Home English రిస్ట్ స్పిన్ గూగ్లీ ఇంద్రజాలానికి ఆద్యుడు అబ్దుల్ ఖాదిర్ : నివాళి

రిస్ట్ స్పిన్ గూగ్లీ ఇంద్రజాలానికి ఆద్యుడు అబ్దుల్ ఖాదిర్ : నివాళి

65
0
SHARE
(బి వెంకటేశ్వర మూర్తి)
అబ్దుల్ ఖాదిర్ (1955-2019) ను స్పిన్ ఆల్ టైమ్ గ్రేట్ లలో ఒకడుగా పరిగణించే వారు చాలా మంది ఉన్నారు. మణికట్టు మహేంద్రజాలంతో రిస్ట్ స్పిన్ కళను మరెవ్వరూ అందుకోలేని మహోన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మాత్రం అబ్దుల్ ఖాదిర్ కు పోటీ కేవలం షేన్ వార్న్ మాత్రమే. మొన్న శుక్రవారం రాత్రి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ల మధ్య టెస్ట్ మ్యాచ్ చూస్తూ కుర్చీలో వొరిగిపోయిన ఖాదిర్ గుండెపోటుతో అక్కడికక్కడే తుదిశ్వాస వదిలాడు.లాాహోర్ లోని ధరమ్ పుర కు చెందిన వాడు ఖాదిర్.
స్పిన్ ఆల్ టైమ్ గ్రేట్ లలో షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్, మన జుంబో స్పిన్నర్ అనిల్ కుంబ్లే లతో పాటు అబ్దుల్ ఖాదిర్ పేరు కూడా చేర్చక తప్పదు. రాశి కంటే వాసి కే ప్రాధాన్యం ఇచ్చేట్టయితే ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యద్భుత స్పిన్ బౌలర్ ఎవరని పోలింగ్ జరిపితే వార్న్, ఖాదిర్ బాహాబాహీగా పోటీ పడతారు.

FLASH … FLASH దక్షిణ భారతంలో టెర్రరిస్టు దాడి, సైన్యం అనుమానం…

అబ్దుల్ ఖాదిర్ 1990లో (వెస్టిండీస్) చివరి టెస్టూ, 1993లో (శ్రీలంక) చివరి వన్ డే మ్యాచ్ ఆడాడు. వార్న్ 1992లో (ఇండియా) మొదటి టెస్టూ, 1993లో (న్యూజిలాండ్) మొదటి వన్ డే ఆడాడు. 1977లో కెరీర్ ఆరంభించిన ఖాదిర్ 80వ దశకంలో ప్రపంచంలో ఆనాటి తిరుగులేని స్పిన్నర్ గా ఓ వెలుగు వెలిగాడు. ఓ కోణం నుంచి చూస్తే ఖాదిర్ వెలిగించి ప్రజ్వలింపజేసిన లెగ్ బ్రేక్ గూగ్లీ కాగడాకు కొనసాగింపే షేన్ వార్న్. ఆ కాగడా కాంతులకు మరిన్ని వెలుగు జిలుగుల్ని సంతరించి మరింత ఉద్దీప్తం చేశాడు వార్న్.
ఖాదిర్, షేన్ వార్న్ బౌలింగ్ లో చాలా సారూప్యాలున్నాయి. మౌలికంగా ఇద్దరూ ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెట్టి అవుట్ చేసేందుకే ప్రయత్నిస్తారు. వీళ్ల అటాకింగ్ వ్యూహంలో ప్రధానమైన  బలం బ్యాట్స్ మెన్ ఊహకందని వైవిధ్యం. ఆరు బంతుల్ని ఆరు రకాలుగా బౌల్ చేయడంలో ఎవరికి వారే సాటి. బౌలింగ్ ఆర్మ్ ని చెవికి అతి చేరువగా తీసికెళ్లి బంతి విసరడం మొదలుకుని, త్రో కాని విధంగా చట్టబద్ధమైన బౌలింగ్ యాక్షన్ అనుమతించేలోగా ఎన్నెన్ని కోణాల్లో బౌలింగ్ చేయవచ్చో అన్ని రకాలు గానూ బంతి విసురుతూ బ్యాట్స్ మన్ కు ముచ్చెమటలు పోయించగల లాఘవం, ప్రతిభ ఖాదిర్ సొంతం. దీనికి తోడు బంతి చేతి నుంచి విడివడటానికి ముందు మణికట్టు కదలికల మాయాజాలం. అసలు బంతికి బిల్డప్ మాదిరిగా, గ్రౌండ్ మీదున్న తేళ్ల నుంచి తప్పించుకుంటున్నట్టు జిగ్ జాగ్ గా నాలుగు లాంగ్ జంప్ అడుగులేస్తూ విచిత్రమైన ఆ బౌలింగ్ రనప్. ఈ రనప్ కు కొద్ది క్షణాల ముందు, బ్యాట్స్ మెన్ మనసులో ఏముందో చదివేస్తున్నట్టు ఎర్రబంతిని ఎడంచేతి మునివేళ్లతో ముద్దు చేస్తూ గింగిర్లు తిరిగేలా ఓ జానెడెత్తు ఎగరేసి స్టయిల్ గా పట్టుకోడం.
చంద్రుని దారిలో సిగ్నల్ జంప్ చేసినందుకు నోటీస్

ప్లీజ్ విక్రమ్, వెంటనే స్పందించాలి : నాగపూర్ పోలీసుల నోటీసు

ఇక ఖాదిర్ బంతి పిచ్ పై పడ్డాక ఎటు నుంచి ఎటు వెళ్తుందో దేవుడిక్కూడా తెలీదు. మధ్యమధ్య మంత్రించిన పిడిబాకులా దూసుకొచ్చే గూగ్లీని అడ్డుకోడానికి బ్యాట్ చాటంత వెడల్పున్నా చాలదు. ఖాదిర్ కైనా, వార్న్ కైనా గూగ్లీ అరుదుగా ప్రయోగించే సర్ ప్రైజ్ వెపన్ మాత్రమే. మామూలు బ్యాట్స్ మెన్ ని బోల్తా కొట్టించడానికి ఈ ఇద్దరు అద్వితీయుల మణికట్టు  చుట్టూరా ఎన్నెన్నో ట్రిక్కులు సర్వధా సిద్ధంగా ఉంటాయి.
కెరీర్ లో పడగొట్టిన మొత్తం వికెట్ల రాశి ఫలాలు గమనించినట్టయితే 133 టెస్టుల్లో ఏకంగా 800 వికెట్లు పతనం చేసిన  మురళీధరన్ స్పిన్నర్లలో అందరి కంటే మొనగాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు పడగొట్టిన షేన్ వార్న్, 132 టెస్టుల్లో 619 వికెట్లు తీసుకున్న జుంబో కూంబ్లే తర్వాత  వచ్చేతదుపరి స్థానం ఖాదిర్ ది. అతను 67 టెస్టుల్లో మొత్తం 236 వికెట్లు కూల్చాడు.
గణాంకాల కొలబద్దతో క్రీడాకారుల ప్రతిభా పాటవాలను అంచనా కట్టడం ముమ్మాటికీ అనుచితం. ప్రపంచ ప్రసిద్ధ భారత స్పిన్ చతుష్టయం (బిషన్ సింగ్ బేడీ, ఎరాపల్లి ప్రసన్న, వెంకటరాఘవన్, బిఎస్ చంద్రశేఖర్) శకం ముగిశాక భారత ఉపఖండం నుంచి మళ్లీ స్పిన్ బౌలింగ్ కళకు అంతటి ప్రాభవం కలిగించింది ముమ్మాటికీ ఖాదిరే. చంద్రశేఖర్ ఫాస్ట్ బౌలర్ లాగానే కాస్త దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లెగ్ స్పిన్ వేసేవాడు. ఈ ఫాస్ట్ స్పిన్ పరంపరకు మధ్య వెరైటీగా ఒక్కో గూగ్లీ అంతే స్పీడుతో దూసుకొచ్చేసరికి బ్యాట్స్ మెన్ అర్థంగాక అల్లాడిపోయి వెల్లకిలా పడేవారు. చిన్నప్పుడు ఎప్పుడో కిందపడి పుత్తూరు కట్టుతో సొట్టచేయి ఉండటం వల్ల చంద్ర స్పిన్ కు, ముఖ్యంగా గూగ్లీకి అంతటి మహత్తు వచ్చిందని అప్పట్లో చెప్పుకొనేవారు. చంద్రశేఖర్ టెస్టు కెరీర్ 1964లో ఆరంభమై 1979తో ముగిసింది. చంద్ర శకం ముగియడానికి రెండేళ్ల ముందు నుంచి ఖాదిర్ బౌలింగ్ ఆరంభమయింది. చంద్రది ఫాస్ట్ లెగ్ స్పిన్ లో గూగ్లీ. ఖాదిర్ ది రిస్ట్ లెగ్ స్పిన్ లో గూగ్లీ. రిస్ట్ స్పిన్ లో గూగ్లీకి బహుశ అబ్దుల్ ఖాదిరే ఆద్యుడు. ఈ రకం బౌలింగ్ ను ఇంకా ఇంకా పైపైకి తీసికెళ్లిన ఘనత వార్న్ ది.
పాకిస్తాన్ మాజీ కెప్టన్ ఇమ్రాన్ ఖాన్ లెక్క ప్రకారం ఆస్ట్రేలియాకు చెందిన షేన్ వార్న్, భారత తార అనిల్ కుంబ్లేల కంటే ఖాదిర్ ఇంకాస్త మెరుగైన బౌలర్.  అబ్దుల్ ఖాదిర్ బౌలింగ్ ను సన్నిహితంగా గమనించిన, ఖాదిర్ బౌలింగ్ ప్రతిభను జట్టు విజయాల కోసం చక్కగా వినియోగించుకున్న పాక్ కెప్టెన్ గా ఇమ్రాన్ చెప్పే విశ్లేషణ ఎంతో ఆసక్తికరమైంది. ఖాదిర్ ఆడేకాలంలో బ్యాక్ ఫుట్ షాట్లు ఆడినప్పుడు మాత్రమే ఎల్ బి డబ్ల్యు అవుట్ ఇచ్చేవారు. బ్యాట్స్ మెన్ అడుగు ముందుకేసి బంతిని ఆడితే (ఫార్వర్డ్ డిఫెన్స్/అఫెన్స్) అంపైర్లు ఎల్ బి డబ్ల్యు ఇచ్చే ప్రసక్తే లేదు. అందువల్ల ఖాదిర్ తన లైన్ అండ్ లెంత్ క్రమశిక్షణను దీటుగా ఉపయోగించి బ్యాట్స్ మన్ చచ్చినట్టు బ్యాక్ ఫుట్ షాట్లు ఆడి తీరవలసిన నిర్బంధ పరిస్థితులు సృష్టించి మరీ తన వికెట్ సాధించుకునే వాడు. కానీ వార్న్, కూంబ్లే ఆడేనాటికి నియమ నిబంధనలు మూలమట్టంగా మారిపోయాయి. బ్యాట్స్ మన్ రెండడుగులు ముందుకు వచ్చి ఆడినా బంతి ప్యాడ్స్ కు తగిలినట్టయితే ఎల్ బి డబ్ల్యు అపీల్ చేసేందుకు, అంపైర్లు అవుట్ ఇచ్చేందుకు ఇప్పుడు ఏ మాత్రం అభ్యంతరం లేదు. రూల్స్ మారడంతో పాటు, వెంట్రుక వాసి తేడాలను కూడా కచ్చితంగా పసిగట్టే స్టంప్ కెమెరా, స్నికో మీటర్, వగైరా అత్యధునాతన సాంకేతిక పరికరాలూ, మూడో అంపైర్, బౌలర్లకు డిఆర్ఎస్ హక్కులు అందుబాటులోకొచ్చిన ప్రస్తుతకాలంలో ఖాదిర్ బౌలింగ్ చేసి ఉంటే ఆ కథే వేరుగా ఉండేదన్న ఇమ్రాన్ ఆర్గ్యూమెంట్ కూడా సముచితమే అనిపిస్తుంది. పాత తరం ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ గ్రాహం గూచ్ కూడా షేన్ వార్న్ కంటే కూడా ఎంతో ప్రతిభావంతుడైన లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ అని అభిప్రాయపడ్డాడు.
ఎవరి అభిప్రాయాలూ, ఆర్గ్యుమెంట్లు ఎలా ఉన్నా వెనకటి తరం క్రికెటర్లలో లెగ్ స్పిన్ మాయా మహేంద్రజాలంతో క్రికెట్ మజా తలకెక్కించిన అత్యద్భుత బౌలర్ గా అబ్దుల్ ఖాదిర్ పేరు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.