పొద్దున్నే కురిసిన వాన
చాలా కాలానికి
ఆప్యాయంగా పలకరించిన మిత్రుడిలా
మండుటెండలో ఇంటికొచ్చిన అతిథికి
అమ్మ ఇచ్చే చల్లని మజ్జిగ లా
పొద్దున్నే కురిసిన వాన
గొప్ప సాంత్వన కలిగించింది!
పొయ్యిమీది పెనంలా ఈ ఎండలకు
మాడిపోయిన జీవులకు
చిరుజల్లుల పలకరింపు
ఉపశమనం ఇచ్చింది!
పుడమి తనలోని ఉక్కను తీసేసుకోవడానికి
పడిన చినుకులను
ఆత్రంగా చప్పరించేస్తోంది!
పొద్దున్నే కురిసిన వానతో
ప్రకృతి చిరునగవులు చిందిస్తోంది!
పక్షులు కొత్త రాగాలు శృతి చేసుకుంటున్నాయి!
ఎగసిపడుతున్న మట్టి వాసనను ఆగ్రానిస్తూ
పురుగులు జావళీలు ఆడుతున్నాయి!
సెలయేర్లు తమ నడకను సవరించుకుంటున్నాయి!
మధ్య మధ్యలో ఉరిమే ఉరుములకు
గువ్వలు రెక్కల్లో తలదాచుకుంటున్నాయి!
పొద్దున్నే కురిసిన వాన
నయనానందమే కాదు
హృదయానందము కూడా!!
డా.గూటం స్వామి
(9441092870)