సమ్మర్ లో ఇవి తప్ప ఏవంటే అవి తాగొద్దండి

– జన విజ్ఞాన వేదిక

తెలంగాణలో ఎండలు పెరుగుతూ ఉన్నాయి. అవసరమయితే తప్ప బయటకు వెళ్ళొద్దని అధికారులు చెప్పిన, ఆచరణలో అది సాధ్యం కాదు. ఎదో ఒక అవసరం మనల్ని ఎండల్లో బయటకు తరుముతుంది. అపుడు ఎండల్లో తిరగాల్సి వస్తుంది. కాకపోతే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ద్రవాలు తీసుకోవాలి. ద్రవా లంటే ఖరీదయిన కూల్ డ్రింక్స్ కాదు సుమా. మన ఇంట్లో చవకగా దొరికే ద్రవాలు. షుగర్ ఎక్కువగా వుండే కూల్ డ్రింక్స్ వల్ల అప్పటికి చల్లగా ఉంటుంది గాని, హాని ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటి జోలికి వెళ్లకుండా ఇంటి పానీయాలు సేవిస్తే చాలనని ‘జన విజ్ఞాన వేదిక’ శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. ఈ సమ్మర్ లొనే కాదు ఏ సమ్మర్ లో నైనా వాటిని సేవించాలి అని వారు చెబుతున్నారు.

వారేమి చెబుతున్నారో చదవండి:

నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, షర్బత్, రాగి మాల్టు, అంబలి లాంటి ఇతర సహజపానీయాలు ఆరోగ్యానికి మంచివి. కానీ నేటితరం యువత కూల్ డ్రింక్స్ కు అలవాటుపడి అనారోగ్యం పాలవుతోంది… కనుక కూల్ డ్రింక్స్ తాగే అలవాటు మానేయమని జనవిజ్ఞానవేదిక విజ్ఞప్తి చేస్తున్నది…

• ప్రపంచ మొత్తంలో ఒక సంవత్సరానికి రెండు కోట్ల టన్నుల రసాయనాలను కూల్డ్రింక్స్ రూపంలో ప్రజలు తాగుతున్నారు.

ప్రతి లీటరు కూల్డ్రింక్ లో 0.0180 మి.గ్రా క్రిమి సంహారక మందులు ఉన్నాయని మన దేశంలోని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ (CSE) అనే సంస్థ బయట పెట్టింది. అంతేగాక సిఎస్ఇ నిర్ధారించిన ప్రకారం చూస్తే 0.0005 మి.గ్రా. మాత్రమే క్రి. సం. మందులు ఉండాలి. అంటే దాదాపు 36 రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

కూల్డ్రింక్స్ అమ్మకాలు పెంచుకొనేందుకు కంపెనీలు సినిమా తారలతో వ్యాపార ప్రకటనలు ఇప్పిస్తూ, అసత్య ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. దీనికి వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, పర్యావరణ వేత్తలు, మేధావులు కూల్డ్రింక్స్ ను నిషేధించాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఆందోళన చేపట్టారు. దీని ఫలితంగా కేరళ ప్రభుత్వం తమ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుగా కూల్ డ్రింక్స్ ను నిషేధించింది.

పంజాబ్ విధానసభలోని క్యాంటిన్లో, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా వంటి పలురాష్ట్రాలు కూల్ డ్రింక్స్ ను విద్యాసంస్థలలో నిషేధించాయి.

కూల్డ్రింక్స్ తాగడం వల్ల నష్టాలు :

1. వీటిలో పోషక విలువలు ఉండవు.

2. వీటిని తాగడంవల్ల లాభమేమీ లేదు. పైగా వీటిలో ఉండే అదనపు క్యాలరీలు స్థూలకాయానికి దారితీస్తాయి.

3. దీర్ఘకాలం తాగితే మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతుంది.

4. వీటిలోని ఫ్రక్టోజ్ వల్ల అధిక రక్తపోటు వస్తుంది.

5. కూల్డ్రింక్స్ వల్ల ఆస్టియో ఫ్లోరోసిస్ వచ్చే అవకాశం ఉంది.

6. పంటిపై ఉండే ఎనామిల్ పొర కరిగి పిప్పిపళ్లు ఏర్పడతాయి.

7. కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

8. మెటబాలిక్ సిండ్రోం సంభవిస్తుంది.

9. కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్ ఎదలో మంట కలుగజేస్తుంది.

10. లివర్ సిరోసిస్ మార్పులు జరిగే అవకాశం ఉంది.

11. జీర్ణవ్యవస్థలో సమస్యలు ఉత్పన్నమవుతాయి.

12. కూల్ డ్రింక్స్ లో ఉండే కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫారిక్ ఆమ్లాలు శరీర కణాలలోని ఆక్సిజన్ నిల్వలను తగ్గించడం ద్వారా క్యాన్సర్కు దారితీయచ్చు.

13. కూల్డ్రింక్స్ వాడే ఆస్పర్టేమ్ (శకారిన్) అనే కృత్రిమ తీపి పదార్థం చెక్కరకంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. అది క్యాన్సర్కు దారితీయవచ్చు.

14. వీటిలో కలిపే సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ రసాయనం కణాల్లోని డిఎన్ఎపై ప్రభావం చూపడం ద్వారా కణ వ్యవస్థకు నష్టం కలుగుతుంది.

15. కూల్ డ్రింక్స్ లోని హానికరమైన స్థాయిలో వున్న పురుగు మందుల అవశేషాల వల్ల దుష్పలితాలు అనేకం.

16. ఇవికాక కేరళలోని ప్లాచిమాడ ప్రాంతంలోనూ, రాజస్థాన్లోని కాలా-డేరా ప్రాంతంలోను కోకోకోలా ప్లాంట్స్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్లాంట్స్ నుంచి వచ్చే వ్యర్థపదార్థాల విసర్జనవల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాల
పాలౌతున్నారు.

సహజ పానీయాలనే తాగుదాం :

నిమ్మరసం : మంచినీటిలో నిమ్మకాయ పిండి, చక్కెర, ఉప్పు కలుపుకుని నిమ్మరసం (షర్బత్) చేసుకొని త్రాగవచ్చు. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చెరకురసం : ముప్పావు లీటరు చెరకురసం గిన్నెలో వడపోసుకుని 3 చెంచాల నిమ్మరసం కలుపుకొని, ఆతర్వాత కొద్దిగా మిరియాలపొడి కలుపుకుని చల్లబరచుకుని తాగొచ్చు.

మసాల మజ్జిగ : ఒక వంతు పెరుగు, నాలుగు వంతులు మంచినీరు కలుపుకోవాలి. సన్నగా తరిగిన ఒక మిర్చి కొద్దిగా అల్లం తురుము తాజా కరివేపాకులు, కొంచెం నిమ్మరసం, తగినంత ఉప్పు కలుపుకుంటే రుచికరమైన ఆరోగ్యకరమైన మసాల మజ్జిగ రెడీ ఔతుంది.
దీనిలో పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం, రైబో ఫేవిన్, విటమిన్ బి-12 పుష్కలంగా లభిస్తాయి.

కొబ్బరి నీళ్లు : లేతకొబ్బరి నీళ్లు సహజ తియ్యదనం, రుచి కల్గిఉండి చల్లదనాన్నిచ్చి, జీర్ణవ్యవస్థకు, మూత్ర వ్యవస్థకు మేలు చేస్తుంది.

గంజితో షర్బత్ : అన్నం వండేటప్పుడు వార్చినాక చిక్కని గంజి వస్తుంది.

దానిలో కొంచెం ఉప్పు వేసుకొని మజ్జిగ కలుపుకుని తాగితే

ఎండాకాలం వడదెబ్బ సోకకుండా రక్షిస్తుంది.

రాగి అంబలి : 100 గ్రాముల రాగుల పిండిని కొద్దిపాటి నీళ్లలో

మెత్తని పేస్టులా (గడ్డలు లేకుండా) చేసుకోవాలి. దీనిని సుమారుగా అరలీటరు నుండి లీటరు మరిగే నీళ్లతో కలిపి సన్నని మంటలో 3 నుంచి 5 నిమిషాల సేపు కలుపుతూ ఉడికించాలి. చల్లారిన తర్వాత ఉప్పు లేదా బెల్లం (ఇష్టాన్నిబట్టి) మజ్జిగ కలుపుకోవాలి. వేసవితాపాన్ని చల్లార్చే ఆరోగ్యకరమైన రాగి అంబలి రెడీ.

వేసవి పానకం : పావుకేజి తురిమిన బెల్లం గిన్నెలో తీసుకుని ఒకటిన్నర

లీటరు మంచినీరు పోసుకుని బాగా కలిపి, బెల్లం కరిగే వరకూ ఉంచాలి. 25 గ్రాముల మిరియాలు, ఆరు యాలకులు పొడిగా చేసుకుని ఇందులో కలుపుకోవాలి. వేసవిలో చలవనిచ్చే ఆరోగ్యకరమైన పానకం రెడీ.

ఇవే కాకుండా పుచ్చకాయ, నారింజ, బొప్పాయి, దానిమ్మ, అనాస, ద్రాక్ష, సపోటా వంటి పండ్లరసాలు కూల్డ్రింక్స్ కంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *