వైరల్ న్యూస్ : అంటుకుంటున్న హిందీ వ్యతిరేకత

మూడు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం  జాతీయ విద్యావిధానం-2019 (National Education Policy- 2019) ముసాయిదాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇది సంచలనం సృష్టిస్తూ ఉంది.   ప్రఖ్యాత శాస్త్రవేత్త కె కస్తూరి రంగన్ నాయకత్వంలో ఈ రూపొందింది. ఈ విధానంలో త్రిభాషా సూత్రాన్ని నొక్కి చెప్పారు. నర్సరీ నుంచి 12 వ తరగతి వరకు హిందీని కంపల్సరీ చేయాలని సూచించారు. ఇది ముసాయిదా ప్రతిపాదనే అయినా చాలా వివాదాస్పద మయింది. హిందీయేతర రాష్ట్రాలలో వ్యతిరేకత తీసుకువచ్చింది.
తమిళనాట ప్రాంతీయ పార్టీలన్నీ హిందీ కంపల్సరీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
కేందం ఈ మధ్య ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదా లో త్రిభాషా సూత్రాన్ని అమలుచేయాలని పట్టుబడుతూ ఉంది.ఇది కంపల్సరీ అయినపుడు హిందీని ఒక కంపల్సరీ సబ్జక్టు చేయాల్సి వస్తుంది.
దీనిని తమిళనాడులో రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయి. చివరకు బిజెపికి మిత్రపక్షమయిన ఎఐడిఎంకె ప్రభుత్వం కూడా దీనిని వ్యతిరేకించింది. మేం ద్విభాషా సూత్రాన్ని అంటే తమిళం, ఇంగ్లీష్ సూత్రాన్నే పాటిస్తామని, అమలుచేస్తామని ఆ పార్టీ స్పష్టంగా చెబుతూ  ఉంది. అంటే మూడువందల సీట్లు పార్లమెంటులో గెల్చుకున్న ధీమాతో హిందీని బలవంతంగా అన్ని రాష్ట్రాలలో రుద్దేందుకు బిజెపి ప్రయత్నిస్తే తమిళనాడుతో పాటు పలురాష్ట్రాలు వ్యతిరేకించబోతున్నాయి.
తెలుగు రాష్ట్రాలు ఇంకా ఈ విషయం మీద తమ స్పందన వెల్లడించలేదు.
ఇక్కడొక విషయం గమనించాలి. పారామిలిటరీ దళాలత అనేక సెంట్రల్ సర్వీసులలో ఉద్యోగాల రిక్రూట్ మెంట్ పరీక్షలు ఇంగ్లీష్ లేదా హిందీ భాషలలోనే జరిగేవి.
ఫలితంగా ఈ సర్వీసులకు హిందీ భాష రాని దక్షిణ భారత యువకులు చాలా తక్కవుగా సెలక్టయ్యేవారు. వాజ్ పేయి ప్రధాని గా ఉన్నపుడు అనేక రాష్ట్రాల ఎంపిలు పార్లమెంటులో ఈ విషయం నిరంతరం ప్రస్తావించి, గొడవలు చేసి, పార్లమెంటును స్తంభింప చేసి విజయవంతమయ్యారు. ఈవిషయంలో సభలో ఎపుడూ గొడవ చేస్తూ ప్రస్తావించిన నాయకుడు నాటి టిడిపి ఎంపి కింజారపు ఎర్రన్నాయుడు.
బీహార్ వంటి హిందీ రాష్ట్రాల నుంచిఎక్కువ మంది యువకులు పెద్ద ఎత్తున సెంట్రల్ సర్వీసులకు సెలక్టయ్యేందుకు కారణం కేంద్రంలో హిందీ మీడియంలో పరీక్ష రాసేందుకు వీలుండటమే.
తెలుగు వారు ఎక్కువ సంఖ్యలో ఆల్ ఇండియాసర్వీసులలోకి సెలెక్ట్ కావడం మొదలయింది తెలుగు మీడియంలో పరీక్షలు రాయడం అనుమంతించినందునే.
ఇలాంటపుడు హిందీని బలవతంగా దేశ ప్రజలందరి చేత మాట్లాడించే ప్రయత్నం జరగుతూ ఉందని, దీనిని మేం వ్యతిరేకిస్తామని హిందీయేతర రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇంతవరకు తమిళనాడు ఈ విషయంలో లీడ్ లో ఉండింది. ఇపుడు బెంగాల్ కూడా తోడవుతూ ఉంది.
నూతన విద్యావిధానం ముసాయిదా వెలువడినప్పటినుంచి ట్విట్టర్ #StopHindiImposition, #TNAgainstHindiImposition అనే హ్యాష్ టాగ్ లు ట్రెండింగ్ లో ఉన్నాయి.
కొత్త విద్యావిధానం ముసాయిదా ప్రకారం ప్రీస్కూల్ నుంచి 12 వ తరగతి దాకా హిందీని కంపల్సరీ చేయాలని ప్రతిపాదిస్తున్నారు.
ప్రీస్కూల్ నుంచి ఇంటర్ దాకా హిందీని కంపల్సరీ చేయాలనడం షాకింగ్ నిర్ణయం . ఇది దేశాన్ని విభజిస్తుందని డిఎంకె నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. కేంద్రం ఈ నూతనవిద్యావిధానం ముసాయిదాను మే 31న విడుల చేసింది.
కేంద్రం హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయదని, అలాంటి ప్రయత్నం చేసి మరొక భాషా ఉద్యమానికి నిప్పురాజేయడమేనని అనుకుంటున్నానని స్టాలిన్ అన్నారు. అలా చేస్తే తీవ్రపరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. దాదాపు ఇలాగే హచ్చరించారు ఎండిఎంకె నాయకుడు వైకో.
కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పి. చిదంబరం కూడా దీనిని వ్యతిరేకించారు. ‘స్కూళ్లలో త్రిభాషా సూత్రం అంటే అర్థం ఏమిటి? దీనర్థం స్కూళ్లలో హిందనీ కంపల్సరీ చేయడమే. ఇలా చేసి బిజెపి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటూ ఉంది,’ అని చిదంబరం వ్యాఖ్యానించారు.

 

ఈ లోపు బెంగాల్ నుంచి ఒక పాత హిందీ గొడవ వీడియో వైరలయ్యింది.
ఈ వీడియోలో కలకత్తా ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారితో ఒక బెంగాళీ యువకుడు గొడవపడటం ఉంది. ఇందులో ఇమిగ్రేషన్ అధికారి ఇంగ్లీష్ లో కాకుండా, హిందీ లో ప్రశ్నలడుగుతాడు. దీనికి బెంగాలీయువకుడు, తనకు హిందీ అర్థం కాదని బెంగాలీలో చెబుతాడు.ఈ వ్యక్తి తృణమూల్ కాంగ్రెస్ కు కెందిన గర్గా ఛటర్జీ అని కొందరంటున్నారు.
ఏమయితేనేం, ఈ సంభాషణ మొత్తం హిందీ పెత్తనానికి వ్యతిరేకంగా జరిగింది. ఇమిగ్రేషన్ అధికారికి బెంగాలీ యువకుడు కొన్ని డాక్యుమెంట్లు అందించాడు. అందులో ఫలానా డాక్యుమెంట్ ఉందా అని అధికారి హిందీలో అడగటంతో బెంగాలీయువకుడికి చిర్రెత్తుకొచ్చింది.
నువ్వుహిందీలో ఏమడుగుతున్నావో నాకు అర్థమయి చావడంలేదని బెంగాలీలో యువకుడు చెబుతున్నాడు (Ki Bollen Bujhte paarlam naa. I didn’t understand what you just said.) కొత్త పాస్ పోర్టు తీసుకున్నావా అని అధికారి హిందీలోనే అడుగుతున్నాడు. బెంగాలీ యువకుడు మాత్రం “Hindi Boojhi Na (I don’t understand Hindi.)” అని చెబుతున్నాడు.
విసుగొచ్చిన ఇమిగ్రేషన్ అధికారి చివరకు పక్కనున్న కొలీగ్ ని అడిగి సహాయం కోరతాడు. ఆయన కొత్త డాక్యుమెంట్ తీసుకున్నావా అని బెంగాలీలో అడుగుతాడు. ‘అదిగో ఆ పైనున్నదే కొత్త పాస్ పోర్ట్ ’ అని బెంగాలీ యువకుడు బెంగాలీలో కూల్ గా  సమాధానమిస్తాడు. అంతే గొడవ సమసిపోయింది.
హిందీయేతర రాష్ట్రంలో  హిందీలో మాట్లాడితే ఎలా అనే ఇంగిత జ్ఞానం ఇమిగ్రేషన్ అధికారి ప్రదర్శించలేదు.తనకి బెంగాలీ రాకపోతే ఇంగ్లీష్ లో అడిగి ఉండవచ్చు.దేశం లో ప్రతిచోట నార్త్ నుంచి వచ్చే వచ్చేవాళ్లంతా ఇలాగే ప్రవర్తించడం మనకు రోడ్ల మీద రోజూ కనబడుతుంది. మన భాష వాళెందుకు నేర్చుకోరు, మనమే వాళ్ల భాష నేర్చుకోవాలనే మనస్తత్వం ఇది. ఇదే ధోరణి కేంద్రం ప్రదర్శిస్తూ ఉందని, ఇది ఆందోళనకు దారితీస్తుందని చాలామంది హిందీయేతర రాష్ట్రాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
https://www.facebook.com/727221064127366/videos/939280369588100/?t=15
వీడియో ఇపుడు వైరలయిపోయి పెద్ద చర్చ కు దారి తీసింది. తాజాగా బెంగాల్ కూడా హిందీ వ్యతిరేక ఉద్యమంలోకి ప్రవేశిస్తూ ఉంది.
తెలుగు వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి.

(trendingtelugunews.com మంచి జర్నలిజాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం. మీ సహకారం కావాలి.మీకు నచ్చిన వార్తలను షేర్ చేసి ప్రోత్సహించండి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *