Rural Street Food
(భూమన్)
మదనపల్లె నుంచి తిరుపతి తిరుగు ప్రయాణంలో పీలేరు మీదుగా పోయి రాజమ్మ పులి బొంగరాలు తినటమా, లేదా చాన్నాళ్ళనుంచి ఉవ్విళ్ళూరుతున్న ముళబాగల్ దోసె తినటమా అన్న సందిగ్ధంలో రాజమ్మ పులుంటలు చాన్నాళ్ళుగా తింటున్నాం కదా, అటు ముళబాగల్ వైపు తిప్పండని నా భార్య అంటే కారు ముళబాగల్ వైపు బయలుదేర దీసినాను.
అనుకుంటున్నాం, బెంగుళూరు పోతున్నాం, వస్తున్నాం ఎన్నడూ కుదిరింది కాదు. ముళబాగల్ దోసె తినాలనే ఆరాటం, పట్టుదల కొనసాగుతునే ఉంది.
ఎన్ని దోసెలు, ప్రొద్దుటూరు దేవళం దోసెలు, కారం దోసెలు, పంచెకట్టు దోసెలు, నీరు దోసెలు; అట్లా రకరకాల దోసెలు రుచి చూచినాము. కానీ, ఇంతమటుకు ముళబాగల్ ముచ్చటకు పోవడం నాకే ఒకింత ఆశ్చర్యంగా ఉంది. ఆ సమయం రానే వచ్చింది.
ముళబాగల్ ప్రయాణంలో దోసెల గురించే చర్చ. క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలోనే ఉడిపిలో దోసె పుట్టింది. తరువాత మద్రాసు, మధురైలలో ప్రసిద్ధమై విపరీతమైన ప్రచారంలోకి వచ్చింది. సమకాలీన సమాజంలో రకరకాల పేర్లతో దోసె విరాజిల్లుతుండడం మనకు తెలిసిందే.
ముళబాగల్ చేరుకుని ప్రసాద్ హోటల్ ముళబాగల్ దోసె సెంటరుకు చేరుకుంటే మూసి ఉంది. ఫర్లాంగు దూరంలో కారు పార్కు చేసి ఆ సందు చేరుకోవడమే గగనమయితే, మూతేసిన కొట్టును చూసి చాలా దిగాలుపడిపోయినాను.
అప్పటికే మబ్బుపడుతున్నది. తిరుగు ప్రయాణం ఉంది. ఆ హోటల్ ఓనర్‌కు ఫోన్ చేస్తే, ఇంకా అరగంటకు తెరుస్తామంటే, కుదరదని వెనక్కి వచ్చి కూరగాయల మార్కెట్ వాళ్ళనడిగితే, అదిగో అల్లదిగో అక్కడొకటి ఉందని, మరొకరు మరొక చోట ఉందని దారి చూపితే ఉసురోమని మంచి హోటల్ మిస్ అవుతున్నామనే వ్యధతో ఉన్నాం.
మేం పార్కు చేసిన దగ్గరలోనే లక్ష్మి టిఫిన్ సెంటర్ అనే బోర్డు చూసి, ఏదయితేనేం ముళబాగల్ దోసె తినాలనేపట్టుదలతో కూర్చున్నాం.
మదనపల్లెలో మేం ఇష్టంగా తినే మసాలా దోసె అంగడి మాదిరిగానే ఉంది. సీటింగ్ అరేంజ్ మెంట్స్ కూడా సేమ్ టు సేమ్. అక్కడా ఆర్యవైశ్యులే, ఇక్కడా వారే. చాలా మర్యాదగా పలకరించి, రెండు మసాల దోసె అని అరిచి చెప్పినాడు. ఏందిరా సామి, ముళబాగల్ దోసె అంటే మసాల దోసె అంటున్నాడే అనుకున్నాము.
నేతి వాసనతో ఘమఘుమ లాడుతూ, కింద పేపరు, పైన అరిటాకు పైన సర్వ్ చేసినాడు. ముత్యపు చిప్ప మాదిరిగా చాలా అందంగా ఉంది. పైన మెత్తగా , లోపల బాగా రోస్ట్ అయిఉంది. తాకితే నెయ్యి, నోట్లో వేసుకోగానే ఆ మధురమైన రుచికి అదిరిపోయినాము.
తింటూ తింటూ లోపలకు వెళ్ళి చూస్తే, ఈ పెనమే వేరుగా ఉంది. మామూలుగా వేసే దోసెల పెనంలాగా లేదిది. గుండ్రటి పెనంలో , సన్నటి మంటమీద నిదానంగా కాల్చి ఇవ్వడం వల్లే ఆ టేస్ట్. ఆ టేస్ఠ్‌కు అదిరిపోయి, ఇద్దరం మరో రెండు దోసెలు ఆరగించి, కాఫీ కోసం పక్కంగడికి పోయి, అతణ్ణి వాకబు చేసి ప్రసాద్ దోసె మిస్ అయినామంటే, భలే వారు సార్ మీరు తిన్న ఈ లక్ష్మి టిఫిన్ సెంటరే ఒరిజినల్.
మీరున్నది సరైన చోటంటే ఎంత పొంగిపోయినామో చెప్పలేం. అబ్బ. మొత్తానికి తినవలసిన చోటే తినేసినామని, ఆ పాత ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉండే లక్ష్మీ సెంటరును కారులోంచే చూసి వెనుదిరిగినాము.
వెనుదిరిగి హైవే ఎక్కినాక చాలా దిగులేసింది, ఆ సెంటర్‌పైన సరయిన అవగాహన లేక ఫొటోలు తీయలేకపోయినామేనని. (అందుకే బయటి వారి ఫోటోలు వాడాల్సి వచ్చింది. గొప్ప వెలితితో ఇల్లు చేరుకుని, ఆ రాత్రి ఏ మాత్రం గడిబిడ చేయని ఆ ముళబాగల్ దోసె గురించే రోజంతా అనుకుని, ఇంకోమారు తీరుబాటుగా పోయిరావాలని అనుకున్నాము.
ఏభై ఏళ్ళ తరువాత ముళబాగల్‌కు మరొక్క మారు పోయి, అద్వితీయమైన, అమోఘమైన దోసె తినొచ్చినందుకు నన్ను నేనే అభినందించుకుంటూ, జీవితంలో మీరు ఒక్కసారైనా దీని రుచి చూడండని మనవి చేస్తున్నా. ఒక్క మారు చూస్తే, ఆ తరువాత ఎన్ని మార్లైనా మీ ఇష్టం.
(భూమన్, రచయిత, ట్రెక్కర్, చరిత్ర పరిశోధకుడు. తిరుపతి)