సినిమా స్క్రిప్టు ఉందా మీ కాడ, అయితే, సలీం కథ చదవండి

(సిఎస్ సలీంబాషా)
60 ఏళ్ల వయసులో అయినా మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు అన్నది నా నమ్మకం. వారం క్రితం ఈనాడు ఆదివారం సంచికలో ఒక చిన్న వ్యాసం వచ్చింది.
అందులో “కథలు స్క్రిప్టు రాయగలిగే ఉత్సాహం ఉన్న వాళ్ళు, మాకు రాయండి.” అని ఉంది.
ఆ ఇట్లాంటివి మామూలే అనుకో నీ నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే చూద్దామని అందులో ఇచ్చిన సైట్ లోకి వెళ్లి చూసిన తర్వాత నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది. పర్వాలేదు రాయవచ్చు అని అనిపించింది.
ఎందుకంటే సినిమా రంగం పట్ల నాకు కూడా కొంచెం ఉత్సాహం ఉంది గనుక. అంతేకాకుండా అక్కడ ఇచ్చిన ఒక చిన్న వాక్యం నన్ను బాగా ఉత్సాహ పరిచింది “మాకు రాయడం కన్నా మిమ్మల్ని కలవడం ఇంకా బావుంటుంది” అని ఇంగ్లీషులో ఉంది.
ఆ సంస్థను దర్శకుడు అతని చెల్లెలు కలిసి స్థాపించారు.నాకు నాకుమరింత ఆసక్తి కలిగి ఆ సంస్థకు సంబంధించిన యువ దర్శకుడు యూట్యూబ్ లో మాట్లాడిన వీడియో చూడడం జరిగింది. అందులో ఆ యువ దర్శకుడు చాలా చక్కగా ఓపెన్ గా తను అనుభవించిన కష్టాలు అవమానాల గురించి వివరించాడు.
అతను ఫేస్ చేసిన కొన్ని కష్టాలు వింటే ఆశ్చర్యమేసింది. చాలామంది నిర్మాతలు ఇబ్బంది పెట్టడం, అయినా అతను తట్టుకుని చివరకు ఒక మంచి సినిమా తీయటం గురించి చెప్పాడు.
నా దగ్గర కూడా ఎన్నో ఐడియాలు ఉండడంవల్ల, సరే ఓసారి కలుద్దామని హైదరాబాదు వెళ్లాను. అక్కడినుంచి నా సినిమా కష్టాలు మొదలయ్యాయి.
ఆ సంస్థ ఇచ్చిన అడ్రసు కనుక్కోడానికి చాలా టైం పట్టింది. ఆ వెబ్ సైట్ లో 11 గంటల నుంచి 5 గంటల మధ్యలో కలవాలని ఉంది. మేము ఎక్కిన ఓలా క్యాబ్, హైదరాబాదు నగరపాలక రోడ్లమీద చక్కర్లు కొడుతూ, అక్కడక్కడ రోడ్లు తవ్వగా, ఎలాగోలా చుట్టూ తిరిగి ఐదు గంటలకు సరిగ్గా పది నిమిషాలు ఉండగా, చేరుకున్నాను.
తీరా చూస్తే ఆ ఫ్లాట్ లో ఆ సంస్థ ఆఫీస్ లేదు! నెల క్రితమే వేరే చోటికి మార్చాలని అక్కడి వాళ్ళు చెప్పారు. వాళ్లని బతిమాలితే కొత్త అడ్రస్ చెప్పారు. దాన్ని పట్టుకోవడానికి చాలా కష్టమయ్యింది. సరే ఆ సంస్థకు సంబంధించిన ఇంకో సంస్థకు ఫోన్ చేస్తే మీరు ఎందుకు వచ్చారు, పంపిస్తే సరిపోయేది కదా ఏదైనా సమాచారం అన్నారు.
చాలా దూరం నుంచి వచ్చాను ఒకసారి కలుస్తాను అని చెప్తే ఆ సంస్థకు సంబంధించిన ఒక యువతి (యువదర్శకుడి) చెల్లెలు నన్ను చూసి చాలా ఆశ్చర్య పోయింది. మీరు ఎందుకు వచ్చారు, ఇక్కడికి ఎలా వచ్చారు వచ్చారు అని అడిగింది. నేను ఇట్లా కథలు ఉన్నాయి నా దగ్గర అందుకే మీరు ఇలా వెబ్సైట్లో ఇచ్చిన ప్రకారం ఐదు గంటలకు ముందే వచ్చాము , అని చెబితే , ప్రస్తుతము ఆ దర్శకుడు( అన్నయ్య) వేరేసినిమా లో బిజీగా ఉన్నారు.
మీరు జూలై లో మళ్లీ కాల్ చేయండి అన్నారు. మా వెబ్ సైట్ లో ఇలా ఉందా అని ఆశ్చర్యపోయి చూపించమని అడిగితే నేను ఆ సమాచారం చూపించాను.
అప్పుడు ఆమె మీరు ఒక చిన్న కథను రాసి పంపించండి అంటే నేను రాయను
అని చెప్పాను. మాట్లాడడానికి అంతదూరం నుంచి వచ్చాము, వీలైతే మాట్లాడదాం, లేదంటే వెళ్లిపోతామని చెప్పాం. అంతలో ఆ దర్శకుడు కూడా ఆఫీసుకు వచ్చారు. నేను మాట్లాడతా మని అంటే, ఇప్పుడు కుదరదు అన్నారు ఆ యువతి. సరే మేము మళ్లీ కలుస్తాం లెండి అని చెప్పి వచ్చేసాను.
చాలా కష్టాలు పడి సినిమా తీశానని చెప్పుకుంటున్న దర్శకుడు తమ వెబ్సైట్లో ఏ సమాచారం ఉన్నదో కూడా తెలుసుకో లేనంత బిజీగా ఉన్నాడు అన్నమాట. ఆఫీస్ అడ్రస్ మారిస్తే ఆ విషయం అంత తీరిక కూడా లేదన్న మాట.
సినిమా వాళ్ళ ని కలవడం కష్టం, కథలు చెప్పడం కష్టం అని ఎవరన్నా చెబితే మీరిప్పుడు నమ్మొచ్చు. ఎందుకంటే అన్ని కష్టాలు పడి వచ్చిన ఒక దర్శకుడు తన సంస్థను కొద్దిగా నడపకపోవడం విచిత్రం. చివరకు తాను చెప్పిన ఇంకో మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలి. కనీస మానవత్వం కూడా చూపించలేదు చాలామంది అన్నదే ఆ మాట.
దాదాపు మూడు గంటల నుండి మండే ఎండలో చాలా దూరం నుంచి వచ్చిన ఓ పెద్దమనిషి( అంటే నేనే) కి కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదు అంటే సంస్థను ఎలా నడుపుతున్నారో అన్నా చెల్లెలు అర్థమవుతుంది.
సినిమాలు తీయడం కష్టం అని అనుకున్నాను కానీ, చాలా కష్టమని ఇప్పుడు అర్థమైంది. తీయటం మాట దేవుడెరుగు, కథలు చెప్పడం మరింత కష్టం అని రుజువయింది.
కొసమెరుపేంటంటే ఎన్నో ఢక్కామొక్కీలు తిని, అవమానాలు దిగమింగి ఒక చక్కని సినిమా తీసిన ఆ దర్శకుడు సంస్థను సరిగ్గా నడపకపోవడం. అయితే ఇదంతా ఆ దర్శకుడికితెలియకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అతని చెల్లెలి తో మాత్రమే మాట్లాడగలి గాము. అయినా చాలా చోట్ల నేను మా చెల్లి ఈ సంస్థను పెట్టాము అని ఆ దర్శకుడు చెప్పడం జరిగింది. అతని చెల్లెలికి ఈ దర్శకుడి కష్టాలన్నీ తెలిసే ఉంటాయి కదా? మరి అలాంటప్పుడు అలా ప్రవర్తించడం విచారకరం.
నా ఉద్దేశ్యం ఏంటంటే అంత చక్కగా ఒక వెబ్సైటు, పత్రికల్లో సమాచారం ఇచ్చిన తర్వాత మొత్తం ఆ సంస్థ సరిగ్గా వ్యవహరించ లేకపోవడానికి కారణమేంటంటే ఒకసారి సక్సెస్ వచ్చిన తర్వాత ఆ స్థాయిలో ఆలోచించక పోవడమే. ఆ దర్శకుడి తప్పు లేకపోవచ్చు. కానీ సంస్థను పద్ధతిగా నడపడానికి ఏర్పాటు చేసి ఉండాలి కదా? కనీసం తాను పడిన కష్టాలు వేరే రచయితలూ కానీ దర్శకులు కానీ పడకూడదని చెల్లెలికి బ్రీఫ్ చేసి ఉండొచ్చు కదా. అది మాత్రం దర్శకుడి తప్పే!
మరో కొసమెరుపు ఏంటంటే ఆ దర్శకుడు తీసిన సినిమా కి రివ్యూ నేను రాయడం!!!
కాబట్టి సినిమా కథలు చెప్పాలనుకునే రచయితలు పెళ్లయితే ఇంట్లో భార్యకి, కాకపోతే ఇరుగు పొరుగు వాళ్లకి చెప్పుకోవడం బెటర్.
సినిమా కథ చెప్పాలన్న నా ఉత్సాహం ఖరీదు అక్షరాల 555 రూపాయలు.
సరేఇదంతా రాసింది కోపం తో కాదు. వేరే వాళ్ళకి ఇటువంటి పరిస్థితి ఎదురు కాకూడదని..
ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పలేదు కదూ
“ఆ!”

(ఫోటో దిఫ్రిస్కీ డాట్ కామ్ నుంచి)