల్ ప్రజలను నేరస్తులుగా చూపేలా స్కాట్ ఫ్రీ వెళ్ళడానికి అనుమతించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే పశ్చిమ బెంగాల్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన రాష్ట్ర సిఐడి చీఫ్ రాజీవ్ కుమార్‌ను కేంద్రానికి డిప్యుటేషన్‌పై ECI పంపడం రాష్ట్ర ప్రభుత్వ హక్కులు ఉల్లంఘించడమే. అంతేకాకుండా సమాఖ్యవాద సూత్రాలు ఉల్లఘించడం, రాజ్యాంగ విరుద్ధంగా ఉండటం, అఖిల భారత సర్వీసు నిబంధనలను తుంగలోతొక్కడం ప్రమాదకర ధోరణి అవుతుంది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కఠినతర షరతులకు ECI లొంగిపోవడం వల్ల కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికారాల విభజనకు సంబంధించి రాజ్యాంగ నిర్మాణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.
బీజేపీపైన, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై ప్రతిపక్ష పార్టీలు చేసిన ఫిర్యాదులపై ECI ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో మాత్రం ఇందుకు విరుద్ధంగా అధికారులను బదిలీ చేయడం, రీపోలింగ్ నిర్వహించడం, షెడ్యూల్ కన్నా ముందుగానే పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారాన్ని ఏకపక్షంగా నిషేధించడం, మాయావతి వంటి నాయకులకు వ్యతిరేకంగా ఎన్నుకున్న చర్యలు వంటివన్నీ బిజెపి నేతృత్వంలోని యూనియన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పష్టంగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రెండింటిలో అధికార పార్టీలైన టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ రెండూ బీజేపీని కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనూ, రాష్ట్రాల్లోనూ వ్యతిరేకించడం వాస్తవం. బీజేపీయేతర పార్టీల పాలన ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే ఐటి శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా దాడులు జరిగాయి. ఇవే సంస్థలు బీజేపీ నాయకులు, స్నేహపూర్వక పార్టీలపై అసలు దృష్టి పెట్టలేదు. బీజేపీ నుంచి వచ్చిన, బీజేపీకి మద్దతిచ్చే నాయకులపై ఎటువంటి చర్య తీసుకోలేదు.
ECI తన తటస్థత, నిష్పాక్షికత విషయంలో రాజీ పడుతుందనేది వాస్తవం.
పదేపదే MCC ఉల్లంఘనలకు నరేంద్ర మోదీ, అమిత్ షాలు పాల్పడినా ఏ చర్య తీసుకోనందుకు ECI పశ్చాత్తాపపడటం లేదు. ECI సంస్థాగత సమగ్రత, గొప్పదైన ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడింది. బీజేపీ నేరారోపణకు వీడియో ప్రమాణాలు సమర్పించినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదులకు స్పందించకుండా పశ్చిమ బెంగాల్‌కు వ్యతిరేకంగా ఏకపక్ష చర్యలు తీసుకోవడం బీజేపీ, దాని నాయకులకు పూర్తిగా ECI లొంగిపోయిందనే ప్రతిపక్ష పార్టీల నమ్మకాన్ని మరోసారి రుజువుచేసింది.
తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదులను విస్మరిస్తూ పశ్చిమ బెంగాల్లో బీజేపీ, అమిత్ షా ఫిర్యాదుపై తక్షణం చర్య తీసుకోవడం సరైనది కాదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 50% VV PAT స్లిప్పులు లెక్కింపుతో EVM లెక్కింపును ధ్రువీకరించడానికి 22 ప్రతిపక్ష రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకపోవడం ECI వైఖరి స్పష్టం చేసింది.
తన సొంత మార్గదర్శకాలను విస్మరిస్తూ ECI పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేకించి రీపోలింగ్ నిర్వహించడం దిగ్భ్రాంతిని, కలతను కలిగిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు చేసిన వాస్తవమైన ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ, బీజేపీ దాని స్నేహితుల తప్పుడు ఫిర్యాదులపై మాత్రం స్పందిస్తోంది. నరేంద్ర మోదీకి ఎన్నోసార్లు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇది భారతదేశ ఎన్నికల కమిషన్ యొక్క తటస్థత, నిష్పాక్షికత, పారదర్శకతపై సందేహాలను స్పష్టంగా లేవనెత్తుతోంది. ప్రతిపక్ష పార్టీలు చేసిన ఫిర్యాదులపై కూడా ECI చర్యలు తీసుకోవాల్సిన సమయమిది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించి రాజ్యాంగబద్ధమైన ఆదేశాన్ని నెరవేర్చడం ద్వారా విశ్వసనీయతను పునరుద్ధరించుకోవాలి. ఇది ECI యొక్క సంస్థాగత సమగ్రతను మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య ప్రక్రియలోని ఉమ్మడి కార్యాచరణ యొక్క సమగ్రతను కలిగిస్తుంది.
న్యాయసమ్మతమైన విధానాలు, నిష్పాక్షికత, తటస్థత, ECI రాజ్యాంగ ఆదేశానుసారం అంతరాత్మ సూత్రాలను సమర్థించేలా రాజకీయ పార్టీల యొక్క ప్రతి ఫిర్యాదును నిష్పాక్షికంగా, వృత్తిపరంగా పరిశీలించడం, EVM గణనను సరిచేయడానికి కనీసం 50% VV PAT స్లిప్పులు లెక్కించాలన్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధనను పునః పరిశీలించడం, టిడిపి డిమాండ్ చేసిన పోలింగ్ స్టేషన్లో రీపోలింగ్ నిర్వహించడం వంటివి చేయాలని నేను మరోసారి ECIను డిమాండ్ చేస్తున్నాను.
గౌరవాభినందనలతో..
నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి