ఎన్నికల కమిషనరా? ఫ్యాక్షనిస్టా? నిమ్మగడ్డపై సజ్జల యుద్ధం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  ఎన్నికల కమిషనర్  నిమ్మగడ్డ రమేష్ కుమార్  లో ఫ్యాక్షన్ ధోరణి కనిపిస్తోందని  ముఖ్యమంత్రి సలహాదారు, వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు నిప్పులు చిమ్మారు. అసలు నిమ్మగడ్డ అమలు చేస్తున్నది టిడిపి అధినేత చంద్రబాబు ప్లాన్ అని ఆయన ఆరోపించారు.

వైసిపికి, ఎన్నికల కమిషన్  కు  సెకండ్ వేవ్ యుద్ధం మొదలయింది. ఇంతవరకు ఎన్నికల జరుపడం మీద యుద్ధం సాగింది.  సుప్రీంకోర్టు తీర్పు తర్వాత  ఇపుడు వైసిపి  నేతల మీద, వైసిపి కి అనుకూలంగా వ్యవహారిస్తున్నఅధికారుల మీద నిమ్మగడ్డ గురిపెట్టారు. ఇది తప్పని, కుట్ర అని అధికారుల సతాయింపు, ఉద్యోగుల వేధింపు  వైసిపి నేత సజ్జల ఈ రోజు సుదీర్ఘంగా వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.

ఆయన ఈ సాయంకాలం విలేకరులతో మాట్లాడుతూ నిమ్మగడ్డ మీద యుద్ధం ప్రకటించారు.

“నెల రోజులు రాష్ట్రమంతా తన కంట్రోల్‌లో ఉందనే భ్రమలో రమేష్ కుమార్  ఉన్నారు.  పచ్చమీడియా ద్వారా అదే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ మమ్మల్ని చెడ్డగా చూపిస్తూ, ప్రజల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ఇది చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్‌ కలిసి చేస్తున్న కోల్డ్‌ బ్లడెడ్‌ కుట్రగా మేం భావిస్తున్నాం,”  అని సజ్జల నిర్ద్వంద్వంగా  అన్నారు.

“చంద్రబాబు నాయుడి డిఎన్ ఎ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిఎన్ఎ ఒకటే”

ఉద్యోగులను టెర్రరైజ్ చేసే విధంగా ఎస్ఈసీ వైఖరి ఉందని,  చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ భాగస్వామి అయ్యాడని,  ఎన్నికల కమిషన్ని  కీలుబొమ్మలా వ్యవహరించేలా చేశారని సజ్జల విమర్శించారు.

Nimmagadda Ramesh Kumar SEC, AP

ఎస్ఈసీ వేదికగా చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని చెబుతూ చంద్రబాబు, నిమ్మగడ్డ డీఎన్ఏ ఒక్కటే అని అన్నారు. చంద్రబాబు ఆలోచనలను అమలు చేసేలా నిమ్మగడ్డ నిర్ణయాలున్నాయని, సీనియర్ అధికారుల పట్ల నిమ్మగడ్డ వాడిన భాష సరికాదని అభ్యంతరం తెలిపారు.

నిమ్మగడ్డ చర్యల పట్ల అధికారులెవరూ భయపడాల్సిన పనిలేదుని నిష్పక్షపాతంగా, నిర్భయంగా పనిచేయండని సజ్జల అధికారులకు  హామీ ఇచ్చారు.

సజ్జల రామకృష్ణారెడ్డి అన్న మాటలివి:

ఇద్దరు సీనియర్‌ అధికారుల పట్ల నిమ్మగడ్డ రాసిన రాతలు కానీ, వాడిన భాష సక్రమంగా లేదు. గతంలో తాను కూడా ఓ అధికారిగా ఉన్నారు. ఆయన వాడుతున్న భాష అసభ్యతకు తార్కాణంగా కనిపిస్తోంది. అధికార యంత్రాంగాన్ని టెర్రరైజ్ చేసి తద్వారా వాళ్ల బాధ్యతల్లో సక్రమంగా నిర్వర్తించలేని పరిస్థితి క్రియేట్ చేసి టీడీపీకి ఎలా ఉపయోగపడాలో ఆలోచిస్తున్న పరిస్థితి గమనిస్తున్నాం. వారు ఏపని చేసినా ఏం కొంపలు అంటుకుంటాయో అని భయపడే పరిస్థితి తేవాలని నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారు.

నిమ్మగడ్డ ప్రభుత్వానికి రాసిన లేఖలు చూస్తే చంద్రబాబు రాజకీయమే ఎస్‌ఈసీ రాతల్లో కనపడుతోంది.

ఎస్‌ఈసీ డిక్టేటర్‌ లా ప్రవర్తిస్తున్నాడు. ఇందులో రహస్యం లేదు. సుప్రీం తీర్పు వచ్చింది. దాని మీద ఎస్‌ఈసీ సీఎస్ కు లేఖ రాస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. అది తప్పు. ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్పీని ఉద్దేశిస్తూ వాడిన భాష కూడా సక్రమంగా రాయలేదు. వాళ్లపై రిమార్క్ పెట్టేలా ఎస్‌ఈసీ చేశారు.

చంద్రబాబులాంటి కుట్రలు ఏవైతే ఉంటాయో.. మిగిలిన అందరి మీద బురదచల్లి అవే దుర్మార్గపు ఆరోపణలు చేయటం ఎస్‌ఈసీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు అడ్డంపడుతుందని, అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారు. అసలు ప్రజల్లో టీడీపీ గాలి విపరీతంగా ఉంది. ఈ ప్రభుత్వం (వైయస్‌ఆర్‌సీపీ) పై చేయి సాధించాలని చూస్తోంది. ఈ ప్రభుత్వానికి (వైయస్‌ఆర్‌సీపీకి) ఎన్నికలు అంటే భయం, వణుకు అనేది క్రియేట్ చేయటానికి ఎస్‌ఈసీ ఎన్ని తిప్పలు పడాలో అన్ని పడుతున్నారు. మేం రేపు ఎన్నికలు స్వీప్ చేస్తాం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కూడా స్వీప్ చేస్తాం. ఆ ఎన్నికల మీద పడినా ఓ అర్థం ఉంటుంది. చంద్రబాబు పెయిడ్ ఏజెంట్‌లా నిమ్మగడ్డ పనిచేస్తున్నారు

 

నారా చంద్రబాబు అనే వ్యక్తి సొంత మామను వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని కబంధహస్తాల్లో ఇరికించుకున్న రోజు నుంచి రాష్ట్రం సర్వనాశం అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ చంద్రబాబు తన మొహాన్ని అద్దంలో చూసుకుంటే దెయ్యమే తనకు కనిపిస్తుంది. చంద్రబాబు ఇలాంటి పనులకు కుటుంబం లేదు, రాష్ట్రమూ లేదు. అయినా చంద్రబాబు దింపుడు కళ్లెం ఆశల్లో భాగంగా కుట్రలు చేయిస్తున్నారు. ఈ నెలరోజుల్లో ఎన్నికల పర్వం ముగుస్తుంది. ఈ పర్వం ముగిసిన తర్వాత చంద్రబాబు, ఆ పార్టీ పూర్తిగా రాజకీయంగా సమాధి కావటం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *