ఈ తెలంగాణ పోలీసు నిజమైన బాహుబలి (వీడియో)

బాహుబలి సినిమాలో బాహుబలికి అంత:పుర బహిష్కరణ శిక్ష విధిస్తారు. ఆ సమయంలో ప్రజలంతా బాహుబలి మనదగ్గరికే వస్తున్నాడని సంబరాలు చేసుకుంటారు. అప్పుడు దండాలయ్యా.. మాతో నువ్వూ ఉండాలయ్యా.. అనే పాట. ఈ సినిమాలో చాలామందికి ఈ సీన్ బాగా నచ్చింది. బాహుబలి నడిచి వస్తుంటే జనాలంతా ఆయనకు దండాలు పెడతారు. దేవుడే మనదగ్గరికి వస్తుండని సంబరపడతారు. బహిష్కరణ సీన్ మినహాయిస్తే.. నిజ జీవితంలో ఇలాంటి సంఘటన తెలంగాణలో జరిగింది. ఒక గురువు నడిచి వస్తుంటే వందల సంఖ్యలో తన శిష్యులు పాదాభివందనం చేసిన ఘటన చూస్తే.. అందరూ ఆశ్చర్యపోతారు. ఈ మనిషి నిజమైన బాహుబలి అన్న ఇంప్రెషన్ కలగకమానదు. అసలు విషయం ఏంటో కింద చదవండి. వీడియో కూడా చూడండి.

ఆయన పేరు కొట్టె ఏడుకొండలు. డైనమిక్ పోలీసాఫీసర్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎక్సైజ్ సిఐ గా పనిచేస్తున్నారు. పుట్టి పెరిగింది నల్లగొండ జిల్లాలో. పెద్దవూర మండలం నాయినవాని కుంటలో జన్మించారు ఏడు కొండలు. ఎక్సైజ్ ఎస్సైగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం సిఐ గా ఉన్నారు. ఏడు నెలల క్రితం నాగర్ కర్నూలు కు బదిలీపై వెళ్లారు.

తన చుట్టూ ఉన్న వారిలో కనీసం వంద మందికైనా మంచి చేయనిదే ఆయనకు ముద్ద దిగదు. నిద్ర పట్టదు. ఇప్పుడు వంద కాదు.. సుమారు 1200 మంది యువతీ యువకులకు గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇచ్చి వారందరికీ గురు దేవుడయ్యాడు. అదేంటి శిక్షణ ఇచ్చిన గురువులంతా దేవుళ్లయితరా? అన్న డౌట్ మీకు రావొచ్చు. కానీ ఈయన ఆ టైప్ కాదు. 1200 మందికి హైదరాబాద్ లోని టాప్ కోచింగ్ సెంటర్లను తలదన్నే రీతిలో ఉచితంగా చదువు చెప్పి వారిని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాడు. అందుకే బహుశా నవీన కాలంలో ఏ గురువుకూ దక్కని గౌరవం ఆయనకు దక్కింది. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు తీసుకుని పాఠాలు చెప్పే గురువులకు పాదాభివందనం చేయాలంటే ఏ విద్యార్థికీ మనసొప్పదు. కానీ.. నిస్వార్థంతో నయా పైసా ఫీజు తీసుకోకుండా తను పోలీసు డ్యూటీ చేస్తూనే.. ఖాళీ సమయంలో యువతకు పాఠాలు చెప్పి పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేపిస్తున్నడు కాబట్టే ఈ పాలమూరు పోరగాళ్లు పోలీసు పంతులకు పాదాభివందనం చేశారు.

నాగర్ కర్నూలులో గత నాలుగు నెలలుగా ఉదయం 7.00 గంటల నుంచి 8.30 గంటల వరకు గ్రూప్ 1, గ్రూప్ 2 కోచింగ్ ఇస్తారు ఏడు కొండలు. ఉదయం బ్యాచ్ లో 700 మంది క్లాస్ కు వస్తారు. సాయంత్రం 6గంటల నుంచి 7.30 గంటల వరకు మరో బ్యాచ్ కి క్లాస్ చెప్తారు. ఈ కోచింగ్ లో అన్ని సబ్జెక్టులను తానొక్కడే బోధిస్తారు. సాయంత్రం బ్యాచ్ లో 500 మంది వరకు క్లాస్ కు వస్తారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాలకు క్లాసులు చెప్పాలంటే క్లాస్ రూమ్ లు చాలవు కాబట్టి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉదయం, సాయంత్రం క్లాసులు చెబుతున్నారాయన.

అయితే మార్చి 30వ తేదీన తనవద్ద కోచింగ్ కోసం వచ్చే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిచి తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పాదపూజ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏందంటే? పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరగడం, వారి బాధలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసుకుని మరింత బాధ్యతగా కసిగా పోటీ పరీక్షలకు సిద్ధం కావడమేనని ఏడు కొండలు చెప్పారు.

అయితే ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్, వారి పేరెంట్స్ కలిపి సుమారు 3వేల మంది వరకు హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్, వారి పేరెంట్స్ మధ్య గొప్ప బంధాన్ని నెలకొల్పే ప్రయత్నం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడు కొండలు తల్లి లింగమ్మ, సతీమణి జ్యోతి, ఇద్దరు కొడుకులు కార్తీక్, కౌషిక్ కూడా హాజరయ్యారు. ఏడుకొండలును వేదిక మీదకు పిలిచే సమయంలో విద్యార్థులంతా ఆయనకు పాదాభివందనం చేస్తూ పూలవర్షం కురిపించారు. ఆ వీడియో కింద ఉంది చూడొచ్చు. ఈ కార్యక్రమం ఊహించనిదానికంటే గొప్పగా జరిగిందని ఏడుకొండలు సంతృప్తి వ్యక్తం చేశారు.

నల్లగొండలోనూ ఇదే పని

ఏడు కొండలు గత మూడేళ్లుగా నల్లగొండలోనూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. నల్లగొండలో పలు బ్యాచ్ లకు ఆయన ఉచిత కోచింగ్ ఇచ్చారు. ఆయన వద్ద కోచింగ్ తీసుకుని చదువుకున్న వారిలో 178 మందికి గ్రూప్  1 నుంచి మొదలుకొని గ్రూప్ 2, ఎస్సై, ఇతర పోస్టులు సాధించారని గర్వంగా చెబుతారు ఏడు కొండలు. తన వద్ద చదువుకుని ఉద్యోగాలు పొందిన వారందరికీ ఇటీవల నల్లగొండ కలెక్టరేట్ లో కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేశామని చెప్పారు. ఏడు కొండలు శిష్యులకు సన్మానం చేసే వీడియో కింద ఉంది.

ఎక్సైజ్ సిఐ గా తన డ్యూటీ చేస్తూనే ఎక్కడా విధులకు ఆటంకం కలగకుండా ఖాళీ సమయంలోనే తాను క్లాసులు చెబుతానని వెల్లడించారు. రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమం శక్తి వంచన లేకుండా కొనసాగిస్తానని ఏడుకొండలు స్పష్టం చేశారు. కోచింగ్ పేరు వింటేనే పేద, మధ్య తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల గుండెలదిరే ఈ రోజుల్లో ఏడు కొండలు ప్రయత్నం అద్భుతమే. వేలు, లక్షలు ఫీజులు చెల్లించి కోచింగ్ లకు వెళ్తున్న ఈరోజుల్లో సిఐ ఏడు కొండలు పేద విద్యార్థులకు వరంగా లభించారు. ఏడు కొండలు లాంటి వాళ్లు జిల్లాకు ఒకరుంటే పేద, పేద మధ్యతరగతి విద్యార్థులు కూడా ఉద్యోగాలు కొట్టడం పెద్దగా కష్టమేమీ కాదేమో…?

ఏడు కొండలు మీద అభిమానంతో ఆయన శిష్యబృందం రూపొందించిన వీడియో ఒకటి పైన ఉంది చూడొచ్చు.

2 thoughts on “ఈ తెలంగాణ పోలీసు నిజమైన బాహుబలి (వీడియో)

  1. Proud to say that he is my guru ..
    Blessed to have you sir & feel soo happy to be a part of this mission THE MISSION

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *