టీడీపీకి గుడ్ బై చెప్పిన మరో సీనియర్ నేత

ఏపీ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి టీడీపీ నేతల చేరిక పరంపర కొనసాగుతోంది. అనూహ్య రీతిలో అధికార పార్టీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. దీంతో టీడీపీ అధిష్టానంలో గుబులు మొదలైనట్టు తెలుస్తోంది. పైకి మేక గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం జంపింగ్ ల గురించి మదనపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్ వంటి కీలక నేతలు టీడీపీని వీడగా ఈ ఖాతాలోకి మరో నేత చేరారు.

టీడీపీ సీనియర్ నేత, ప్రముఖ వ్యాపారవేత్త దాసరి జై రమేష్ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీ గూటికి చేరారు. సీనియర్ ఎన్టీఆర్ హయాం నుండి ఆయన పార్టీకి సేవలు చేస్తూ వచ్చారు. అటువంటి కీలక నేత పార్టీని వీడటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. శుక్రవారం సాయంత్రం వైసీపీ అధినేత జగన్ తో లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు దాసరి. జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

చంద్రబాబు సీఎం అవడానికి నేను ఎంతో సహాయం చేశాను. నాదెండ్ల భాస్కరరావు సీఎం అయినప్పుడు పార్టీని కాపాడటానికి నావంతు కృషి చేశాను. టీడీపీ నుండి నేను సంపాదించింది ఏమి లేదు. చంద్రబాబు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. జగన్ విలువలు నాకు నచ్చాయి. అందుకే వైసీపీలో చేరాను అని వివరించారు దాసరి జై రమేష్. వైసీపీ అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుండి పోటీ చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *