బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో థియేటర్లలో సినిమా విడుదల కానుంది. లహరి ఆడియో ద్వారా పాటలు విడుదల కానున్నాయి. బుధవారం టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో…
అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “సినిమా గురించి చెప్పేముందు మా పార్ట్నర్, ‘ఎస్ ఒరిజినల్స్’ అధినేత సృజన్ గురించి చెప్పాలి. ఈ సినిమా నిర్మాతల్లో ఆయన ఒకరు… అమెరికాలో డాన్ లాగా! మేం ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే… సరదాగా ఆరేడు సినిమాలు లైనప్ లో పెట్టారు. హర్ష, ప్రశాంత్, రాజ్, గ్యారీ, భువన్, నా పార్ట్నర్ ఉష, నా స్నేహితులు సునీత్, అఖిల్… వీళ్ళు లేకపోతే సినిమా కంప్లీట్ అవ్వదు. వీళ్ళందరికీ థాంక్స్. మా సినిమాలో నటించిన నటీనటులు అందరికీ సారీ. మేమంతా కొత్తవాళ్ళం. చాలా ఇబ్బందులు పెట్టి, డబ్బులు కూడా కాస్త తక్కువ ఇచ్చి సినిమా చేశాం. సినిమా, రిజల్ట్ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. మా సహ నిర్మాత రమేష్ అంకుల్ కి థాంక్యూ” అని అన్నారు.
దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ “ఈ సినిమా ఒక అమ్యూజ్‌మెంట్ పార్క్ లాంటిది. టికెట్ తీసుకుని అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు వెళితే డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. అలాగే, మా సినిమాలో కూడా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి. ప్రతి అరగంటకు ప్రేక్షకుల్ని కొత్త రైడ్ కి తీసుకువెళతాం. నేను కథ రాయడం ప్రారంభించిన తర్వాత నాకు అండగా నా వెనుక ఉన్నది మా నిర్మాత అఖిలేష్. మా ఇద్దరికీ ఇది తొలి సినిమా. ఎటువంటి డౌట్స్ లేకుండా షూటింగ్ కు వెళ్లాం. స్క్రిప్ట్ ఫినిష్ అయ్యాక… మా చేతిలో ఓ బంగారు ఆభరణం మా చేతిలో ఉన్నట్టు ఉంది. దానికి డైమండ్ సెట్స్ కావాలి. ఆ డైమండ్స్ మా సినిమాలో నటించిన యాక్టర్స్. అందరూ ఫెంటాస్టిక్ పీపుల్. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీయడానికి సహకరించిన టెక్నికల్ టీమ్ కి థాంక్స్. మేం అడిగిన వెంటనే టీజర్ కి వాయిస్ ఓవర్ అందించిన సత్యదేవ్ గారికి థాంక్స్. త్వరలో థియేటర్లలో మా సినిమా విడుదల కాబోతుంది” అని అన్నారు.
సహ నిర్మాత రమేష్ వీరగంధం మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన అఖిలేష్ గారికి థాంక్యూ. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుతున్నాను” అని చెప్పారు.
రాహుల్ విజయ్ మాట్లాడుతూ “మా టీజర్ కు వాయిస్ ఓవర్ ఇచ్చిన సత్యదేవ్ గారికి థాంక్యూ. ‘అనగనగా ఓ పెద్ద అడవి. అందులో జంతువులన్నీ కూడు, గూడు, తోడు వెతుక్కున్నాక… నాలుగో జీవనాధారం కోసం అన్నీ ఒక చోట కలిసి కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాయి’ (టీజర్ లో వాయిస్ ఓవర్ ఇది). అలాగే, మేం కూడా! అనగనగా ఒక పెద్ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్లు, టెక్నీషియన్లు మా పనులు మేం చేసుకుంటూ ఉంటే… ఒక కొత్త జీవనాధారం కోసం ‘పంచతంత్రం’ అని ఒక సినిమా చేశాం. ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. హర్ష ఈ సినిమా కథ రాసినప్పుడు… ప్రేక్షకుల వరకూ రావడం కోసం మేమంతా ఓ సాయం చేశాం. నేను చేసినది ఉడతా సాయమే. అఖిలేష్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి… సాయం అంటే కొడతాడేమో!” అని అన్నారు.
శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ “అఖిలేష్, ఉష నాకు మూడేళ్ళుగా తెలుసు. అఖిలేష్ ఫోన్ చేసి నేను ఓ సినిమా చేస్తున్నాని చెప్పాడు. కథ వినకుండా చేస్తానని చెప్పాను. మొదటి సినిమాలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా చేశారు. పందిమందికి పైగా నటీనటుల్ని హ్యాండిల్ చేయడం చాలా పెద్ద విషయం. వాళ్ళిద్దర్నీ చూస్తే గర్వంగా ఉంది. లేఖ పాత్రకు నన్ను ఎంపిక చేసుకున్నందుకు థాంక్యూ. మాకు హర్ష ఏదైతే కథ చెప్పారో…. అదే తీశారు. మొదటి సినిమాకు ఇంత క్లారిటీ, మెచ్యూరిటీ ఊహించలేదు. అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. బ్రహ్మానందం గారు, స్వాతి గారు, సముద్రఖని గారు… ఇక్కడ వేదికపై ఉన్న నటీనటులతో పని చేయడం సంతోషంగా ఉంది. స్నేహితులతో వెళ్లి సినిమా తీసుకొచ్చినట్టు అనిపించింది. ఆదర్శ్ అన్నయ్యతో నా రెండో సినిమా ఇది. ఆయనతో ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ‘దొరసాని’ తర్వాత తెలుగులో నా రెండో సినిమా ‘పంచతంత్రం’. రెండిటికీ ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. ఆయనతో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా రాహుల్ విజయ్, ఇతర నటీనటుల్ని కలవడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్. విహారి మాట్లాడుతూ “ఈ సినిమాలో నేనూ భాగం కావడం సంతోషంగా ఉంది. ఐదు భిన్నమైన కథలు… ఐదు భిన్నమైన అనుభూతులు… సినిమాలో ఎంతో ఉంది. సంగీత పరంగా ఎంతో స్కోప్ ఉన్న సినిమా. మంచి పాటలు ఇచ్చే ప్రయత్నం చేశా. చిన్నతనం నుంచి నేను బ్రహ్మానందంగారి భక్తుడిని. ఆయనతో పని చేసే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. అఖిలేష్ గారు, ఉష గారు, హర్ష… నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. నేపథ్య సంగీత పనులు ప్రారంభించాం” అని అన్నారు.
శ్రీవిద్య మహర్షి మాట్లాడుతూ “సినిమాలో ఐదు భిన్నమైన భావోద్వేగాలను ఐదు కథల్లో చూపించారు. ప్రత్యక్షంగా వేదికపై ఉన్న వారందరితో కలిసి పని చేయలేకపోయినా… పరోక్షంగా పని చేయడం కుదిరింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. దర్శకుడు హర్షకు తొలి సినిమా అయినప్పటికీ మా అందరినీ బాగా చూసుకున్నాడు. మా నిర్మాత అఖిలేష్ గారికి కూడా ఇది తొలి సినిమా. ఆయన కూడా పెద్దరికంతో సినిమా చేశారు. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది. అందరూ టీజర్ చూశారు. సినిమా కూడా చూడండి… అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మాకు అయితే చాలా నచ్చింది” అని అన్నారు.
వికాస్ మాట్లాడుతూ “తెలుగులో నా రెండో చిత్రమిది. ఇంత భారీ తారాగణంతో నటించడం చాలా సంతోషంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత అఖిలేష్, దర్శకుడు హర్షకు థాంక్స్. క్రికెట్ లో ధోనిలా మా హర్ష కూడా చాలా కూల్, సైలెంట్. హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ థిస్ ఫిల్మ్” అని అన్నారు.
దివ్య శ్రీపాద మాట్లాడుతూ “కథ చదివినప్పుడు, స్క్రిప్ట్ విన్నప్పుడు… పర్సనల్ గా మనకు కనెక్ట్ అయ్యేవి తక్కువ ఉంటాయి. ఈ కథ నాకు కనెక్ట్ అయింది. సినిమా చూసే ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందని ఆశిస్తున్నాను. టీజర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వర్క్ చేసినట్టు అనిపించింది” అని అన్నారు.
ఆదర్శ్ బాలకృష్ణ మాట్లాడుతూ “థియేటర్లలో అడుగుపెట్టినప్పుడు ప్రెస్‌మీట్‌కు వచ్చాననే సంగతి మర్చిపోయి ఫస్ట్ సీట్‌లో కూర్చున్నాను. సాధారణంగా ఎవరైనా చివరి సీట్‌లో కూర్చుంటారు కదా! కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇంకా ఎక్కువమంది వస్తారని ఆశిస్తున్నాను. చిన్నతనంలో మా అమ్మమ్మ నాకు ‘పంచతంత్రం’ కథల పుస్తకాలను బహుమతిగా ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్లినా ఆ పుస్తకాలను తోడుగా తీసుకువెళ్ళేవాడిని. విపరీతంగా చదివేవాడిని. ఐదు కథలను యాంథాలజీ సినిమాగా తీశారు. దర్శకుడు హర్ష చాలా మెచ్యూరిటీ, క్లారిటీతో సినిమా తీశాడు. నేను కూర్గ్ లో వేసే సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు హర్ష వాట్సాప్ లో స్క్రిప్ట్ పంపాడు. అప్పుడే డిన్నర్ వచ్చింది. త్వరగా కథ చదివేసి డిన్నర్ చేద్దామని అనుకున్నా. స్క్రిప్ట్ చదివిన అరగంట పాటు ఏమీ మాట్లాడలేదు. ఫోన్ పక్కన పెట్టి ఎమోషన్ లో ఉండిపోయాను. ఆ తర్వాత హర్షకు ఫోన్ చేసి అద్భుతంగా ఉందని చెప్పాను. ఇందులో నేను స్వాతితో కలిసి నటించాను. తనతో ‘కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బై అప్పలరాజు’లో తనతో కలిసి నటించా. ఈ సినిమాలో నా నటన అందరికీ నచ్చితే ఆ క్రెడిట్ స్వాతి, హర్షదే. ‘పంచతంత్రం’లో నటించినందుకు సంతోషంగా ఉంది. నిర్మాత అఖిలేష్ చేతిలో ఒక హిట్ సినిమా ఉంది” అని అన్నారు.
నరేష్ అగస్త్య మాట్లాడుతూ “ఇప్పుడే ‘పంచతంత్రం’ టీజర్ చూశా. ఈ సినిమాలో నేను నటించిన కథ మాత్రమే నాకు తెలుసు. ఓ సాధారణ ప్రేక్షకుడిలా సినిమా చూడాలనే ఎగ్జైట్మెంట్ నాలో ఉంది. మిగతా నాలుగు కథలు, బ్రహ్మానందం గారి కథ నాకు తెలియదు. హర్ష మిగతా కథలు చెబుతానన్నాడు. కానీ, వద్దన్నాను. ‘నా కథ నాకు నచ్చింది. నా కథ చేసేసి వెళ్ళిపోతా. మిగతా సినిమా థియేటర్లో చూస్తాన’ని చెప్పాను. హర్ష చెప్పిన కథ నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ నా రియల్ లైఫ్ అని చెబుతా. త్వరలో ట్రైలర్ చూడాలని ఉంది” అని అన్నారు.
నటీనటులు:
బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.