చిత్రసీమతో రాయలసీమ అనుబంధం

(చందమూరి నరసింహారెడ్డి)
తొలి తెలుగు చిత్రం దగ్గరనుంచి మొదలు పెట్టి నేటి వరకు పరిశీలిస్తే తెలుగు సినిమా పుట్టుపూర్వోత్తరాల గురించిన  ఏన్నో ఆసక్తికరమయిన విషయాలు కనిపిస్తాయి.  రాయలసీమ వారు చిత్రరంగంలో పోషించిన పాత్ర అందులో ఒకటి.
మూకీ సినిమా అనంతరం 1930 లో తొలి పాక్షిక టాకీ చిత్రం ‘లక్ష్మీ’ . పూర్తి స్థాయిలో తొలి తెలుగు టాకీ చిత్రం 1931లో వచ్చిన సినిమా ‘భక్త ప్రహ్లాద’ . తొలి టాకీ సినిమా రాయలసీమ వారితోనే ఆరంభమైందంటే ఆశ్చర్యం మేస్తుంది.
అప్పట్లో ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన “భక్త ప్రహ్లాద” నాటకాన్ని సురభి నాటక సమాజం ప్రదర్శస్తుండే వారు. ఆ నాటక సమాజంవారిని బొంబాయి పిలిపించి, వారితో చర్చించి, సినిమా తీసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని బొంబాయిలోని కృష్ణా మూవీటోన్ స్టూడియోలో తీశారు.
అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు. చిత్రం బాగా విజయవంతమయ్యింది.
ధర్మవరం రామకృష్ణమాచార్యులు సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత, బహుభాషా పండితుడు. “ఆంధ్ర నాటక పితామహుడు”గా ప్రసిద్ధిగాంచాడు.
సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు.1853 లో అనంతపురం జిల్లా ధర్మవరంలో జన్మించారు.1891లో మధ్రాసులో సంస్కృత పండితుడు ఓపర్ట్ ఇతని నాటకాన్ని చూసి మెచ్చి రత్నఖచిత బంగారు పతకం బహూకరించాడు. 1910లో గద్వాల మహారాజు ఇతడిని ఆంధ్ర నాటక పితామహుడు అనే బిరుదుతో సత్కరించాడు. బళ్లారి పురప్రముఖులు ఇతడిని రత్నఖచిత కిరీటంతో సన్మానించారు.
తొలి తెలుగు నటీమణి సురభి కమలాబాయి . ఈమే రాయలసీమ వాసే. కడప జిల్లా సురభి గ్రామనివాసి. వీరి తల్లిదండ్రులు ,భర్త, పిల్లలు ,అన్నదమ్ములు అందరూ కళాకారులే. సినీ చరిత్ర ఆరంభం నుంచి రాయలసీమకు విడదీయరాని అనుబంధం ఉంది.
రంగస్థల కుటుంబంలో పుట్టిన కమలాబాయికి చిన్నప్పటి నుండే నటన అలవాటు . బాల్యంలో కృష్ణుడు, ప్రహ్లాదుని పాత్రలు వేస్తుండేవారు. యుక్తవయసు వచ్చిన తర్వాత మగ పాత్రలు ఆపేసి స్త్రీ పాత్రలు ధరించడం ప్రారంభించారు. ఇలా టాకీ సినీప్రస్థానం మొదలైంది.

తొలి చారిత్రక చిత్రం సారంగధర (1937) ఇందులో శాంతకుమారి నటించింది. శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. సుబ్బమ్మ వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు లో మే 17, 1920 సంవత్సరంలో  జన్మించారు.1936 లో మాయాబజార్ లేదా శశిరేఖ పరిణయం అనే రెండు పేర్లుతో పిలిచే ఏకైక సినిమాతో సినీరంగంలో అడుగు పెట్టారు. 50 కి పైగా సినిమాల్లో నటించారు.1999వ సంవత్సరానికి గాను ఆమె ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ను అందుకున్నారు.
P Kannamba/ Wikimedia
మరో నటీ కన్నాంబ.ఈమె కడపజిల్లా వాసి.1912 లో కడపలో జన్మించారు. సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ .
కడారు నాగభూషణం గారిని వివాహం చేసుకుని శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ స్థాపించి తెలుగు తమిళభాషల్లో 22 చిత్రాలు నిర్మించారు.
కదిరి వెంకట రెడ్డి (కెవిరెడ్డి)
1951లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన తొలి దక్షిణాది చిత్రం పాతాళ భైరవి ఈ చిత్ర దర్శకుడు కె.వి.రెడ్డి .
KV Reddy / Wikimedia
1912 జూలై 1 అనంతపురం జిల్లా తాడిపత్రి లో జన్మించారు. సినీ దర్శకుడు.వాహినీ పిక్చర్స్ సంస్థలో ప్రొడక్షన్ మేనేజరుగా ప్రారంభమై 1942లో భక్త పోతన సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా మంచి విజయం కావడంతో వాహినీ ప్రొడక్షన్స్ ఏర్పడి, అందులో కె.వి.రెడ్డి నిర్మాణ భాగస్వామిగా చేరాడు. ఆపైన ప్రధానంగా వాహినీ, విజయా వంటి నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీశాడు. జయంతి అన్న స్వంత సంస్థ నెలకొల్పి 3 సినిమాలు తీశాడు. ఇవి కాక అన్నపూర్ణ ప్రొడక్షన్స్, ఎన్.ఏ.టి. సంస్థలకు ఒక్కో సినిమా తీశాడు
ఎన్.టి.రామారావును కృష్ణుడిగా నిలబెట్టి, అతని పౌరాణిక చిత్రాల కెరీర్ కు పునాదులు వేసింది కె.వి.రెడ్డే. అతని సినిమాల్లో పెద్దమనుషులు, పెళ్లినాటి ప్రమాణాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతి సంపాదించుకొన్నాయి.
Padmanabham/ Youtube
ఈ సినిమాలో హాస్యనటుడు పద్మనాభం నటించారు. ఈయన కడపజిల్లా సింహాద్రిపురంలో1931 ఆగస్టు 20న జన్మించారు. బసవరాజు వెంకట పద్మనాభ రావు పూర్తి పేరు.పద్మనాభం మాయలోకం సినిమాలో ఒక పాత్ర వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా.
1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు.
1951లో విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం మల్లీశ్వరి. మల్లీశ్వరి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ప్రముఖ చిత్రంగా ఖ్యాతి గాంచింది.  ఆ సినిమా కమ్యూనిస్టు దేశమైన చైనా లోనే వందరోజులకు పైగా ఆడింది. ఆ సినిమాకు మాటలు, పాటలు, కళ, నటన, సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగులతో సహా అంతా తానై బి.ఎన్.రెడ్డి నడిపించినవే. అందుకే కృష్ణశాస్త్రి “మల్లీశ్వరి సృష్టిలో మేమంతా నిమిత్తమాత్రులం. బి.ఎన్.రెడ్డి గారు దీనికి సర్వస్వం.” అన్నాడు.
బి.యన్. రెడ్డి అలియాస్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి
1908 నవంబరు 16 పులివెందుల తాలూకా, ఎద్దుల కొత్తపల్లిలో జన్మించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి దక్షిణభారతీయుడు .1975 ఈ అవార్డు అందుకొన్నారు. కలైమామణి, పద్మభూషణ్ సత్కారాలు పొందారు. షేక్స్పియర్ విషాదాంత నాటకం కింగ్ లియర్ను గుణసుందరి కథగా తీశారు. శాసనమండలి సభ్యలు గా రాయలసీమ కు సేవలందించారు.
కన్నాంబ, జిక్కి
1963 లో  వచ్చిన తొలి రంగుల చిత్రం లవకుశ . ఈ చిత్రం లో కన్నాంబ నటించింది. మరో సీమ వాసి జిక్కీ పాటలు పాడారు.
జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి 1938 నవంబరు 3, చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించింది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది.
ధియోటర్ కాంప్లెక్స్
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు గల కాంప్లెక్స్‌ కర్నూలు‌ లో ఉంది.ఆనంద్‌, ఆదిత్య, అప్సర, అశోక, అర్చన, అశ్వనితో గల ఆరు థియేటర్ల కాంప్లెక్స్‌ ఇది. ఈరికార్డు రాయలసీమ కే దక్కింది.
సినీ పరిశ్రమ తో రాయలసీమ కు ఎంతో అనుబంధం ఉంది. రాయలసీమ వాసులు సినీరంగంలో అన్ని విభాల్లో ఉన్నప్పటికీ రాయలసీమ సంస్కృతి, సాంప్రదాయం కాని కరవు కన్నీటి సన్నివేశాలు కాని అపురూప చిత్ర కళా సంపద గురించి అనుకొన్న స్థాయిలో ఎందుకో వివరించలేక పోయారు. ఫ్యాషన్ నేపథ్యంలో ఎక్కువ చూపించారు. అనంతపురం జిల్లా నేపథ్యంలో శ్రీరాములయ్య లాంటి సినిమా లొచ్చాయి.
రాయలసీమ నుంచి కె.వి రెడ్డి, బి.యన్. రెడ్డి, మూలా నారాయణ స్వామి, బి.నాగిరెడ్డి లాంటి దర్శక ,నిర్మాత లెందరో ఉన్నారు.
Leela Naidu (credits: The Hindu)
లీలానాయుడి తండ్రిది మదనపల్లె నేపథ్యం. ప్రపంచ సుందరిగా పేరు పొందిన పది మందిలో ఆమె ఒకరు. చాలా తక్కువ హిందీ, ఇంగ్లీష్ సినిమాల్లో సినిమాల్లో నటించి ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది . 1954లో పదనాలుగు సంవత్సరముల వయసులో ఫెమినా మిస్ఇండియా గా ఎన్నుకొనబడింది.
ప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటి జయంతి అసలు పేరు కమల కుమారి. 1950లో శ్రీకాళహస్తి లో జన్మించారు. బళ్ళారిలో ఈమె తెలుగు సినిమాల్లో నటన ప్రారంభించి కన్నడ సినీరంగంలో రాజ్ కుమార్ తో సమానంగా అభిమానులను సంపాదించు కున్నారు. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మళయాల హిందీ భాషలలో నటించారు.
Roja Selvamani
రోజా సెల్వమణి 1972లో మదనపల్లె లో జన్మించారు.
దక్షిణ భారతదేశంలో ప్రముఖ సినిమా నటి మరియు రాజకీయవేత్త.ఈమె ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి యం.ఎల్.ఏ గా ఎ.పి.ఐ.ఐ.సి చైర్మన్ గా సేవలందిస్తున్నారు.
స్వర్ణలత 1928 లో కర్నూలు జిల్లా చాగలమర్రి లో జన్మించారు.పాతకాలపు తెలుగు సినిమా గాయనీమణి ఈమె 1950-70లు మధ్య కాలంలో ఎక్కువగా హాస్యభరితమైన గీతాలు పాడారు.
ఇలాగే దేవిక 1943 లో చిత్తూరు జిల్లా చంద్రగిరి జన్మించారు. 1960, 70 దశకాలలో అందాల తార తెలుగు తమిళ సినీ రంగంలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలో 150కి పైగా సినిమాలలో నటించింది ఈమె అసలు పేరు ప్రమీలాదేవి
రమాప్రభ 1946 లో అనంతపురం జిల్లా కదిరి లో జన్మించారు. ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటిగా  చిరపరిచయం అయిన పేరు. ఈమె దాదాపు 1400కు పైగా దక్షిణ భారతదేశం సినిమాలలో నటించింది.
TG Kamaladevi
టీ.జి. కమలాదేవి 1930 లో చిత్తూరు జిల్లా కార్వేటినగరం
లో జన్మించారు. ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మ చెల్లెలు చిత్తూరు. నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది.ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి.
జయప్రకాశ్ రెడ్డి ప్రముఖ తెలుగు నటుడు ఈయన కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం లో శిరివెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.
రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రసిద్ధి ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుంటాడు
మంచు మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాలెం లో జన్మించారు నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త. 573 సినిమాల్లో నటించాడు. సినిమాలునిర్మించాడు. .రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు.మోహన్ బాబు తిరుపతి సమీపంలో విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థలు నెలకొల్పి సేవలందిస్తున్నారు.
శివప్రసాద్ తిరుపతి యం.పి సినిమాల్లో అక్కడక్కడ కామెడీ ,విలన్ వేషాలు వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు బయట కూడా కొత్త వేషాలు వేస్తూ నవ్విస్తుంటారు.
జీవిత , వై.విజయ ,మంచు లక్ష్మి, ఇలా చాలామంది నటీమణులు ఉన్నారు. పద్మనాభం,అంకుశంరామిరెడ్డి ,నారా రోహిత్ ,మంచు విష్ణు ,మంచు మనోజ్ ఇలా చాలా మంది నటులున్నారు.
అనంతపురం జిల్లా నంబులపూలకుంట కు చెందిన గాంధీ సినీ దర్శకుడు గా పనిచేస్తున్నారు. ఏ.యం రాజా సంగీత దర్శకుడు. స్వర్ణలత సినీ గాయకులు. వక్కంతం వంశీ కధారచయిత . ఇలా రాయలసీమ వాసులు చాలా మందికి సినిమా రంగం తో అనుబంధం ఉంది.
వంశీ చిత్తూరు జిల్లా, పుంగనూరు సమీపంలోని అరికెల అనే గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి వక్కంతం సూర్యనారాయణరావు ప్రముఖ నవలా రచయిత. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశాడు. తల్లి స్వర్ణకుమారి గృహిణి. వంశీ తన తల్లిదండ్రులకు కలిగిన ముగ్గురు సంతానంలో పెద్దవాడు.
పి.ఎస్.రామకృష్ణారావు1918లో కర్నూలు జిల్లా లో జన్మించారు.ఈయన తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి. అయన దర్శకుడిగా నిర్మాతగా రచయితగా అనేక సినిమాలు చేశారు.గృహలక్ష్మి , చింతామణి విప్రనారాయణ , లైలామజ్ను’ ఇలా ఎన్నో సినిమాల్లో పని చేశారు.
వి.ఎన్.రెడ్డి 1907 లో జన్నించారు. అనంతపురం జిల్లా వాసి. 20 ఏళ్ల వయసు లోనే 1937లో సినిమాల్లో ఛాయాగ్రహణం రంగంలోకి వెళ్లారు.అభివృద్ధి చేసుకొని ఆ రంగంలో స్థిరపడటానికి బొంబాయి చేరాడు కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి ఎన్నో ప్రముఖ హిందీ చలనచిత్రాలు ఛాయాగ్రాహకుడు ఆపై తెలుగు సినిమా దర్శకుడుగా పని చేశారు.
సినిమారంగంలో ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు .ఈయనకు రాయలసీమతో ప్రత్యక్ష సంబంధం లేదు అయినప్పటికీ రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం హిందూపురం శాసనసభ నియోజకవర్గం నుంచిశాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు ఆ పదవిని అలంకరించి రాయలసీమకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారు.సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా తెలుగు గంగ, హంద్రీనీవా గాలేరు పథకం కు నందమూరి తారకరామారావు శంకుస్థాపన కార్యక్రమం చేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టారు .మహిళలకు ఆస్తి హక్కు వాటాను కల్పించారు. మండల వ్యవస్థను ప్రవేశ పెట్టారు .రాజకీయాల వల్ల రాయలసీమ తో ఎనలేని అనుబంధం ఏర్పడింది .వీరి మరణానంతరం వీరి కుమారులు హరికృష్ణ మరియు బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి శాసన సభ్యులు గా గెలుపొందారు వీరు కూడా నటులే.
సినిమా చాలా శక్తిమంతమైన మాధ్యమం. చాలా ప్రభావితం చేస్తుంది. కొన్ని సన్నివేశాలు లో కొందరు లీనమైపోతారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సినీ రచయితలు తమతమ సినిమా రచనలను సమాజహితం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ నేపథ్యంతో సినిమాలు తీయడం సర్వసాధారణం అయింది. అయితే రాయలసీమలో తరతరాలుగా కరవు రాజ్యమేలుతోంది .కరవు నేపథ్యంతో అనేక సినిమాలు తీసే అవకాశం ఉంది అయితే ఎందుకో ఆవైపు దృష్టి మళ్ళించడం లేదు.
అదేవిధంగా రాయలసీమ సాంస్కృతిక ,సాహిత్య వైభవాన్ని తెలిపే విధంగా సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది . ప్రేక్షకులు సైతం యాక్షన్ సినిమాలను ఆదరించినట్లు గా మిగిలిన వాటిని ఆదరించడం లేదు. అందువల్లనే సినిమా రంగం వాళ్ళు కూడా ఫ్యాక్షన్ నేపథ్యంతో సినిమాలు తీసి తమ వ్యాపార అభివృద్ధికి పాటు పడుతున్నారు.
మొట్టమొదటి సారిగా ఇక్కడి ఫ్యాక్షన్ని ఆధారం చేసుకున్న సినిమా ప్రేమించుకుందాం రా. తర్వాత సమరసింహా రెడ్డి, ఆది, ఇంద్ర, ఒక్కడు వంటి సినిమాలు సీమలోని ఫ్యాక్షన్ ని ప్రధాన కథాంశాంగా తీసుకొని నిర్మింపబడ్డాయి. ఒట్టేసి చెబుతున్నా, ఎవడి గోల వాడిదిలో ఫ్యాక్షన్ సినిమాలని హాస్యాస్పదంగా విమర్శించటం జరిగింది.
1997 లో ప్రేమించుకుందాం రా వెంకటేష్ కథానాయకుడిగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో వచ్చిన చిత్రం. ఇది ఘన విజయం సాధించింది. ఈ చిత్రం తర్వాత రాయలసీమ నేపథ్యంలో అనేక చిత్రాలు వచ్చాయి.
‘సమరసింహారెడ్డి’ సినిమాలో రాయలసీమ ముఠాకక్షలు (ఫ్యాక్షనిజం) నేపథ్యంగా తీసుకున్నారు. ఆపైన రాయలసీమ ముఠాకక్షల నేపథ్యం దశాబ్దానికి పైగా తెలుగు సినిమాలను విపరీతంగా ప్రభావితం చేసింది. విజయేంద్రప్రసాద్ కి సహాయకునిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫాక్షన్ ని నేపథ్యంగా ఈ సినిమా తీశారు.
ఆది సినిమా వి.వి.వినాయక్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, కీర్తి చావ్లా ముఖ్యపాత్రల్లో నటించిన 2002 నాటి తెలుగు ఫ్యాక్షన్ సినిమా.
2003 లో గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక్కడు విజయవంతమైన సినిమా. మహేష్ బాబు, భూమిక, ప్రకాష్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.
గతంలో సీమ బ్యాక్ గ్రౌండ్ లో చాలా సినిమాలను తెరకెక్కించేవారు. స్టార్ హీరోలు సైతం రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు.
‘అరవింద సమేత’ రాయలసీమకి చెందిన కొన్ని విద్యార్ధి సంఘాలు జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘ అరవింద సమేత’ సినిమా పై విరుచుక పడ్డాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ రాయలసీమ ప్రాంతంపై కక్ష కట్టిందని ఆ ప్రాంత విద్యార్ధి సంఘాలు ఆరోపించాయి. రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ ‘అరవింద సమేత’ సినిమాతో మళ్లీ రెచ్చగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.సినిమాలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, కొన్ని డైలాగులు తమ మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని వెంటనే వాటిని తొలగించి, దర్శకుడు త్రివిక్రమ్ రాయలసీమ వాసులకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి విద్యార్ధి సంఘాలు.
ఫ్యాక్షన్ సన్నివేశాలు యువత పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని చాలా సందర్భాల్లో మేథావులు ,విద్యార్థులు, ఆవేదన వ్యక్తం చేస్తునే ఉన్నారు. రాయలసీమ వాసుల కష్టాలు ,కన్నీళ్లు, విప్లవ, సంస్కృతి, సాంప్రదాయ నేపథ్యంగా సినిమాలు తీయాలని ఈప్రాంత వాసులు ఆకాంక్షిస్తున్నారు.
రాయలసీమ వాసులు న్యాయంకోసం ,ఇచ్చిన మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్దపడతారని నీతి కోసం నిజాయితీ కోసం కృషి చేస్తారనీ రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో చూపించారు. స్వాంతంత్ర్ర సంగ్రామంలో రాయలసీమ వీరులు ప్రముఖ పాత్ర పోషించిన తీరు తెలుపుతూ సైరా నరసింహా రెడ్డి లాంటి సినిమాలున్నాయి.
రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం గా, రాయలసీమ గొప్పతనం నేపథ్యంగా వచ్చిన రెండు సినిమాల్లో రాయలసీమ నటులున్నారు. ఏది ఏమైనా ఏ ప్రాంత వాసులైనా ప్రజల మనోభావాలు దెబ్బతీయకుండా , కించపరచకుండా విలువలతోకూడుకొన్న ,సందేశాత్మక సినిమాలు తీయాలని ,తీస్తారని ,ఆవిధంగా తీసి సేవలందిస్తారని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *