బీజేపీ కర్నూల్ డిక్లరేషన్ కు కాలం చెల్లిందా ? రాయలసీమ ఉద్యమకారుల సూటి ప్రశ్న 

(యనమల నాగిరెడ్డి)

“రాయలసీమ హక్కుల పరిరక్షణ కోసం” సీమకు చెందిన  బీజేపీ ముఖ్య నాయకులు 2018 ఆగస్టు 23 వ తేదీన కర్నూల్ లో  చేసిన “రాయలసీమ డిక్లరేషన్” కు కాలం చెల్లిందా? ఒకవేళ ఆ డిక్లరేషన్ ఇంకా బ్రతికే ఉంటే  దాని స్థితిగతుల గురించి వెంటనే సీమ వాసులకు బహిరంగంగా తెలియచేయాలని రాయలసీమ విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు సీమ కృష్ణ,  రాయలసీమ యునైటెడ్ ఫోరమ్ అధ్యక్షుడు తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి సంయుక్తంగా బీజేపీ నాయకులను కోరారు . 

 వీరిరువురు ఇటీవల సంయుక్తంగా తాడిపత్రిలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ నాయకులు “తాము ఎంతో అట్టహాసంగా ప్రకటించిన  రాయలసీమ డిక్లరేషన్” ను వెంటనే అమలు చేయించడానికి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు కరపత్రాలను విడుదల చేశారు. 

2018 ఆగస్టులో సీమకు చెందిన బీజేపీ నాయకులు కర్నూల్ లో సమావేశమై 14 పాయింట్ల అజెండాతో సీమ డిక్లరేషన్ విడుదలచేశారని వారు గుర్తు చేశారు. ఐతే అప్పటి నుండి ఆ డిమాండ్లను అమలు చేయించడానికి ఆ తర్వాత వారెవ్వరూ ఇప్పటి వరకు నోరు మెదప లేదని వారు విమర్శించారు. 

సీమ డిక్లరేషన్ లో బీజేపీ నాయకులు రాయలసీమలో రెండవ రాజధాని నిర్మించాలని, శాసనసభ  భవనాలు నిర్మించి మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఆరు నెలల కొకసారి సీమలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని, ముఖ్యమంత్రి నివాస భవనంతో పాటు సెక్రటేరియట్ , గవర్నర్ విడిది నిర్మించాలని  కోరారని వారు గుర్తు చేశారు. 

తాత్కాలిక ప్రాతిపదికన అమరావతిలో ఏర్పాటుచేసిన హైకోర్టును రాయలసీమలో ఏర్పాటుచేయాలని, రాష్ట్ర ప్రభుత్వ హామీ మేరకు  జనాభా ప్రాతిపదికన బడ్జెట్ లో రాయలసీమకు నిధులు కేటాయించాలని, పరిపాలన సౌలభ్యం కోసం సీమలో 8 జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆకరపత్రంలో పేర్కొన్నారని గుర్తుచేశారు. గతంలో హైద్రాబాద్ లో అభివృద్ధి కేంద్రీకృతమై రాష్ట్ర విభజనకు కారణమైందని, అందువల్ల అభివృద్ధి  వికేంద్రీకరణ కోసం కృషి చేస్తామని బీజేపీ నాయకులు ప్రకటించారని, ఆ తర్వాత వారు ఎలాంటి ప్రయత్నం చేయక పోవడం శోచనీయమని వారు పేర్కొన్నారు.  

గతంలో టీడీపీ ఎన్నికల ప్రణాళికలో 600 హామీలు ఇచ్చారని, అందులో రాయలసీమకు 200 హామీలిచ్చారని అందులో 90 శాతం హామీలను అమలు చేయలేదని పేర్కొన్నారని బీజేపీ తన డిక్లరేషన్ లో పేర్కొన్నారని, ఆ తర్వాత వారు తమ హామీల అమలుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని వారు తీవ్రంగా విమర్శించారు.

ప్రస్తుతం ప్రభుత్వం మారిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండవ సారి కూడా ఏర్పాటైందని, అందువల్ల బీజేపీ నాయకులు తాము చేసిన వాగ్దానాలకు కట్టుబడి ఉండాలని వారు కోరారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రవిభజన సమయంలో రాయలసీమకు ఇచ్చిన హామీలను అమలు చేయించాలని, సీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయించి నీటి కేటాయింపులు చేయించాలని వారు కోరారు.