నేచురల్ స్ట్రార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మించిన యాక్షన్ చిత్రం ‘వి’ గత సెప్టెంబర్ 5, 2020 న అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్ విడుదలైన విషయం తెలిసిందే. దీనికిపుడు బొంబాయి హైకోర్టు బ్రేకు వేసింది. అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ సినిమాను తొలగించాలని ఆదేశించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి చెందిన టాప్ స్ట్రీమింగ్ సేవలకు కంటెంట్ ని అందించే అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ని బొంబాయి హైకోర్టు ఈ మేరకు ఆదేశించింది. నటి సాక్షి దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తు ని జస్టిస్ జిఎస్ పటేల్ సింగిల్ బెంచ్ విచారించింది. ఈ చిత్రంలో తన స్టిల్ ఇమేజ్ ని అక్రమంగా ఉపయోగించారని సాక్షి ఆరోపిస్తూ రూ 30 కోట్లకు పరువు నష్టం దావా వేసింది.
అసలు జరిగిందేమిటంటే, సాక్షి మాలిక్ 2017జూలై లో ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. కొద్ది రోజుల తర్వాత ఫోటోగ్రాఫర్ గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఫోటోలను షేర్ చేశాడు. ఆ తర్వాత ఆమె ఫోటో పోర్ట్‌ఫోలియోలో కొంత భాగాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అప్లోడ్ చేసింది. ఇక తర్వాత ఏం జరిగిందంటే, ‘వి’ సినిమాలో కమర్షియల్ సెక్స్ వర్కర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు సాక్షి మాలిక్ ఫోటోని చూపించారు. దీంతో తన ఫోటోని సెక్స్ వర్కర్ గా చూపిస్తూ వాడుకోవడంతో సాక్షి కోర్టు కెక్కి పరువు నష్టం దావా వేసి, సినిమాని అమెజాన్ నుంచి తొలగించాలని కోరింది.
ఇంత ఘోర తప్పిదాలు సినిమా వాళ్ళు ఎలా చేస్తారో అర్ధం గాదు. గతంలో ఓ తెలుగు సినిమాలో ‘గే’ ని చూపించడానికి కమెడియన్ ఏవీఎఎస్ ఫోటోని వాడారు. దీంతో ఆ దర్శకుడ్ని పట్టుకుని కొట్టడానికి ఏవీఎస్ విపరీతంగా ప్రయత్నించాడు. ఎవరి ఫోటో ఎందుకు వాడుతున్నారో స్పృహ లేకపోతే ఇంతే!