సీమలో ప్రాజెక్టులన్నీ పెండింగే : కృష్ణా రైతు నేత ఏర్నేని నాగేంద్రనాథ్ 

సీమ నీటి ప్రాజెక్టులు వైస్సార్ కలల మేరకు  పూర్తి అయితేనే రాయలసీమకు నీళ్లు- ఏర్నేని నాగేంద్రనాథ్ 
(యనమల నాగిరెడ్డి)
రాయలసీమ నీటి ప్రాజెక్టులన్నీ దివంగత ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి కన్న కలల పూర్తి అయితేనే ఈ ప్రాంత   ప్రజలకు తాగునీరు, బీడు భూములకు సాగునీరు అందగలవని, అలా జరగక పొతే ఎప్పటికీ ఈ ప్రాంతం ఇలాగే కరువు-కాటకాలతో విలవిలలాడక తప్పదని క్రిష్ట్నా జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఏర్నేని నాగేంద్రనాథ్ వాపోయారు.
ఈ నెల 19,20 తారీఖులలో రెండు రోజుల పాటు క్రిష్ట్నా నదిపై ఉన్న ప్రాజెక్టులను, రాయలసీమ లో అరకొరగా నిర్మితమైన ప్రాజెక్టులను ఏడు మంది సహచరులతో కలసి సందర్శించారు.
సీమ ప్రాజెక్టుల స్థితిగతుల పై ఈ ప్రతినిధితో సుదీర్ఘంగా మాట్లాడారు. 
ఈ బృందంలో నాగేంద్రనాథ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జెట్టి గుర్నాధం, నల్లమాడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుల్లా రాజమోహన్ రావు, ఒంగోలు ప్రాంత అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండ్రు రంగారావు, రాజధాని ప్రాంత ఉద్యమకారుడు అనుమోలు గాంధీ, రైతు సమాఖ్య నాయకులు సి.ఎస్.ఆర్ కోటిరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ బృందం పులిచింతల, నాగార్జునసాగర్, శ్రీశైలం, బనకచెర్ల క్రాస్ రెగులేటర్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్, మల్యాల దగ్గర ఉన్న హంద్రీ-నీవా లిఫ్ట్ ప్రాజెక్టులను సందర్శించారు. 
ఇది కూడా చదవండి
బయోమెడికల్ వేస్టుకు విరుగుడు కనిపెట్టిన బెంగళూరు స్టార్టప్
ఆయన ఈ ప్రతినిధితో మాట్లాడుతూ  స్వర్గీయ ఎన్టీఆర్ 1985-89 మధ్య ప్రారంభించిన నీటి ప్రాజెక్టులు నేటికీ పూర్తి కాలేదని, 2004-2009 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వైస్సార్ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేసినా వైస్సార్ అకాల మరణం తర్వాత వీటిని ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్ట్ ప్రతిపాదనలు తయారు చేసిన అధికారులు కూడా మనసు పెట్టి పనిచేయలేదని వ్యాఖ్యానించారు. 
అధికారుల అంచనాలు , అధినేతల ఆలోచనలు, ప్రజల ఆశల  మేరకు క్రిష్ట్నా నదిలో ఉన్న 30/40 రోజుల వరద కాలంలో రాయలసీమకు నీటిని తరలించడానికి  ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుల సామర్థ్యం ఆ మేరకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు. 
ఎన్నో వివాదాలు, ప్రాంతీయ విభేదాలు, భరించరాని రాజకీయ నాయకుల వ్యతిరేకత మధ్య పోతిరెడ్డిపాడు(ఎస్.ఆర్.బిసి) హెడ్ రెగులేటర్ సామర్త్యాన్ని 11వేల  క్యూసెక్కులకు అదనంగా వైస్సార్ మరో 44 వేల క్యూసెక్కులకు పెంచారని గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 2500 క్యూసెక్కుల మేరకు పంపే అవకాశం ఉంది. గేట్ల సామర్థ్యం 57500 క్యూసెక్కుల మేరకు ఉన్నా నిర్మించిన కాల్వలు, అక్విడక్టులు, బ్రిడ్జిలు మాత్రం 30 వేల క్యూసెక్కుల నీటిని మించి పంప లేవని ఆయన అభిప్రాయ పడ్డారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగులేటర్ ద్వారా తెలుగుగంగ, గాలేరు-నగిరి, శ్రీశైలం కుడికాల్వ ప్రాజెక్టులకు సుమారు 105 టిఎంసిల  నీళ్లు ఇవ్వవలసి ఉందని ఆయన గుర్తు చేశారు. మద్రాసుకు తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్.ఆర్.బిసికి 19 టీఎంసీలు టీఎంసీలు తప్ప మరే ప్రాజెక్టుకు కేటాయింపులు లేవని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మిగిలిన అన్ని ప్రాజెక్టులకు వరద కాలం లోనే నీళ్లు తరలించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
ఇకపోతే రాయలసీమలోని మెట్ట ప్రాంతాలకు నీటిని అందించడానికి  నిర్మించిన హంద్రీ-నీవా ఎత్తిపోతల పధకం ద్వారా ప్రస్తుతం 2350 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోయ గలుగుతున్నారని అన్నారు. లైనింగ్ చేస్తే కాల్వ సామర్థ్యం అంచనా మేరకు 3350 క్యూసెక్కులకు చేరుకుంటుందని ఆయన అన్నారు. ప్రస్తుతం 10 మోటార్లు అక్కడ ఉన్నా 6 మోటార్లు పనిచేస్తున్నాయని, ప్రాజెక్ట్ అంచనాల మేరకు నీళ్లు తరలించడం సాధ్యమైతుందా? అన్నది సందేహాస్పదమే అన్నారు.
రెండు సంవత్సరాలకు ముందు తాను ఈ ప్రాజెక్టును  సందర్శించిన సమయంలో కూడా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా ఫలితం లేదని ఆయన వాపోయారు.  
 
సుమారు 35 సంవత్సరాలకు ముందు ప్రారంభమై ఇప్పటికీ పూర్తి కాని అన్ని ప్రాజెక్టులను మొదట అంచనాలు వేసిన మేరకు నీటిని తరలించడానికి అనుగుణంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని, అవసరం మేరకు వాటి సామర్థ్యాలని పెంచాలని అలా చేస్తేనే రాయలసీమ ప్రాంతానికి అవసరమైన మేరకు నీటిని సరఫరా చేయగలరని తమ బృందం  అభిప్రాయ పడిందని నాగేంద్రనాథ్ తెలిపారు.
ప్రస్తుత వరద కాలంలో సుమారు 800 టీఎంసీల మేరకు క్రిష్ట్నాలో నీళ్లు వచ్చాయి. అందులో సుమారు 300 టీఎంసీల వరకు సముద్రంలోకి వెళ్లిపోయాయి. కానీ రాయలసీమ అవసరాల కోసం మాత్రం “నీరున్నా తీసుకోలేని దుస్థితి” ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గోదావరి నుండి ఏ మార్గంలో నీటిని  తరలించినా రాయలసీమలో పారించడానికి అవకాశాలు తక్కువని ఆయన అభిప్రాయ పడ్డారు. 
రాయలసీమకు నీటిని తరలించడానికి రాజకీయాలతో ముడిపడిన సంక్లిష్టమైన అంశాలతో పాటు, ప్రాంతీయ విభేదాలు , అంతరాష్ట్ర వివాదాలు, సాంకేతికమైన అంశాలు లాంటి అనేక అడ్డంకులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాయలసీమ ఉద్యమకారులు, మేధావులు గతంలో జరిగిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి ఇతరులను దూషించడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా  ప్రస్తుతం జరగవలసిన అంశాలపై ద్రుష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సీమ లోని ప్రాజెక్టులు పూర్తి కాకుండా క్రిష్ట్నాలో ఎన్ని నీళ్లు వచ్చినా, గోదావరి నీళ్లు క్రిష్ట్నకు తరలించినా సీమ ప్రజలకు అందే ప్రయోజనం అంతంత మాత్రమేనని, అందువల్ల ఉద్యమకారులు, మేధావులు ఇతర ప్రాంత నాయకులను కూడా కలుపుకొని సమన్వయంతో రాయలసీమ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెవాలని, ఈ ప్రాంత కనీస నీటి అవసరాలు తీర్చడానికి అవసరమైన నీటిని తరలించడానికి అనుగుణంగా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాలని పెంచడానికి, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.