అధైర్యం, అపనమ్మకం, అవిధేయత తెలియని వాడు…

 (టి.లక్ష్మినారాయణ*)

సామాజిక స్పృహతో, విప్లవాత్మక సందేశంతో, సినిమాలను తీసి, ప్రజల్లో చైతన్యాన్ని రగుల్కొల్పడానికి అంకితభావంతో పిడికిలి బిగించి పోరుసల్పిన సినీ నటుడు, నిర్మాత మాదాల రంగారావు గారు అనారోగ్యంతో మృతి చెందడం అత్యంత విషాదకరమైన వార్త.

విద్యార్థి దశలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్(ఎ.ఐ.ఎస్.ఎఫ్.) ద్వారా మార్క్సిజం భావజాలం వైపు ఆకర్షితుడైన మాదాల గారు శ్రామిక ప్రజలను చైతన్య పరచి, సంఘటిత పరచి, ఉద్యమ బాట పట్టేలా చేయడానికి కళా రంగాన్ని, ప్రత్యేకించి సినీ రంగాన్ని ఎంచుకొని మొక్కవోని ధైర్యంతో మడమతిప్పని పట్టుదలతో, ఆర్థిక ఇబ్బందులను సహితం లెక్క చేయకుండా ప్రగతిశీల, అభ్యుదయ, విప్లవాత్మక సందేశాలతో సినిమాలు తీసి శ్రామిక జనావళే కాదు, ప్రజల హృదయాలలో శాశ్వత స్థానాన్ని కల్పించుకొని, తెలుగు సినీ రంగంలో నూతన వరవడి సృష్టించి, చెరగని ముద్ర వేశారు.

కమ్యూనిస్టు, కార్మికోద్యమాలకు అండగా నిలవడమే కాదు, సినిమాల ద్వారా ఆర్జింజిన ధనంలో అత్యధిక భాగాన్ని వెనకా ముందు ఆలోచించకుండా విరాళాలు ఇచ్చి ప్రోత్సహించి, తాను మాత్రం ఆర్థికంగా చితికిపోయారు.

మాదాల ముఖంలో ఏనాడు అధైర్యం, అపనమ్మకం, అవిధేయత కనపడ లేదు. ఆయనలో పట్టు సడల లేదు. మార్క్సిజం పట్ల విశ్వాసం సన్నగిల్ల లేదు.

కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక పర్యవసానంగా వివిధ పార్టీలుగా మనుగడ సాగిస్తున్నా కా.మాదాల రంగారావును అందరి వాడుగానే చూశారు, అభిమానించారు. ఆయన కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత కోసం, బలహీనతల నుండి బయటపడి బలోపతం కావాలని పరితపించారు.

కా. మాదాల రంగారావు గారిని నేను మొట్టమొదట కలుసుకొన్నది 1979లో అనుకొంటాను. కందుకూరులో జరిగిన ప్రకాశం జిల్లా ఎ.ఐ.ఎస్.ఎఫ్. జిల్లా మహాసభ సందర్భంగా బహిరంగ సభ జరిగింది. నేను ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర కేంద్రం నుండి వక్తగా వెళ్ళాను. మాదాల గారు ముఖ్య అతిథిగా హాజరైనారు. విద్యార్థులే కాకుండా ప్రజలు పెద్ద ఎత్తున హాజరైనారు. సభ ప్రారంభం కాగానే ‘మాదాల జిందాబాద్, ఆయన మాట్లాడాలి’ అన్న నినాదాలు జోరందుకున్నాయి. మాదాల గారు మైకు పుచ్చుకొని, కా.లక్ష్మీనారాయణ ఎ.ఐ.ఎస్.ఎఫ్. రాష్ట్ర నాయకుడు, తమ్ముడు మాట్లాడాకే నేను మాట్లాడతానని ప్రకటించారు.

ఆ గోలలో మాట్లాడడం ఏ మాత్రం ప్రయోజనం లేదన్న నిర్ధారణకు వచ్చిన నేను, మాదాల రంగారావు గారు ఉపన్యసించి వెళ్ళి పోయిన తరువాతనే మాట్లాడతానని సభా నిర్వాహకులకు నా నిశ్చితాభిప్రాయాన్ని తెలియజేశాను. సభ సజావుగా జరగాలంటే మొదట మాట్లాడి నిష్క్రమించడమే ఉత్తమమని గ్రహించి, తన హావ భావాలతో, పదునైన పదజాలంతో, ఆవేశ పూరితమైన ప్రసంగంతో సభికులను ఉర్రూతలూగించి, రంగారావు గారు వెళ్ళి పోయారు.

తుఫాను తరువాత ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు వాతావరణం చల్ల బడింది. సినీ గ్లామర్ తో సభకొచ్చిన జనం కూడా ఆయనతో పాటు నిష్క్రమించారు. అప్పుడు తాఫీగా విద్యార్థులను ఉద్ధేశించి నాలుగు మాటలు నేను మాట్లాడాను. ఆ అనుభవం నా బుర్రలో పదిలంగా ఉన్నది.

నాటితో మొదలైన మా బంధం అన్నదమ్ముల బంధంగా అవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఎప్పుడు కలిసినా, ఫోన్ లో మాట్లాడినా అదే ఆప్యాయత, అభిమానంతో ‘తమ్ముడూ’ అంటూ పలకరించే వారు. రాష్ట్ర విభజన అంశంపై ఆందోళన జరుగుతున్న రోజుల్లో మద్రాసు నుండి ఫోన్ చేసి అర గంట, గంట మాట్లాడే వారు. తెలుగు ప్రజల ఐక్యత, అభ్యున్నతి, కమ్యూనిస్టు ఉద్యమం ముందున్న పెనుసవాళ్ళు, ఎదుర్కొంటున్న సంక్షోభం, అనుసరిస్తున్న విధానాలపై ముక్కుసూటిగా తన అభిప్రాయాలను నాతో పంచుకొనే వారు.

కా.మాదాల రంగారావు గారితో ఉన్న అనుబంధం, అనుభవాలు తీపి గుర్తులుగా పదిలంగా నాతోనే ఉంటాయి.

నిష్కపటి, తాను నమ్మిన కమ్యూనిస్టు భావజాలం పట్ల అచంచల విశ్వాసంతో జీవించి, మరణించిన కా.మాదాల రంగారావు గారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని, వారి కుమారుడు డా.మాదాల రవి మరియు ఇతర కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను.
కా.మాదాల రంగారావు గారు ధన్యజీవి.
జోహార్! కా.మాదాల రంగారావు

(*టి.లక్ష్మీనారాయణ,తెలుగు నాట పేరున్న రాజకీయ విశ్లేషకుడు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *