రుచి+శుచి+మర్యాద = రేణిగుంట ఆప్పం

(భూమన్*)

స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారుండరు ఈ రోజుల్లో. దాదాపు ప్రతిపట్టణంలో, ప్రతి నగరంలోఎక్కెడక్కడ ఏ ఏ రకాల   స్ట్రీట్ ఫుడ్ ఉందో నని వెదికి వెదికి పట్టుకునే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. మేము కూడా అటు చెన్నై పోయినా, బెంగుళూరు పోయినా, హైదరాబాద్ పోయినా, లేదా ఏ ఇతర పట్టణానికి పోయినా మాంచి స్ట్రీట్ ఫుడ్ దొరికే ప్రదేశం  వెదకడమనేది   ఒక అలవాటు అయిపోయింది.

మా తిరుపతికి చుట్టుపక్కల ఎక్కడయినా మంచి అల్పాహారం కాని, స్నాక్స్ గాని భోజనం గాని దొరుకుతుందని తెలిస్తే అటుపరుగుతీయడం చేస్తుంటాం.  అది 30, 40 నలభై కిలోమీటర్లు దూరాన ఉన్న నలభై  రూపాయలు చేసే అల్పాహారం కోసం నేను మాశ్రీమతి ప్రొఫెసర్ కుసుమకుమారి ప్రయాణం చేసిన రోజులెన్నోఉన్నాయి.

మామండూరు దగ్గిర బాలాజీ టిఫిన్ సెంటర్ గాని, చిన్నగొట్టిగల్లు దగ్గిర రాజమ్మ టిఫిన్ సెంటర్ గాని, ఇటు పుత్తూరు దగ్గిర కొండమ్మ టిఫిన్ సెంటర్ గానీ, అలాగే కాళహస్తి వైపున అన్నపూర్ణమ్మ టిఫిన్ సెంటర్ గాని ఇలా మేం పరుగు పరుగున వెదికి పట్టుకున్నవే.

ఇవన్నీ మమ్మల్ని స్ట్రీట్ ఫుడ్ కు దగ్గిర చేశాయి. అన్నింటికి మించి తిరుపతి సమీపంలోని రేణిగుంటలో ఉన్న ‘అమ్మ ఆప్పం’ స్ట్రీట్ ఫుడ్ మమ్మల్ని విపరీతంగా ఆకర్షించింది. దాదాపు 30యేళ్ల క్రితం రేణిగుంట కాళహస్తి మార్గంలొ  ఒక కార్నర్ లో దొరికే ఈ అప్పం  చాలా  సుప్రసిద్ధమయింది. దానిని మిరియాల జయంతమ్మ అనే మహిళ, పిల్లలు, దివాకర్, సురేష్, గోపీకృష్ణ తో కలసి నిర్వహిస్తూ ఉంది.

 

అమ్మ ఆప్పం నిర్వాహకులు

 

ఉదయం ఆరున్నరకు తెరిస్తే మధ్యాహ్నం 12 దాకా ఎడతెరిపి లేని జనం తో కిటకిట లాడుతూ ఉంటుంది. ఒక్కొక్కపుడు ఆప్పం తినడానికి వచ్చి,  తమ  వంతు దాకా ఎదురుచూసే టైం లేక, ఆప్పం తినలేక నిరాశతో వెనక్కి వెళ్లుంటారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ, సాదా అప్పం, కారం అప్పం, కరివేప ఆప్పం, ఎగ్ ఆప్పం ఉంటాయి.  వీటితో పాటు పాయ, కోడి కూర, నాటు కోడి కూర, వేట మాంసం కూర, నెత్తురు కూర … ఇలా ఎన్నో రకరకాలుంటాయి. మీరు నమ్మరు గాని, వాటిని రుచిచూడాలని అంగలార్చే వారెందరో ఉన్నారు. అన్నింటికి విపరీతమయిన డిమాండ్.

 

సాదా అప్పం

ఎయిర్ పోర్ట్ కు పోయే రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు  తప్పని రిగా అమ్మ ఆప్పం రుచి చూడకుండా ముందుకు కదల్లేరు.   ఆ దారిన పోయే వాళ్లంతా ఈ అప్పం రుచి చూడకుండా ఉండలేరు. ఈ ప్రాంతాన అంతగా పరిచయంలేని ఈ ఆప్పం ఎంతగా ప్రసిద్ధి చెందిందటే,  చివరకు ఈ చిన్న ఆప్పం సెంటర్ వల్ల అక్కడ ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతూ ఉంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడి పోలీసులు రంగంలోకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కూడా నేను చూశాను.

 

నిరంతరం పొయ్యి వెలుగుతూనే ఉంటుంది

 

దివాకర్ గాని, సురేష్ గాని, గోపీ కృష్ణ గాని, జయంతమ్మ గాని, వచ్చిన వాళ్లందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఆదరంగా ఆహ్వానించి, ఆప్పం అందించడమనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఇలాంటి ఆదరాభిమానాలు టిఫిన్ సెంటర్లలో చూల్లేం. జయంతమ్మ ఆప్పం రుచిని ఈ ఆదరాభిమానాలు ఇనుమడింపచేశాయి. అందుకే ఈ అప్పం సెంటర్ ఇంకా పురోగమించాలని మనసారా ఆశించే వాళ్లలో నేనొకణ్ణి.

ఎగ్ ఆప్పం రెడీ!

 

ఇక్కడ అన్నింటికంటే హైలైట్ ‘పాయ ఆప్సం’. ఇది ప్రారంభమయ్యేందుకు నేనే కారణమనాలి.    దాదాపు నాలుగేళ్ల క్రితం నేను ఇక్కడి వచ్చాను. అపుడు ఆప్పం తింటూ దివాకర్ తో మాట్లాడుతూ ‘ఆప్పం పాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ప్రారంభించు,’ అని సలహా ఇచ్చాను. దివాకర్ నామాట ప్రకారం ఈ ఐటెం మొదలుపెట్టాడు. అది ఇన్ స్టంట్ హిట్.

ఎపుడూ తరగని క్యూ….

పాయపెట్లాక చాలా మంది ఇష్టపడి ఆప్పం తీసుకుంటున్నారని దివాకర్ ఇపుడు చెప్పడం సంతోషదాయకం. ఇక్కడ ఆప్పం పరిశుభ్రతకు కూడా మారుపేరు. అదే విధంగా ఆప్పం తయారీలో వాడే మేలి  రకం దినుసులు కూడా జయంతమ్మ ఆప్పం పాపులర్ అయ్యేందుకు ఒక కారణం అని నాకు అనిపిస్తూఉంది. ఇక్కడంతా ట్రాన్స్ పరెంటుగా ఉంటుంది. రుచి, శుచి, నిజాయితి, ఆదరాభిమానాలు అన్నీకలగలిశాయి. అందుకే ఇక్కడికొచ్చి ఆప్పం తినడం మహద్బాగ్యంగా భావిస్తూ ఉంటాను.

 

ట్రిప్పులో ఆరు అప్పాలు కట్టెల పొయ్యి మీదే తయారవుతాయి

 

మరొక విశేషమేమంటే,ఇక్కడ కట్టెల పొయ్యి మీదే వంటలు చేయడం. గత 30 సంవత్సరాలలో ఏన్నో పరిణామాలొచ్చినా కట్టెల పొయ్యినే వాడుతున్నారు. అందుకే ఆప్పం మంచి రుచిగా ఉంటుందనేది ఒక అభిప్రాయం. మూడు పొయ్యిలతో మొదలయి ఆరు పొయ్యిల స్థాయికి ఎదిగింది సెంటర్. ఇది ప్రధానంగా ఆప్పం సెంటరే అయినా ఇడ్లీ,వడ, దోసే కూడా దొరుకుతాయి. ఇవెందుకంటే, ఆప్పం కోసం ఎదరు చూసి ఎంతకు అవకాశం రాకపోవడంతో, ఏదో ఒకటి తినేద్దామనుకునే వాళ్లకోసం ఇవి. అక్కడ ఎంత రద్దీ ఉంటుందంటే…రాబోయే ఆప్పం ఎవరిప్లేట్లో పడుతుందో తెలియని పరిస్థితి. ఏదయినా అమ్మ ఆప్పం ఈ ప్రాంతంలో ఆయస్కాంతంలాగా ఆకర్షిస్తూవస్తున్నది.

చిత్తూరు జిల్లాలో ఈ ఒక్క ఆప్పం సెంటర్ లో తప్ప  మరెక్కడ ఆప్పం  దొరకదు. కొన్ని హోటళ్లలో ఒకటి రెండు చోట్ల ప్రయత్నాలు జరిగాయి. అవి ఫలించలేదు. రేణిగుంట ఆప్పంకు దీటుగా ఎక్కడ ఆప్పం తయారు కాలేదు.

 

రేణిగుంట ట్రేడ్ మార్క్ ఆప్పం

 

ఎవరైనా విదేశాలనుంచి వచ్చినపుడు గాని, నాకు తెలిసిన స్నేహితులు గాని, చుట్టుపక్కల ఉండే పరిచయస్తులకు గాని, ఈ ఆప్పం సెంటర్ ను పరిచయడం అనేది నాకు అలవాటయిపోయింది. ఆహారం విషయం మనం చాలా శ్రద్ధాసక్తులు తీసుకుంటాం. ఇక్కడ వీల్లు చేసే ఆప్పం, పరిశుభ్రతం నియమాలు మనల్ని ఆకట్టుకుంటాయి.

విరామం లేకుండా తయారవుతున్న ఆప్పాలు, ఈ దృశ్యమే కనువిందు చేస్తుంది.

దివాకర్ కు ఈ చోటు మరొక సానుకూలమయిన చోటు దొరికితే   ఈ ఆప్పం విశేష ప్రాచుర్యం పొందుతుందని నా నమ్మకం.  తిరుపతికి వచ్చేయ్, అక్కడ ఎక్కడో ఒక చోట మంచి సెంటర్ వెదుకుదాం అని చాలా సార్లు నేను దివాకర్ కి చెప్పాను.

 

యూనివర్శిటీ రోడ్డులోనో, తుమ్మలకుంట రోడ్డులోనో, లేదా హైవేలోనే పెడితే బ్రహ్మండంగా నడుస్తుంది. దినదినాభివృద్ధి చెందుతుంది. మంచి అల్పాహారం అందిరికి అందచేసిన  వాడివవుతావు అని చెప్పాను. ఎందుకంటే, ఆప్పం అనేది ఎక్కడో కేరళలో బాగా పాపులర్ , తెలుగు ప్రాంతాల్లో ఇదెవరికీ తెలియదు. ముఖ్యంగా రాయలసీమలో పరిచయం లేని వంటకం. అందువల్ల తిరుపతి వంటి పెద్ద సెంటర్ లో ఉంటే జయంతమ్మ ఆప్పం మరింత ప్రాచుర్యంలోకి వస్తుందని నేను సలహా ఇచ్చాను.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న ప్రొఫెసర్ కుసుమకుమారిఅదీ సంగతి. మీరు కూడా తిరుపతికి వచ్చేపుడో పోయేటపుడో రేణిగుంటలో దిగండి. అమ్మ ఆప్పం సెంటర్ సందర్శించండి. అక్కడి ఆప్పం రుచి  చూడండి. అపుడు గాని రేణిగుంట ఆప్పం గొప్పదనం అనుభవంలోకి రాదు. ఒక సారి ఈ ఆప్పం రుచిచూస్తే , ఇక ఎపుడు  ఇటువైపు వచ్చినా అమ్మ ఆప్పం సెంటర్ ఒక దర్శనీయ స్థలమయిపోతుందంటే ఆశ్చర్యం కాదు.

భూమన్

(*భూమన్ చరిత్ర పరిశోధకుడు, ప్రకృతి ప్రేమికుడు, ట్రెకర్, తిరుపతి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *