విశ్లేషణ: చంద్రబాబు/జగన్ – ముఖ్యమంత్రిగా ఎవరు బెటర్?

(శ్రవణ్ బాబు)

ఆంధ్రప్రదేశ్ లో తటస్థంగా ఉండే విద్యావంతులు, ఆలోచనపరులు ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వారికి ముందుచూస్తే నుయ్యి, వెనకచూస్తే గొయ్యి(పెనంనుంచి పొయ్యిలోకి అని, ఇంగ్లీషులో between the devil and the deep sea అనికూడా అంటారు) అన్నట్లుగా ఉంది . ఒకవైపేమో, ఏపీలో అవినీతిని కనీ వినీ ఎరగని రీతిలో తారాస్థాయికి చేరేటట్లు చేసి, అస్మదీయవర్గం దోచుకోటానికి తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మరోవైపేమో… ఏమి చేసైనా ముఖ్యమంత్రి గద్దెనెక్కాలనే ఏకైక లక్ష్యంతో సాగుతూ, ఏపీ అభివృద్ధి అవ్వకూడదని బలంగా కాంక్షించే కేసీఆర్ తో జట్టుకట్టిన ప్రతిపక్ష నాయకుడు జగన్ ఉన్నారు. మూడో ప్రధాన పార్టీగా జనసేన ఉన్నప్పటికీ దానిని టీడీపీ, వైసీపీల స్థాయిలో ఎక్కువమంది చూడటంలేదు కాబట్టి ఈ రెండింటిపైనే అందరి దృష్టీ ఉంది. ఈ రెండింటిలో ఏ పార్టీకి ఓటు వేయాలనేది తెలియక తటస్థులు తికమక పడుతున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల అధినేతలలో ఎవరు మెరుగైన ముఖ్యమంత్రి అభ్యర్థో ఒకసారి పరిశీలిద్దాం.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబును టీడీపీ అభిమానులేమో అపర చాణుక్యుడని, ప్రత్యర్థులేమో జిత్తులమారినక్క అని అంటారు. 1982లో రామారావు తెలుగుదేశాన్ని పెట్టినపుడు, నాడు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు తన మామపై తీవ్ర విమర్శలు చేశారు. అవసరమైతే మామపైనే పోటీ చేస్తానని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ఓడిపోవటంతో, నిస్సిగ్గుగా గోడ దూకి టీడీపీలో చేరిపోయారు. 1995లో పార్టీలో తీవ్రంగా పెరిగిన అసమ్మతిని, అల్లకల్లోలాన్ని తనకు అనుకూలంగా మలుచుకుని తోడల్లుడు వెంకటేశ్వరరావువంటి ప్రతికూలతలనుకూడా తనవైపుకు తిప్పుకుని మఖ్యమంత్రి అయ్యారు. ప్రభుత్వాన్ని, పార్టీనికూడా హైజాక్ చేసి రామారావును రోడ్డుమీద నించోబెట్టారు. ఆ మానసిక క్షోభతోనే రామారావు 1996లో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. 1995-2004 వరకు పాలించిన సమయంలో చంద్రబాబుకు సమర్థవంతమైన అడ్మినిస్ట్రేటర్ గా, టఫ్ టాస్క్ మాస్టర్ గా మంచి పేరే తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ లాంటి శిఖర సమానుడిని జనం మర్చిపోయేలా చేయటంకోసం జన్మభూమి, శ్రమదానం వంటి కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసుకున్నారు, ప్రభుత్వోద్యోగులతో బాగా పనిచేయించేవారు. జాతీయ రాజకీయాలలోకూడా కీలకపాత్ర పోషించారు. హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందటంలో కూడా చంద్రబాబు పాత్రనుకూడా తీసిపారేయలేము. అయితే, ఐటీ పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకొచ్చింది తానేనని చంద్రబాబు పదే పదే కొట్టుకునే సొంతడబ్బాను పరిగణనలోకి తీసుకోనవసరంలేదు. ఎందుకంటే  గ్లోబలైజేషన్ ఫలితంగా ఐటీ పరిశ్రమ దేశంలో కాళ్ళూనుకుంటున్న క్రమంలోనే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చెందటం అనేది నాడు ఏర్పడిన సహజ పరిణామం. అయితే ఆ సమయంలో ఐటీ పరిశ్రమ పొటెన్షియల్ ను గుర్తించి హైదరాబాద్ లో ఆ రంగం అభివృద్ధి చెందటానికి బాబు కెటలిస్ట్ లాగా దోహదపడిన విషయాన్ని కాదనలేము. ఆ సమయంలో బెంగళూరు, చెన్నైలలోకూాడా ఐటీ పరిశ్రమ గణనీయంగానే అభివృద్ధి చెందింది. ఆ మాటకొస్తే రాజీవ్ గాంధి, శ్యాం పిట్రోడా కలిసి 1985-1989లోనే ఐటీ రంగానికి దేశంలో పునాది వేసి ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించారు. అసలు హైదరాబాద్ లోని మొదటి హైటెక్ ఐటీ టవర్(ఎల్ అండ్ టీ సైబర్ టవర్స్) మొదలుపెట్టింది, శంకుస్థాపన చేసింది చంద్రబాబు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్. జనార్ధనరెడ్డి.

ఐటీ, పారిశ్రామిక రంగాలపైనే దృష్టిపెట్టటం, వ్యవసాయం దండగ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వోద్యోగులపట్ల కఠిన వైఖరి అవలింబించి వారిని శత్రువులను చేసుకోవటం, పార్టీ శ్రేణులను పెద్దగా పట్టించుకోకపోవటంతో వ్యతిరేకత పీక్స్ కు చేరుకుని 2004 ఎన్నికల్లో బాబు పరాజయం పాలయ్యారు. తర్వాత పదేళ్ళపాటు ఆయన ప్రతిపక్షానికి పరిమితం కావల్సివచ్చింది. ఆ కాలంలోనే తెలంగాణ ఉద్యమం పతాకస్థాయికి చేరింది. తెలంగాణ విషయంలో గోడమీద పిల్లిలాగా రెండుకళ్ళు సిద్ధాంతాన్ని అనుసరిస్తూ పార్టీని నెట్టుకొచ్చారు. ఆయన రెండుకళ్ళ సిద్ధాంతంపై అన్నిపార్టీల నాయకులూ ఎన్నో జోకులు వేసేవాళ్ళు, తీవ్ర విమర్శలు చేసేవారు. ఆ సమయంలో చంద్రబాబు పెద్ద లాఫింగ్ స్టాక్ అయ్యారుకూడా. అయినాకూడా ఆ విమర్శలను, దాడులను తట్టుకుంటూకూడా ఓర్పుతో బాబు వేచి చూశారు. ఆ ఓర్పుకు ఫలితం 2014లో దక్కింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఏపీకి జగనా, చంద్రబాబా అనే పరిస్థితి వచ్చినపుడు ఏపీ ఓటర్లు అనుభవజ్ఞుడనే కారణంతో బాబుకే పట్టం కట్టారు.

ఇంటికి పెద్దకొడుకులాగా ఉంటానని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్ళలో పూర్తిగా విఫలమయ్యారు. నూతన రాజధానిని, పోలవరాన్ని నిర్మించకుండా ఈసారి ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన చంద్రబాబు అవి రెండూ పూర్తి చేయలేకపోయారు. పైగా రాష్ట్రాన్ని అవినీతిమయం చేసేశారు. అస్మదీయులైన బాబు వర్గం వారు రాష్ట్రంమీదపడి అడ్డగోలుగా దోచుకుంటున్నారు…. అది ఇసుక మాఫియా కానీయండి, కాంట్రాక్టులు కానీయండి. పదేళ్ళుగా అధికారానికి దూరంగా ఉండటంతో ఆకలిగా ఉన్నారులే పోనిమ్మని అనుకున్నారో, వారిని కంట్రోల్ చేయలేకపోయారోగానీ చంద్రబాబు వారిని ఏమీ అనటంలేదు. అసలు రాష్ట్ర రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. అది రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన నమ్మకద్రోహం. దీనిని స్టాక్ మార్కెట్ పరిభాషలో చెప్పాలంటే ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటారు. అంటే ఫలానాదాని ధర పెరుగుతుందని తన వారికి అత్యంత రహస్యమైన సమాచారాన్ని లీక్ చేసి వారితో దానిని కొనిపించటం. రాజధాని ఫలానా ప్రాంతంలో వస్తుందనే అత్యంత రహస్యమైన ప్రభుత్వ సమాచారాన్ని తమ అస్మదీయ వర్గానికి, పార్టీలోని ముఖ్యులకు వారిలో వారు చెప్పుకుని వందల ఎకరాలను కొనుగోలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఇంత నమ్మకద్రోహం చేసిన చంద్రబాబు ఒకరకంగా క్షమించరాని నేరస్థుడు. ఇంతా చేసి అమరావతి ఏమైనా రాజధానికి అత్యంత అనువైన ప్రదేశమా అంటే, అది కూడా కాదు. సంవత్సరానికి ఐదారు పంటలు పండే అత్యంత సారవంతమైన జరీబు భూములుండే ప్రాంతమూ, భూకంపాలకు అవకాశమున్న ప్రాంతమూ కూడా.

మరోవైపు రాజధానికోసం కనీవీని ఎరగని స్థాయిలో 33 వేల ఎకరాలను సేకరించారు. ఆ భూములనుకూడా అడ్డగోలు విధానంలో – భారీ ఎత్తున విద్యా వ్యాపారం చేసే ఎస్ఆర్ఎమ్, వీఐటీ వంటి సంస్థలకు వందల ఎకరాలను కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అంతులేని అక్రమాలు జరిగాయి. ఇంకా దారుణమేమిటంటే, పలు సూట్ కేస్ సంస్థలు(షెల్ కంపెనీలు)కు ఈ ఖరీదైన భూములను కారుచౌకగా కేటాయించటం. దీనికి మచ్చుకు ఒక ఉదాహరణ – ‘ఇండో యూకే’ అనే బూటకపు సంస్థకు అమరావతిలో 150 ఎకరాలు కేటాయించటం. అది ఎంత బూటకపు సంస్థ అంటే, వారికి కేటాయించిన 150 ఎకరాలకుగానూ, ఎకరానికి కనీసస్థాయిలో నిర్ణయించిన రేటు రు.50 లక్షలను కూడా ఈ సంస్థ కట్టలేకపోయింది.

ప్రతిసారీ, కట్టుబట్టలతో పంపించేశారు అని చంద్రబాబు అంటుంటారు. అసలు ఓటుకు నోటు కేసులో అడ్డగోలుగా ఇరుక్కుపోయి ఆ విమర్శలకు తట్టుకోలేక ఉమ్మడి రాజధానిగా పదేళ్ళ వ్యవధి ఉన్నాకూడా అక్కడనుంచి పారిపోయి వచ్చి, వారు కట్టుబట్టలతో తరిమారనటం ఏ విధమైన న్యాయమో తెలియదు. సరే, అది పక్కన పెడితే కట్టుబట్టలతో పంపించేశారు అని నెత్తీ నోరు బాదుకునే వ్యక్తి రాజధానిని అన్ని లక్షలకోట్లతో నిర్మించాలనుకోవటం సబబేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఒకపక్క రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉండగా స్థోమతను మించి బాహుబలి సెట్టింగులలోని కట్టడాల తరహాలో నిర్మించాలని డిజైన్లు తయారు చేయించటంతో ఆ నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ లు, డబ్ల్యూ టర్న్ లు తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకహోదా ఇవ్వటానికి మోది సుముఖంగా లేరనే విషయం తెలుసుకోవటానికి ఈ నలభై ఏళ్ళ అనుభవజ్ఞుడికి నాలుగేళ్ళు పట్టిందట. ఓటుకు నోటు కేసు కారణంగానో, మరే కారణంచేతనో గానీ నాలుగేళ్ళపాటు మోడికి ఈయన మోకరిల్లుతూ ఉండిపోయారు. పైగా మధ్యలో ఒకసారి… స్పెషల్ ప్యాకేజికి తాను ఒప్పుకున్నాను కాబట్టే పోలవరం నిర్మాణ వ్యయాన్ని భరించటానికి కేంద్రం అంగీకరించిందనికూడా బాబుగారు వాక్రుచ్చారు. చివరికి నాలుగేళ్ళ తర్వాత… మోడినే బూచిగా చూపించి ఎన్నికలకు వెళ్ళొచ్చని నిర్ణయించుకున్న తర్వాత… ఎన్డీఏతో తెగతెంపులు చేసుకున్నారు.

పోలవరం విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఆ నిర్మాణం ఒక కొలిక్కి వచ్చే ఉండేది. వైఎస్ పూర్తి చేసిన కుడికాల్వ ద్వారా పట్టిసీమ అనే ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి క్రెడిట్ కొట్టేయాలన్న ఆత్రుతతో అసలు ప్రాజెక్ట్ నిర్మాణ పనులను నిర్లక్ష్యం చేశారు. అయితే పట్టిసీమద్వారా కొంతమేర రైతులకు ప్రయోజనం చేకూరటం గుడ్డిలో మెల్ల.

మరోవైపు తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ తోలుకుపోతోందని ఆక్రోశిస్తూనే, ఏపీలో తనకు పూర్తి మెజారిటీ ఉన్నాకూడా విలువలకు తిలోదకాలు ఇచ్చి అనేక తాయిలాలతో, ప్యాకేజిలతో వైసీపీ ఎమ్మెల్యేలను లాక్కోవటం చేశారు.

ఏది ఏమైనా చంద్రబాబులో నాడు 1995-2004లో ఉన్న సమర్థత, ఫోకస్ ఇప్పుడు లేవు. పైగా మెగలో మేనియా వ్యాధిగ్రస్తుడిలాగా తనను తాను విపరీతంగా పొగుడుకుంటూ అన్నీ తానే చేశానని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఎంతసేపూ హైదరాబాద్ ను డెవలప్ చేశాను. ఐటీని తెచ్చాను అంటూ పాత రికార్డ్ వినిపించటమే తప్ప విజన్ కనబడటంలేదు. ఒక్కోసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో  ఆయన పార్టీవారికే మింగుడు పడటంలేదు. ముందు నాటికంటే ఇప్పుడు కార్పొరేట్ శక్తుల జోక్యం స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా మేఘా ఇంజనీరింగ్, పీఎస్కే ఇన్ ఫ్రా, రిత్విక్ కనస్ట్రక్షన్స్ వంటి కాంట్రాక్టర్ల జోక్యం ఎక్కువయింది.(ఈ విషయంలో చాలామందికి తెలియని ఒక విచిత్రమైన వ్యవహారాన్ని ఇక్కడ ఉటంకించాలి. భారీ ప్రాజెక్టులు చేసే కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులు ఒక్కో రూపాయిలో 75 పైసలు అధికార పార్టీకి వెళితే 25 పైసలు ప్రతిపక్ష పార్టీకి కూడా వెళుతుంది. ఈ విషయాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడూ రాయదు కాబట్టి చాలామందికి తెలియదు).మొత్తం మీద చూస్తే బాబు కేవలం ఓట్లు రాల్చే సంక్షేమ పథకాలనే తాయిలాలను నమ్ముకున్నారు తప్పితే రాష్ట్ర పునర్నిర్మాణం అనేది జరగటమే లేదు. ఈ ఐదేళ్ళలో ఆయన పుష్కరాలు, ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ అంటూ ఈవెంట్లతో హడావుడి చేసి నెట్టుకొచ్చారు. అమరావతి అక్రమాలు, అవినీతి పుట్టగా మారిపోయింది. ఆ అవినీతిని నియంత్రించటం ఇప్పుడు బాబు చేతుల్లోకూడా లేదు.

జగన్మోహన్ రెడ్డి

జగన్మోహన్ రెడ్డి గురించి సింపుల్ గా చెప్పాలంటే అదేదో జంధ్యాల సినిమాలో చూపించినట్లు ఒక సిసలైన పల్లెటూరు సర్పంచ్ కుమారుడి మనస్తత్వం. మారుమూల పల్లెటూరిలో పుట్టి పెరిగిన ఆ సర్పంచ్ గారి కుమారుడి మనస్తత్వం ఎలా ఉంటుందంటే తన తండ్రి ఆ గ్రామానికి రాజు అని, తాను రాజకుమారుడినని, తన తండ్రి తర్వాత ఆ రాజ్యానికి తానే రాజునని అనుకునే ఫ్యూడల్ ఆలోచనా విధానం(వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ… తన తండ్రి నిర్వహించిన ముఖ్యమంత్రి పదవిని తాను అధిరోహించటం తప్పా అని అమాయకంగా అడిగిన సంగతి తెలిసిందే).

2004 వరకు జగన్ గురించి బయటకు తెలిసిందల్లా అతనేదో పవర్ ప్లాంట్ నడుపుకుంటూ బెంగళూరులో ఉంటారని మాత్రమే. 2004లో తండ్రి అధికారంలోకి రాగానే జగన్ క్రియాశీలంగా మారారు. ముఖ్యంగా 2005లో జరిగిన ఒక పరిణామంతో జగన్ వార్తల్లో వ్యక్తి అయ్యారు. కడప ఎంపీగా ఉన్న బాబాయి వివేకాను రాజీనామా చేయించి ఆ స్థానంలో తాను ఎంపీ కావాలనుకుని , తదనుగుణంగా వివేకాపై ఒత్తిడి తీసుకురావటంతో ఆయన అన్నకు చెప్పలేక నేరుగా సోనియాకు తన రాజీనామా లేఖ సమర్పించారు. సోనియా వైఎస్ ను పిలిచి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో జగన్ శాంతించారని అప్పట్లో వార్తలొచ్చాయి. దీనిని ఇటీవల వివేకా చనిపోయినపుడు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ నిర్ధారించారు. జగన్ వివేకాపై చేయికూడా చేసుకున్నట్లు హర్షకుమార్ ఇటీవల పేర్కొన్నారు. వైఎస్ బతికుంటే ఆయనపైనే ఒత్తడి తీసుకొచ్చి తండ్రిను పక్కకు తప్పుకోమనటమో, సంజయ్ గాంధిలాగా రాజ్యాంగేతర శక్తిలాగా మారటమో జరిగేదని నిరంజనరావు వంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ రోజుల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా ఉదంతం తర్వాత జగన్ పూర్తిస్థాయిలో వ్యాపారంపైనే దృష్టి పెట్టారు. కేవలం దృష్టి పెట్టటమే కాదు… వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, 2004కు ముందు వైఎస్ కుటుంబం కారు ఖర్చులకుకూడా కేవీపీపై ఆధారపడేస్థితిలో ఉండగా, 2010 నాటికి జగన్ దేశంలోనే అత్యధిక ఆదాయపు పన్ను కట్టే స్థాయికి చేరుకున్నారు. మొదట కడప జిల్లాలో సిక్ ఇండస్ట్రీగా ఉన్న రఘురామ్ సిమెంట్స్ ను టేకోవర్ చేశారు. దానికి భారతి సిమెంట్స్ అని పేరు పెట్టారు. ఆ ఫ్యాక్ట‌రీకి రాష్ట్ర‌ప్ర‌భుత్వం 2007లో 487 ఎక‌రాల భూమిని నామ‌మాత్ర‌పుధ‌ర‌కు కేటాయించింది.(దీనిపై పెద్ద వివాదం కూడా చెల‌రేగింది.)  ఇక ఆ ఫ్యాక్ట‌రీకి నిధుల సేక‌ర‌ణ ఓ పెద్ద ప్ర‌హ‌స‌నం. ప్ర‌పంచంలోనే సిమెంటు ప‌రిశ్ర‌మ‌కు ఆద్యురాలైన ఓ విదేశీకంపెనీతో స‌హా ప‌లు సంస్థ‌లు భార‌తి సిమెంట్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో ప‌నులు చేయించుకోడానికి వివిధ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీలు, ఇండస్ట్రీల అధినేత‌లు ఈ పెట్టుబ‌డులు పెట్టార‌ని రాజ‌కీయావ‌ర్గాలు కోడై కూశాయి. ఉదా.కు… ప్ర‌కాశం, గుంటూరు జిల్లాల‌లో వాన్‌పిక్ పేరుతో పారిశ్రామిక‌వాడ‌ను పెట్ట‌డానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వంనుంచి అనుమ‌తి పొందిన నిమ్మ‌గ‌డ్డ ప్ర‌సాద్ ర‌ఘురామ్ సిమెంట్స్‌లోనూ, జ‌గ‌తి ప‌బ్లికేష‌న్స్‌లోనూ కోట్ల‌రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టారు. అయితే ఈ వ్యాపారాలకు, సంపాదనకు రూప‌క‌ల్ప‌నచేసి, విజ‌య‌వంతంగా అమ‌లు చేసిన ఘ‌న‌త ఆడిటర్‌ విజ‌య‌సాయిరెడ్డిదేనని చెప్పుకోవాలి. ఇక నాడు రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన అనేక సెజ్‌ల‌లో జగన్‌కు ఎంతోకొంత వాటా ముట్టిందని చెబుతారు. ముఖ్యంగా బ్రహ్మణి, ఇందూ ఇన్‌ఫ్రా, రహేజా వంటి సంస్థల సెజ్‌ల‌లో. జగన్ వ్యాపార శైలి గురించి విని… నాడు ఢిల్లీలోని పలువురు జాతీయనేత‌లే ముక్కున వేలేసుకున్నారంటారు.

తండ్రిపోయిన వెంటనే సీఎమ్ పదవికి తయారైపోయిన జగన్… అంత్యక్రియలు కాకమునుపే శవరాజకీయం ప్రారంభించారు. సీఎమ్ పీఠానికి పావులు కదపడం మొదలుపెట్టారు. సంతకాల సేకరణ, ప్రజారాజ్యం మద్దతుకోసం ప్రయత్నాలు వంటి చర్యలు జగన్ ప్రమేయంలేకుండా జరుగుతాయని అనుకోలేము. అయితే ఇతని దుందుడుకు స్వభావం, అవినీతి గురించి అప్పటికే తెలుసుకునిఉన్న అధిష్టానం కుర్చీని రోశయ్యకు అప్పగించడంతో… తనకేదో అన్యాయం జరిగిపోయినట్లు జగన్ భావించసాగారు. హైకమాండ్ వద్దని చెబుతున్నా(సోనియాతో భేటీ జరిగినవెంటనే బయటకు వచ్చి తన ఓదార్పు యాత్రకు ఆమె అనుమతి ఇచ్చారని జగన్ చెప్పారు. అయితే తదనంతరకాలంలో అది అబద్ధమని, ఆమె యాత్ర వద్దన్నారని తేలింది), తండ్రి మరణవార్తతో తల్లడిల్లి చనిపోయినవారిని ఓదార్చాల్సిన అవసరం తనకుందని అంటూ ఓదార్పుయాత్రకు బయలుదేరారు. మాటిచ్చాను కాబట్టి మడమ తిప్పననే కారణాన్ని బయటకు చెబుతున్నా, లోపలి ఎజెండా మాత్రం సొంతపార్టీ స్థాపనే. విపరీతంగా డబ్బుకుమ్మరించి, జనాన్ని సేకరించి, జరిపిన ఆ ఓదార్పుయాత్ర అత్తా-కోడళ్ళ టీవీ సీరియల్‌లాగా సాగి…సాగి… జగన్ ముఖాన్ని మీడియాలో చూడడానికి తెలుగుప్రజలకు విసుగొచ్చేటంతగా సాగింది. మొదట్లో ఆ యాత్రను లైవ్ ఇవ్వడానికి అన్నీ ఛానళ్ళూ పోటీపడగా…చివర చివరికి ఎవరూ పట్టించుకోని స్టేజికి చేరుకుంది.(నిజంగా బాధితులకు సాయం చేయాలనిపిస్తే… వారినందరినీ హైదరాబాద్ పిలిపించుకుని సాయమందించొచ్చుకదా అనే విమర్శలు వినిపించాయి). అటు – జగన్ వెనకున్న ఎమ్మెల్యేల సంఖ్యకూడా 150నుంచి 15కు పడిపోయింది.

విభజన తర్వాత సంఖ్యాబలంగా తరిగిపోయిన రెడ్డి సామాజికవర్గానికి ఆయనొక్కరే ఆశాకిరణంగా కనిపించారు. అందుకే ఆయనను భుజాన వేసుకున్నారు. అయితే ఇక్కడ ఒకందుకు వైసీపీ వీరాభిమానులను మెచ్చుకోవాలి. జగన్ లక్షకోట్ల అవినీతి చేశాడన్న ఆరోపణపైగానీ, అతి తక్కువ సమయంలో(2004-2009)  కొన్ని వందలరెట్లుగా జగన్ ఆస్తులు రాకెట్ వేగంతో పెరిగిపోవటంపైగానీ స్పందించేటపుడు, అతను అలా అక్రమంగా సంపాదించలేదనిమాత్రం వాళ్ళు అనరు… చంద్రబాబు సంపాదించలేదా అనిగానీ, ఈ కాలంలో ఎవరు సంపాదించటంలేదు అనిగానీ అంటారు. ఎందుకంటే జగన్ ఆ ఆస్తులన్నీ అత్యంత నిజాయితీగా వ్యాపారంచేసి సంపాదించాడని తెలుగు రాష్ట్రాలలో పసిపిల్లాడుకూడా అనుకోడని వారికి తెలుసు కాబట్టి.

వైఎస్ పలుకుబడి ఉపయోగించుకుని క్విడ్ ప్రో కో విధానం ద్వారా బడా పారిశ్రామికవేత్తలకు కావలసిన ప్రాజెక్టులు, సెజ్ లు శాంక్షన్ చేయించి తన సూట్ కేసుల కంపెనీలలో వారు నిధులు పెట్టేలా చేయటాన్ని సీబీఐవారు గుర్తించి కేసులు నమోదు చేశారు. కొన్ని కేసులలో ప్రాధమిక సాక్ష్యాలు లభించటంతో జైలుకు తరలించారు. 16 నెలలపాటు జైలులో గడిపిన తర్వాత జగన్ బయటకొచ్చారు. వైసీపీ పార్టీని స్థాపించారు.

2014లో చంద్రబాబా, జగనా అనే పరిస్థితి వచ్చినపుడు ఓటర్లు అనుభవజ్ఞుడైన బాబే బెటర్ అని అతనివైపు మొగ్గు చూపారు. అయినాకూడా జగన్ కు 67 స్థానాలు వచ్చాయి. కానీ, జగన్ ఒంటెత్తు పోకడలవల్లగానీ, చంద్రబాబు చూపిన ఆకర్షణలవల్లగానీ 24 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయారు. దీనిలో జగన్ స్వయంకృతాపరాధంకూడా లేకపోలేదు. ఎవరినీ నమ్మకపోవటం, ఎవరి సలహా వినకపోవటం వంటి అవలక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అనేక కీలక సందర్భాలలో సెల్ఫ్ గోల్స్ చేసుకుని క్యాడర్ లో నైతికస్థైర్యాన్ని ఆయనే దెబ్బతీసుకున్నారు. వీటిలో… అసెంబ్లీకి గైర్హాజరు కావటం, అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళకపోవటం, నంద్యాల ఎన్నికల సందర్భంగా ప్రచారంలో… చంద్రబాబును కాల్చిచంపాలని, బట్టలూడదీసి కొట్టాలని వ్యాఖ్యానించటం వంటివి మచ్చుకు కొన్ని మాత్రమే.

బీజేపీతో సంబంధాల విషయంలోకూడా జగన్ వైఖరి మొదటినుంచి ప్రశ్నార్థకంగా ఉంది. వైఎస్ 4 శాతం రిజర్వేషన్ కల్పించటంతో ముస్లిమ్ ఓట్ బ్యాంకు జగన్ కు మొదటినుంచీ కొంత అనుకూలంగానే ఉంది. వారిని దృష్టిలో ఉంచుకునే 2014 ఎన్నికలకు ముందు, బీజేపీతో పొత్తు సమస్యే లేదు అని జగన్ వ్యాఖ్యానించారు. కానీ మోది గెలిచిననాటినుంచి, కేసుల భయంతో బీజేపీకి దగ్గరవటానికి చేయని ప్రయత్నం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కమలనాథులు అడగకముందే మద్దతు ప్రకటించటమేకాకుండా రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ కు సాగిలపడి తన విధేయతను చాటుకున్నారు. దీనితో జగన్ విశ్వసనీయతపై బీజేపీ వ్యతిరేక ఓటర్లలో, తటస్థుల్లో అనేక సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు తాజాగా ఎన్నికలముందు జాతీయ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదిని పొగడ్తలతో ముంచెత్తి, ఎన్నికల తర్వాత ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలిచ్చారు. దీనిపై ఏపీలోని ముస్లిమ్ విద్యావంతులు మండిపడుతున్నారు.

మరోవైపు, ఈడీ, సీబీఐ కేసుల దృష్ట్యా, ఎందుకైనా మంచిదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధిగురించి కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగన్ మంచిగా మాట్లాడారు. కాంగ్రెస్ ను తాను క్షమించినట్లు చెప్పారు.

మొత్తంమీద చూస్తే, 2014 ఎన్నికలనాటినుంచికూడా జగన్ వ్యవహారశైలిచూస్తే, బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర పోషించటంకాకుండా, తనకు దక్కాల్సింది చంద్రబాబుకు దక్కిందనే ఉక్రోషంతో ఉడుక్కుంటున్నట్లు విమర్శలు చేయటంతోనే ఐదేళ్ళూ గడిపేసినట్లుగా కనబడుతోంది. ఇక చివరగా టీఆర్ఎస్ పార్టీతో చేయికలపటంకూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటాన్ని, పోలవరం ప్రాజెక్టును ఎల్లవేళలా వ్యతిరేకించే కేసీఆర్, ఫెడరల్ ఫ్రంట్ లో మద్దతు కోసం ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని చెప్పిన మాటలను జగన్ ఎలా నమ్మారో ఎవరికీ అర్థం కావటంలేదు. సొంత రాష్ట్రంలోనే కేసీఆర్ ఇచ్చిన మాటలను ఎవరూ నమ్మరు. ఆడిన మాట తప్పటంలో ఆయనకు పెట్టింది పేరు. పైగా ఆయన దానిని బలంగా సమర్థించుకోగల ఘనుడు కూడా. అటువంటి కేసీఆర్ ను జగన్ ఎలా నమ్మారో ఆ దేముడికే తెలియాలి. ఇంకా నయం… కేసీఆర్ కు అమరావతిలో ఘన సన్మానం చేద్దామనికూడా జగన్ నిర్ణయించుకున్నారు. దానివలన దుష్ఫలితాలు సంభవిస్తాయన్న సలహాను పరిగణనలోకి తీసుకుని ఆ సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

చివరగా రాజకీయంగా చూస్తే, ఈ రెండు పార్టీలూ అధికారంకోసం చావో రేవోగా పోరాడుతున్న సంగతి అర్థమవుతూనే ఉంది. దానికి కారణం రెండు పార్టీలకూ రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు గడ్డుగా మారటమే. ఒకనాడు తెలుగుదేశానికి బీసీలే పెట్టనికోట అన్న సంగతి తెలిసిందే. కానీ బీసీలు ఎక్కువగా ఉండే తెలంగాణ విడిపోవటంతో ఏపీలో తెలుగుదేశానికి ఓట్ బ్యాంక్ తగ్గిపోయింది. ఇక వైసీపీకి చూస్తే, విభజనతో రెడ్డి సామాజికవర్గం బలహీనపడిపోయింది. అందుకే ఈసారి అధికారాన్ని చేజిక్కించుకోకపోతే తమ రాజకీయ ఉనికికే ప్రమాదం అని వారు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తటస్థులు ఈ అంశాలన్నింటినీ పరిశీలించి ఈ ఎన్నికల్లో తమ విచక్షణను ఉపయోగించుకుని మెరుగైన ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకుంటారని ఆశిద్దాం.

 

(శ్రవణ్ బాబు, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్, ఫోన్ నెం. 9948293346)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *