కుల గణనతోనే బీసీలకు న్యాయం

కుల జన గణన చేయలేని పాలకులు రాజీనామా చేయాలి
– ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్

 

కుల జన గణన (caste census) చేయలేని కేంద్ర పాలకులు వెంటనే రాజీనామా చేయాలని ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇటీవల పాలకుర్తి మండల కేంద్రంలోని గౌడ సంఘం కార్యాలయంలో కుల గణన పై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షులు పులి గణేష్ అధ్యక్షతన జరగగా ముఖ్యఅతిథిగా ప్రభంజన్ యాదవ్ పాల్గొని మాట్లాడారు.

సమావేశంలో మాట్లాడుతున్న ప్రొ. ప్రభంజన్ యాదవ్

దేశంలో మొత్తం కుల గణన జరగాలని, ఎవరి వాటా ఎంతో తేలాలని ఆయన అన్నారు. కుల గణన విషయంలో కాంగ్రెస్, బిజెపి పార్టీలు తోడుదొంగ లేనని విమర్శించారు. కులం అనేది సామాజిక వాస్తవం అని, కులంలో పుడతాం పార్టీల కోసం ప్రాణాలు ఇస్తాం అంటూ బతుకులు వెళ్లదీస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేందుకు సిద్ధంగా లేదని, కుంటి సాకులు చెబుతూ కుల గణన చేయడం లేదని తెలిపారు.

కుల గణన జరిగితే విద్య, ఉపాధి, రిజర్వేషన్లలో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకటి రెండు శాతంగా ఉన్న వారే దేశాన్ని శాసిస్తున్నారని, ఉత్పత్తి కులాలపై పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ ఉద్యమస్ఫూర్తితో కుల గణనపై మహోద్యమం సృష్టించాలని ఆయన పిలుపునిచ్చారు. పాలకుర్తి ప్రాంతం రాచరికానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఉన్నది అని తెలిపారు. పాలకుర్తి నుండి ఎస్ వి కే ప్రసాద్ ఒక్కరే పిడిఎఫ్ నుంచి గెలుపొందారని, మిగతా కాలం అంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు పరిపాలన చేశారని తెలిపారు. జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీ కులాలు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాయని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉందన్నారు. ఇప్పటికి పార్లమెంట్, అసెంబ్లీ గడప ఎక్కని కులాలు చాలా ఉన్నాయని, వారికి కూడా అవకాశాలు దక్కాలంటే బీసీ రిజర్వేషన్లు అమలు కావాలని ఆయన ఆకాంక్షించారు. బీసీల్లో అనైక్యత ఉందని, ఐక్యత సాధించి పోరాడాలని ఉన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు మామిండ్ల రమేష్ రాజా, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు కమ్మగాని నాగన్న, బహుజన కులాల ఐక్య వేదిక అధ్యక్షులు గుమ్మల రాజుల సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సోమ సత్యం, గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం మండల అధ్యక్షుడు ఐలేష్ యాదవ్, రజక సంఘం మండల నాయకులు ఎదునూరి మదార్, వివిధ సంఘాల నాయకులు బండి సోమన్న, సంగి వెంకన్న, వల్మిడి, ముత్తారం ఎంపీటీసీలు మానస భాస్కర్, తాళ్ల సోమనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *