పాలమూరు కాంగ్రెస్ కు మరో షాక్.. నాగం చిరకాల ప్రత్యర్థి టిఆర్ఎస్ కు జంప్

పాలమూరులో రాజకీయ పరిణామాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇప్పటికే పాలమూరులో బలమైన నేతలుగా ఉన్న రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డిలను చేర్చుకుంది. మరికొందరు నేతలకు వల వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒకవైపు పార్టీలోకి లీడర్లు వలస వస్తుంటే మరోవైపు కొందరు లీడర్లు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ వీడే వారి జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి చేరిపోయారు. ఆయన రేపో మాపో టిఆర్ఎస్ కారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయం అన్న చర్చ ఉంది.

నిజానికి నాగం జనార్దన్ రెడ్డి రాకను కాంగ్రెస్ లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. నాగం వస్తే పార్టీకి నష్టం అంటూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసింది. ఆ వర్గంలో జిల్లాలోని పలువురు కీలక నేతలు ఉన్నారు. అందులో మాజీ మంత్రి డికె అరుణ, ప్రస్తుత ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డితోపాటు పవన్ కుమార్ రెడ్డిలాంటి నేతలంతా ఉన్నారు. అయితే నాగం రావడంతో మొదట ఎఫెక్ట్ అయ్యేది కూచుకుళ్ళ దామోదర్ రెడ్డికే. అందుకే ఆయన చివరి వరకు నాగం రాకను అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన టిఆర్ఎస్ గూటికి వెళ్లడానికి సన్నద్ధమవుతున్నారు.

హైదరాబాద్ లోని కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఇంటికి నాలుగైదు రోజుల క్రితం మంత్రి హరీష్ రావు స్వయంగా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అనుచరుడు ఒకరు ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు ధృవీకరించారు. మంత్రి హరీష్ రావు ఆహ్వానం మేరకు దామోదర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి టిఆర్ఎస్ లో చేరతారని చెప్పారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం నాగర్ కర్నూలు సీటు దామోదర్ రెడ్డికి కానీ, ఆయన కుమారుడికి కానీ ఇస్తామన్న హామీ ఏమైనా ఇచ్చారా? లేదా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే నాగర్ కర్నూలులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో బాగానే పట్టు సాధించారు. రానున్న ఎన్నికల్లో ఆయనకే మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం కూడా మరో నాలుగేళ్లపాటు ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దామోదర్ ఫ్యామిలీకి 2019లో ఏ కోశాన చూసినా సీటు రాకపోవచ్చని చెబుతున్నారు. ఒకవేళ 2024 లో దామోదర్ రెడ్డి తనయుడికి సీటు వస్తదన్న ఉద్దేశంతోనే వారు పార్టీ మారే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

దీనికి తోడు చిరకాల ప్రత్యర్థి అయిన నాగం ను కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఓడించలేము కాబట్టి టిఆర్ఎస్ లో చేరి రానున్న 2019 ఎన్నికల్లో నాగం ను ఓడించాలన్న కసితో కూచుకుళ్ల ఉన్నట్లు చెబుతున్నారు. నాగం రాకను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించిన ఆయన ఇక లాభం లేదనుకుని టిఆర్ఎస్ లో చేరుతున్నారు. అయితే నాగంకు వ్యతిరేకంగా 19 ఎన్నికల్లో తీవ్రంగా పని చేయాలని దామోదర్ రెడ్డి ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇప్పటివరకు నాగం మీద ఆరుసార్లు దామోదర్ రెడ్డి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఈ పరిస్థితుల్లో జీవితంలో ఒక్కసారైనా నాగం ను ఓడించి తన తడాఖా చూపాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక కూచుకుళ్ల ఒక్కరే పార్టీ మారతారా? లేదంటే ఆయన వర్గంలో ఉన్న పెద్ద తలకాయలు కూడా పార్టీ మారతాయా అన్న చర్చ ఇప్పుడు పాలమూరు పాలిటిక్స్ లో జోరందుకుంది. నాగం రాకతో ఒక వికెట్ డౌన్ అయినట్లే రానున్న అతి కొద్ది రోజుల్లో రేవంత్ కు ప్రచార కార్యదర్శి పదవి కట్టబెట్టగానే మరికొన్ని వికెట్లు డౌన్ అవుతాయని చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో కీలక నిందితుడిగా ముద్ర పడిన రేవంత్ ను పార్టీలోకి తీసుకోవడమే కాకుండా పెద్ద పోస్టు కట్టబెడతారా అని కాంగ్రెస్ కు చెందిన పాలమూరు నేతలే కాక చాలామంది ఇతర జిల్లాల సీనియర్లు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టిఆర్ఎస్ లో చేరవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్ కూడా ఈ విషయంలో అదునుకోసం ఎదురుచూస్తున్నట్లు పార్టీలో టాక్ నడుస్తోంది. ఏ క్షణంలో రేవంత్ కు పదవి దక్కుతుందో మరు క్షణంలో పెద్ద పెద్ద లీడర్లుగా ముద్ర పడిన వారు కొందరు కాంగ్రెస్ నుంచి జంప చేస్తారన్న ఊహాగానాలు వినబడుతున్నాయి.

మొత్తానికి పాలమూరు రాజకీయాల్లో పార్టీలు వేరైనా వైరం మాత్రం పాతవారితోనే కొనసాగడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *