వైఎస్ కూడా పార్టీ ఫిరాయింపుదారుడే… చురకేసిన చంద్రబాబు

తన మీద చేస్తున్న విమర్శలకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ ఎన్నిక తర్వాత జరుగుతున్న చర్చ అధికార పార్టీ ఉత్సాహంతో ఒక వైపే వెళ్లిపోతున్నపుడు చంద్రబాబుజోక్యం చేసుకుని ఆసక్తి కరమయిన విషయాలు చెప్పి కొద్దిసేపు చర్చను తన వైపు తిప్పుకున్నారు.

ఈ రోజు చంద్రబాబు మీద ముఖ్యమంత్రి జగన్, వైసిపి సభ్యులు ముప్పేట దాడి ప్రారంభించారు.

ఆయన గతంలో ఫిరాయింపులను ప్రోత్స హించడం మీద, ఈరోజు స్పీకర్ ఎన్నిక తర్వాత ఆయన సభాపతి స్థానం దాకా తీసుకువెళ్లేందుకు రాకపోవడం మీద అస్త్రాలు సంధించారు. సభా మర్యాద పాటించలేదని విమర్శించారు.

అయితే, పార్టీ ఫిరాయింపుల మీద,సభాపతి ఎన్నిక మీద చంద్రబాబు ధీటైన సమాధానం ఇచ్చారు.

సభా ఎన్నిక విషయం మాటవరసకు కూడా ప్రతి పక్ష నాయకుడికి చెప్పలేదని, సభా మర్యాదను ఇది ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు.

ఈ విషయాన్ని వివరంగా ఆయన సభ ముందుంచారు. స్పీకర్ గా తమ్మినేని సీతారాం పేరును ప్రకటించగానే స్పీకర్  ఎన్నిక మీద ప్రొటెం స్పీకర్ సభామర్యాద ప్రకారం తమని సంప్రదిస్తారని భావించామని అయితే ఆపని చేయలేదని అన్నారు. ప్రతిపక్ష నేతను విస్మరించారని అన్నారు.

గతంలో తాము స్పీకర్ గా కోడెలను ఎంపిక చేశాక మంత్రులను ప్రతిపక్షనాయకుడు జగన్ దగ్గిరకు పంపిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.

కోడెల అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆరోజు వైసిపి సభ్యులు కూడా నామినేషన్ పత్రాల మీద సంతకాలు చేశారని కూడా చంద్రబాబు సభ ముందుంచారు.

ఈ సారి ఏం జరిగింది? స్పీకర్ ఎన్నికల మీద ఒక్కమాటయినా చెప్పలేదు, చెబుతారేమోనని తాను ఎదురుచూశానని ఆయన అన్నారు.

ఇక పార్టీ ఫిరాయింపుల మీద తన మీద జరుగుతున్న దాడి గురించి చెబుతూ ముఖ్యమంత్రి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పార్టీ మారిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగం తొలిప్రసంగమే ప్రతిపక్షాన్ని కించపరుస్తూ ఉందని ఆయన చెప్పారు. 1978లో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయిన రాజశేఖర్ రెడ్డి పార్టీ మారలేదా అని ప్రశ్నించారు.

గెలిచిన నాలుగురోజుల్లోనే వైఎస్ పార్టీ మారాడానిచెబుతూ అప్పట్లో సీనియర్ నాయకుడు భాట్టం శ్రీరామ్మూర్తి పార్టీ ఫిరాయించడాన్ని మీ కంటే తీవ్రంగా జగన్ తీవ్రంగా విమర్శించారని అన్నారు. ‘చరిత్ర ఒక సారి తెలుసుకోవాలి. ఒక తండ్రికి వారసుడిగా చెప్పుకుంటున్నపుడు ఆయన చేసిన విషయాలు కూడా గుర్తు పెట్టుకోవాలి. మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకుంటారా? అని ప్రశ్నిస్తూ అధికార పార్టీ సంప్రదాయాలను విస్మరించినా తాము పాటిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.