వైసీపీకి చంద్రబాబు బంధువు రాజీనామా

ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నారు. సర్వేలు చేయించి, గెలుపోటములు బేరీజు వేసుకుని గెలుపు గుర్రాలకి టికెట్ కేటాయించడంపై దృష్టి సారించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలివిడత అభ్యర్థుల జాబితాను సంక్రాంతి తర్వాత ప్రకటించనున్నారు. ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ తరపున బరిలోకి దింపే అభ్యర్థులను ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజున ప్రకటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇక జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వైసీపీ, టీడీపీ ప్రకటించిన తర్వాత తమ అభ్యర్థులను ప్రకటిస్తానని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో టికెట్ ఆశావహులలో ఉత్కంఠ మొదలైంది. ఇప్పటికే పార్టీలో అసంతృప్తితో ఉన్న కొంతమంది నేతలు పార్టీలు కూడా మారారు. ఈ తరుణంలో వైసీపీకి మరో సీనియర్ నేత రాజీనామా చేసినట్టు సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన వైసీపీ అధినేత జగన్ కు రాజీనామా లేఖ పంపినట్లు సన్నిహితవర్గాల సమాచారం. ఆయన ఆశించిన టికెట్ దక్కకపోవడమే కారణం అని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం కింద ఉంది చదవండి.

ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆశించారు. అయితే విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలని పార్టీ అధినేత జగన్ సూచించారు. దీంతో మనస్థాపానికి గురయ్యారు ఆదిశేషగిరిరావు. పార్టీలో అసంతృప్తితో రగులుతున్న ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జనవరి తొమ్మిదిన జగన్ అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆశించిన టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలనీ భావించిన ఆయన మంగళవారం అధిష్టానానికి రాజీనామా లేఖ పంపినట్లు తెలుస్తోంది.

కాగా చంద్రబాబునాయుడుకి ఆదిశేషగిరిరావు బంధువు కావడంతో ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉందని నేతలు భావిస్తున్నారు. కుటుంబ సభ్యులతో, అనుచరవర్గంతో రాజకీయ భవిష్యత్తుపై సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఆదిశేషగిరిరావు… కృష్ణ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ తరఫున పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి టీడీపీలో చేరడంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *