*మోడీ సర్కార్ పై యుద్ధం కేసీఆర్ డ్రామా*
*బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే కెసిఆర్ దేశ పర్యటన: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు.
***
బిజెపి యేతర ఫ్రంట్ ను కూడకడుతానని బయలుదేరిన కేసీఆర్ ఇప్పట్లో ఏ ఫ్రంటు లేదని ప్రకటన చేయడాన్ని పరిశీలిస్తే ఆయన మానసిక స్థితి గందరగోళంగా ఉన్నట్లు అర్థమవుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ముదిగొండ మండలం లో శనివారం ఏడో రోజుకు చేరుకుంది. వంద కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసుకున్న సందర్భంగా పెద్దమండవ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ పై యుద్ధం అంటూ దేశ పర్యటన చేసిన కెసిఆర్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను కలిసిన తర్వాత ఏ ఫ్రంటు లేదని ప్రకటించడం వెనుక కేసీఆర్ రాజకీయ డ్రామా దాగి ఉందని విమర్శించారు. మత ఛాందసవాదులకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉన్న లౌకిక వాదుల్లో విభజన తీసుకువచ్చి కేంద్రంలో
బిజెపి ని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కెసిఆర్ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. బిజెపిపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఢిల్లీలో సుబ్రహ్మణ్యస్వామిని ఎందుకు కలిశారు అని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య జరిగిన విషయాలను ఇప్పటి వరకు బహిర్గతం చేయకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏఫ్రంట్ పెట్టడని, బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేసి, మోడీని అధికారంలోకి తీసుకురావడానికి పరోక్షంగా ఉపయోగపడే ఫ్రంట్ పెడతాడని విమర్శించారు. దేశంలో బిజెపి వ్యతిరేక శక్తులైన యూపీఏ పక్షాలను చీల్చి మోడీ ని మరోమారు ప్రధాని చేయడం కోసమే బంగారు భారత్ నిర్మాణం పేరిట కెసిఆర్ ఆడుతున్న నాటకాలను గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తాను వంద కిలోమీటర్ల దూరం చేపట్టిన పాదయాత్రలో వేల సమస్యలు వెలుగుచూశాయ ని, ఇదే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వెలుగులోకి వస్తున్న అనేక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుక గా తన గళాన్ని వినిపించి టిఆర్ఎస్ సర్కార్ ను నిలదీస్తాం అని తెలిపారు.
*ప్రజాధనం వృధా చేస్తున్న కేసీఆర్: చెరుకు సుధాకర్*
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పర్యటన పేరిట తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడని తెలంగాణ ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు చెరుకు సుధాకర్ ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చి పాదయాత్రకు ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామం లో ఆయన సంఘీభావం ప్రకటించారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న టిఆర్ఎస్ సర్కార్ ను ప్రజా క్షేత్రంలో ఎండగట్టడానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపడుతున్న పాదయాత్ర టిఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ పరిపాలన నాన్ సీరియస్ గా ఉంది అనడానికి ఇటీవల వెలుగులోకి వచ్చిన మంత్రి శ్రీనివాస్ హత్య ఘటన నిలువెత్తు నిదర్శననమని విమర్శించారు. టిఆర్ఎస్ సర్కార్ ది ప్రజామోద ప్రభుత్వం అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ పాదయాత్ర లు చేయించాలని సవాల్ విసిరారు.
*భట్టిది ప్రజాయుద్ధ యాత్ర: కత్తి వెంకటస్వామి*
దేశ పర్యటన పై కెసిఆర్ విహారయాత్ర చేస్తుంటే ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజా యుద్ధ యాత్ర చేస్తున్నారని ఆలిండియా ఓబీసీ సెల్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కత్తి వెంకటస్వామి అన్నారు. నియంత పాలన చేస్తున్న టిఆర్ఎస్ సర్కార్ పతనానికి భట్టి విక్రమార్క పాదయాత్ర నాంది పలుకుతుందని అన్నారు.