పార్టీ మారడంలో కాంగ్రెస్ గండ్ర స్టయిలే వేరయా

టిఆర్ఎస్ వర్గాలు లీక్ ఇచ్చినట్లే తెలంగాణ రాజకీయ తెర మీద మరో సీన్ ఆవిష్కృతమైంది. ప్రతిపక్ష కాంగ్రెస్ వారు ఖండించిన ముచ్చట ఉత్తదే అని తేలిపోయింది. మూడు వికెట్లు పడతాయని గులాబీ శ్రేణుల గుసగుసలు నిజమే అన్నట్లు ఒక వికెట్ పడిపోయింది. భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి తన సతీమణి గండ్ర జ్యోతిని వెంట పెట్టుకుని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటిఆర్ కు పూలబొకే ఇచ్చి కలిసొచ్చారు. సోమవారం ఈ సీన్ రాజధాని హైదరాబాద్ వేదికగా రాజకీయ తెర మీద కనబడింది. తాము కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమే అని గండ్ర కూడా రొటీన్ ప్రకటన ఒకటి కాంగ్రెస్ మొఖాన కొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ఖండించినా ఆపరేషన్ ఆకర్ష్ మంత్రం ముందు ఉత్త ఒర్లుడే అయిపోయింది. అధికార పార్టీ ఎత్తుల ముందు ప్రతిపక్ష కాంగ్రెస్ అరుపులు అరణ్య రోధనే అయింది. ఇప్పటి వరకు చేరినవారంతా ఒక స్టయిల్ అయితే గండ్ర చేరుడు ఒక స్టయిల్ లో సాగింది. ఆయన కొత్త రకంగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వివరాలేంటో చదవండి.
టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు టిఆర్ఎస్ లో వచ్చి చేరారు. కేసిఆర్ కనుసైగ చేసిన వెంటనే వచ్చి టిఆర్ఎస్ లో చేరిపోయారు. తొలుత కాంగ్రెస్ లో గులాబీ వల విసిరిసింది ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద. వారు తొలుత అట్ల లేదు… ఇట్ల లేదు అని ఉత్తుత్తి ఖండనలు చేశారు. తర్వాత కేటిఆర్ ను కలవడం, పూలబొకే అందించడం చకచకా జరిగిపోయాయి. వారు కేటిఆర్ ను కలిసిన సందర్భంగా ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖను టిఆర్ఎస్ పార్టీ నుంచే రాయించారనుకోండి. ఆ లేఖ సారాంశం ఏమంటే… మేము టిఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నాము. కేసిఆర్ నాయకత్వంలో పనిచేయాలనుకున్నాము. తెలంగాణ అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం టిఆర్ఎస్ లో చేరాలనుకున్నాము. అని రాస్తూనే… అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమే… అని లేఖలో వెల్లడించారు.

రేగా కాంతారావు, ఆత్రం సక్కు చూపిన బాటలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా నడిచారు. తొలుత లీక్ రావడం… వారు ఖండించడం… ఆ తర్వాత కేటిఆర్ ను పూలబొకేతో కలవడం, ఒక లేఖ విడుదల చేయడం ఇలా వరుసగా తంతు జరిగిపోయింది. అదే తరహాలో దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వ్యవహరించారు. వనమా వెంకటేశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, చిరుమర్తి లింగయ్య, జాజాల సురేందర్ లాంటి వారంతా గులాబీ కారెక్కేశారు.
ఇక ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ మాత్రం కొద్దిగా డిఫరెంట్ గా జాయిన్ అయ్యారు. ఆమె గతంలో టిడిపిలో పనిచేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డితోపాటు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో టికెట్ రావడం, ఇల్లెందులో గెలవడం జరిగిపోయిన తర్వాత ఆమెపై గులాబీ పార్టీలో చేరాలన్న వత్తిళ్లు వచ్చాయి. ఆమె కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరురాలుగా ఉన్నారు. దీంతో ఆమె టిఆర్ఎస్ లో చేరేందుకు ససేమిరా అన్నారు. ఆ సమయంలో ఆమె భర్తను రంగంలోకి దింపారు. హరిప్రియ నాయక్ భర్త కేటిఆర్ ను కలిసి తాము టిఆర్ఎస్ లో చేరతామని ప్రకటించారు. హరిప్రియ నాయక్ పేరు లేకుండానే ఒక లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరిన విషయంపై హరిప్రియ నాయక్ ఎక్కడా జనాల ముందు అధికారికంగా ప్రకటించిన దాఖలాలైతే లేవు.

ఇక గండ్ర కొద్దిగా డిఫరెంట్ గా కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. వాస్తవంగా అయితే అందరు ఎమ్మెల్యేల లాగే గండ రాజీనామాలేఖలో ‘‘అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను’’ అనే పదం ఉండాలి. కానీ ఆ పదం లేదు. దానికి బదులు ‘‘అవసరమైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన అన్ని పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమే’’ అనే పదం వచ్చి చేరింది. అంతకుముందు పార్టీ మారుతున్నట్లు చెప్పినవారంతా అవసరమైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అని రాసిచ్చారు. ఇప్పటికే పదిమంది ఎమ్మెల్యేలు కారెక్కడం… ఎలాగో సిఎల్పీని టిఆర్ఎస్ లో విలీనం చేయబోతున్నారు కాబట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను అన్న అవసరం రాదనుకున్నారేమో గండ్ర చేత ఆ పదాన్ని వాడించలేదని రాజకీయ వర్గాల్లో చమత్కార చర్చ సాగుతున్నది. గండ్రతోపాటు ఆయన సతీమణి, భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా పార్టీ మారారు. ఆమె టిఆర్ఎస్ లో చేరడం వెనుక కూడా చాలా పెద్ద కథే ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్త కూడా చదవండి…

https://trendingtelugunews.com/who-is-undermining-telangana-congress-from-within/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *