బుద్ధా వెంకన్న గారూ, ‘పట్టిసీమ’ లో ప్రాజక్టు ఎక్కడుంది?

(మాకిరెడ్డి పురుషోత్తమ్ రెడ్డి)
చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒక్క ప్రాజెక్టును అయినా పూర్తి చేశారా అని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. అందుకు ప్రతిగా టిడిపి నేత బుద్దావెంకన్న పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి నేడు కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన విషయం కనపడలేదా అంటూ వైసిపిని విమర్శించారు. వాస్తవం ఏమిటి. టిడిపి పార్టీ నేత బుద్ధా వెంకన్నకు ఈ విషయాలో కొంత వివరణ ఇవ్వాలి.
బుద్దా వెంకన్న (టిడిపి నేత) గారూ, పట్టిసీమ ప్రాజెక్టు కాదు అది పోలవరం నుంచి నీటిని తీసుకువచ్చే కాలవ మాత్రమే.
పట్టిసీమ పోలవరం కుడి కాలువ మాత్రమే
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే దాని నీటిని రెండు కాలువలు నుంచి  సరఫరా చేస్తారు.
1. కుడికాలవ కృష్ణా డెల్టాకు నీటిని సరఫరా చేస్తుంది.
2. ఎడమ కాలువ గోదావరి నుంచి విశాఖ జిల్లా వరకు నీటిని సరఫరా చేస్తుంది.
అంటే పొలవరాన్ని పూర్తి చేస్తే ఈ రెండు కాల్వలు ద్వారా గ్రావిటీతో నీటి సరఫరా జరుగుతుంది.
అయతే, జరిగింది ఏమిటి?
వై యస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు పోలవరం ప్రాజెక్టుకు కావలసిన అనుమతులు తీసుకుంటూనే కుడి , ఎడమ కాలువల నిర్మాణం కోసం ప్రయత్నాలు చేసినారు.
దాని ఫలితంగా పోలవరం పూర్తి కాక పోయినా రెండు కాల్వల నిర్మాణం సింహ భాగం పూర్తి అయినది. తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాటి నిర్మాణాలను కొనసాగించారు.
 బాబు అధికారంలోకి వచ్చే నాటికి దాదాపు 3వ వంతు కాల్వలు అందుబాటులో ఉన్నాయి. పోలవరం నిర్మాణం ఆలస్యం కావడంతో అందుబాటులో ఉన్న కాల్వలను ఉపయోగించుకుని తాత్కాలిక ఏర్పాటు చేయడమే పట్టిసీమ.
మిగిలిన కాలవ పనులు పూర్తి చేసి లిప్టు ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసిన తరువాత ఈ పథకం ఉండదు.
తాత్కాలికంగా నీటిని కృష్ణా డెల్టాకు సరఫరా చేసి కొంతమేరకు కృష్ణా డెల్టాకు శ్రీశైలం నుంచి నీటి విడుదలను ఆపి రాయలసీమకు నీరు కొంత విడుదల చేశారు.
ప్రాజెక్టు కాదు ఎందుకంటే…
ప్రాజెక్టు అంటే బరాజ్ , డ్యాం నిర్మాణం జరగాలి. ఈవిషయాన్ని సుప్రీంకోర్టు కూడా ఖచ్చితంగా చెప్పింది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం కేవలం పోలవరం కుడి కాల్వకు నీరు ఎత్తిపోతల ద్వారా సరఫరా చేసే పథకం మాత్రమే. అదికూడా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి వరకు మాత్రమే.
తర్వాత ఈ పథకం రద్దు అవుతుంది. కాబట్టి పట్టిసీమ ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రాజెక్టు అనడం కన్నా పట్టిసీమ పథకం అనడం సముచితంగా ఉంటుంది.