Home Telugu పేరులోనే ఛాలెంజ్…గ్రౌండులో హుష్ కాకి!

పేరులోనే ఛాలెంజ్…గ్రౌండులో హుష్ కాకి!

72
0
SHARE

(బి. వేంకటేశ్వర మూర్తి)

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుంది ఐపిఎల్ లో ఆర్ సి బి పరిస్థితి. తారా తోరణంలా కనిపించే బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుకు విజయ శిఖరాగ్రం అధిరోహించి ఇండియన్ ప్రిమియర్ లీగ్ కప్పు పైకెత్తి పట్టుకునే యోగం ఇప్పటికీ ఆసన్నం కానేలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలో భారత జట్టు దేశ విదేశాల్లో ఎన్నెన్నో అపూర్వమైన విజయాలు సాధించగబలిగింది కానీ అదే నాయకుడి సారధ్యంలోనే అయినా బెంగుళూరు జట్టు కథ నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్టు తయారయింది.

గత పదకొండు ఐపిఎల్ ఎడిషన్ల లో ఈ జట్టు కేవలం మూడు సార్లు (2009, 11, 16) మాత్రం ఫైనల్ చేరగలిగింది. మొత్తం 167 పోటీల్లో ఆడి 78 విజయాలూ, 84 పరాజయాలు చవిచూసింది. రెండు మ్యాచ్ లు టై అవగా, మూడింటిలో ఫలితం రాలేదు.

క్రిస్ గేల్, విరాట్ కోహ్లి, ఏ బి డివిలియర్స్, క్వింటన్ డికాక్ వంటి మేటి బ్యాట్స్ మెన్ పరుగుల వరద పారిస్తున్నా జట్టుకు అంతిమ విజయం మాత్రం అందని పండుగానే మిగిలిపోయింది. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక, అత్యల్ప స్కోర్ లు రెండూ ఈ జట్టు పేరనే ఉండటం విశేషం. (263/5, వారియర్స్ పై-2013, 49 ఆలౌట్ కేకేఆర్ చేతిలో- 2017).

కోహ్లీ

ఫార్మ్ కోల్పోయిన గేల్ ను గతేడాది వేలంలో ఆర్ సి బి వద్దులే అతని వదిలేసుకుంది. ఈ ఏడాది వేలంలో బ్రెండన్ మెక్కుల్లమ్, కోరే ఆండర్సన్, క్రిస్ వోక్స్ లతో సహా మొత్తం తొమ్మిది మంది పాతవారిని విడుదల చేసింది. డికాక్ ను ముంబైకి విక్రయించింది. మన్ దీప్ సింగ్ ను పంజాబ్ కి ఇచ్చేసి మార్కస్ స్టోయినిస్ ని బదులు పుచ్చుకుంది.

కోహ్లి, డివిలియర్స్ విధ్వంసక బ్యాటింగ్ తో పరుగుల కుంభవృష్టి కురిపిస్తున్నా పస లేని బౌలింగ్ కారణంగా గతేడాది ఆర్ సి బికి పరాజయాల పరాభవాలే ఎదురవుతూ వచ్చాయి. స్టొయినిస్, సౌతీ, ఉమేష్ యాదవ్, కౌల్టర్ నైల్, చహాల్, మొయినలీ వంటి మేటి బౌలర్ల లైనప్ తో ఈసారి దౌర్బల్యాలు తొలగిపోగలవని ఆర్ సి బి ఆశిస్తున్నది. బిగ్ హిట్టింగ్ యువతరంగం శివమ్ దూబే, వెస్టిండీస్ తాజా సంచలనం హెట్మయర్ ల చేరికతో బ్యాటింగ్ మరింత బలోపేతమవుతున్నది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ లలో ఆడుతున్న డివిలియర్స్ అద్భుతమైన ఫార్మ్ లో ఉండటం కూడా పెద్ద ప్లస్ పాయింటు.

ఈ సీజన్ లో ఆర్ సి బి ఆరంభ పోటీలో చెన్నై సూపర్ కింగ్స్ ని ఢీ కొంటున్నది.

(బి.వేంకటేశ్వరమూర్తి,సీనియర్ జర్నలిస్టు, బెంగుళూరు)

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here