వీర జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం

జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన అత్యంత బాధాకరం అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. పుల్వామా ఘటనపై స్పందించిన ఏపీ సీఎం… వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున ఆర్ధిక సహాయం ప్రకటించారు. అయన ఏం మాట్లాడారో కింద చదవండి.

మానవ సమాజంలో ప్రాణాలు బలితీసుకునే ఈ తరహా దారుణాలు దుర్గార్గం. అత్యంత హేయం. జరిగిన దారుణంలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడం గుండె చెదిరే విషాదం. ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలకైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుంది.

మున్ముందు మరెప్పుడూ ఇలాంటి ఘోరకలి జరగకుండా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట వ్యూహాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. అమర జవాన్ల త్యాగాలను జాతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. భారత సైనికులు నిరంతరం ఈ దేశాన్ని రక్షించే బాధ్యతను భుజాన వేసుకుని అహర్నిశలూ అప్రమత్తంగా వుంటూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

మన కుటుంబాలను రక్షిస్తున్నారు. ప్రాణాలను సైతం ఫణంగా నిలిపి తెగువ చూపుతూ మనందరిలో స్ఫూర్తిని నింపుతున్నారు. పుల్వామా దాడిలో ఒక్కరు, ఇద్దరు కాదు, 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జాతిని దిగ్భ్రాంతికి గురిచేసింది అని ఆవేదన వ్యక్తం చేసారు చంద్రబాబు.

ఇలాంటి విపత్కర సమయంలో జవాన్ల కుటుంబాలకు మనం అండగా నిలవాలి. ఆ వీర జవాన్ల కుటుంబాలకు నైతికస్థైర్యం అందివ్వడం మనందరి తక్షణ కర్తవ్యం. సైనికుల జీవితాలను మనం అందించే సాయంతో వెలకట్టలేం. కానీ, మనవంతు సహకారం అందించాల్సిన బాధ్యతను విస్మరించలేం.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు పుల్వామా ఘాతుకానికి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఒక్క గొంతుకగా నిలిచి అమరుల కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. వీర జవాన్ల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్క అమర జవాన్ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటిస్తున్నాను అని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *