జాతీయ న్యాయసేవల దినోత్సవం సందర్భంగా నేడు (9 నవంబర్ 2021) సంగారెడ్డిలోని “గ్రామీణ న్యాయ పీఠం” లో భూమి హక్కుల పరీక్షా కేంద్రం ప్రారంభమైంది.
సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణానికి ఎదురుగా ఉన్న గ్రామీణ న్యాయ పీఠం కార్యాలయం లో నేడు భూహక్కుల పరీక్షా కేంద్రం ఏర్పాటు అయింది. అన్ని పనిదినాలలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఈ కార్యాలయం లో భూహక్కుల పరీక్ష నిర్వహిస్తారు. ఎవరైనా రైతులు తమ వ్యవసాయ భూమికి సంబంధించి సర్వే నంబర్ కు వంద రూపాయలు చెల్లించి ఈ హక్కుల పరీక్ష చేయించు కోవచ్చు. భూమికి భూసార పరీక్షలు, మనకు ఆరోగ్య పరీక్షలు లాగా భూమికి ఏమైనా చిక్కులు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసమే “భూహక్కుల పరీక్ష”. వ్యవసాయ భూమి కలిగిన ప్రతివారు ఒక్కసారైనా ఈ భూహక్కుల పరీక్ష చేయించుకుంటే తమ భూహక్కులను కాపాడుకోవచ్చు. భూసమస్యలనుండి బయటపడే మార్గం తెలుస్తుంది.
భూమి హక్కుల చిక్కులు తెలంగాణ పల్లె ప్రజలు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య. భూమికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు. సమస్య ఎలాంటిది, చట్టప్రకారం సమస్యకు పరిస్కార మార్గం ఏంటి, ఎవరిని సంప్రదించాలి లాంటి అంశాలపై రైతులకు అవగాహన లేదు. చాలామంది సమస్య ముదిరేదాకా తమకు ఆ భూమి సమస్య ఉన్నట్లుగానే గుర్తించలేక పోతున్నారు. సమస్యను గుర్తించడం, ఆ సమస్య పరిస్కారినికి చట్టాలు సూచిస్తున్న మార్గాలు తెలుసుకోవడం ఆ సమస్య పరిస్కారినికి కీలకం. అందుకే రైతులకు ఈ అంశంపై సాయం చెయ్యడం కోసం గ్రామీణ న్యాయ పీఠం సంగారెడ్డి కార్యాలయంలో నేడు జాతీయ న్యాయసేవల దినోత్సవం సందర్భంగా “భూహక్కుల పరీక్షా కేంద్రం” ప్రారంబించాము.
న్యాయాన్ని గ్రామాలకు దగ్గర చెయ్యాలని, గ్రామస్థాయిలోనే న్యాయం అందించే గ్రామన్యాయాలయాలు లాంటి వ్యవస్థలని పటిష్టం చెయ్యాలని, మొత్తంగా గ్రామీణులు సత్వర న్యాయం పొందేలా కృషి చెయ్యాలనే లక్ష్యంతో సంగారెడ్డి కేంద్రంగా గత సంవత్సరం “గ్రామీణ న్యాయ పీఠం” ప్రారంభమైంది. భూమి, వ్యవసాయం నుండి మొదలుకుని గ్రామాలలోని ప్రజానీకానికి అవసరమైన చట్టాలపై శిక్షణ, న్యాయసలహాలు, న్యాయసహాయం అందించడం కోసం గ్రామీణ న్యాయ పీఠం కృషి చేస్తుంది.
పి. నిరూప్ సుప్రీమ్ కోర్టు న్యాయవాది వ్యవస్థాపకులు & ప్రధాన సలహాదారు గ్రామీణ న్యాయ పీఠం
ఎం సునీల్ కుమార్ (భూమి సునీల్) భూచట్టాల నిపుణులు & న్యాయవాది సహ వ్యవస్థాపకులు & సలహాదారు గ్రామీణ న్యాయ పీఠం
మరిన్ని వివరాలకు: ప్రవీణ్, కోర్డినేటర్, గ్రామీణ న్యాయ పీఠం; Cell: 9912104307