కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్ రాజధాని మార్పా?

(శ్రవణ్‌బాబు) 
కమ్మవారిని దెబ్బతీయటానికే జగన్మోహన్‌రెడ్డి రాజధానిని అమరావతినుంచి తరలిస్తున్నారని టీడీపీ నాయకులు పలువురు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై మంత్రి కొడాలినాని నిన్న అసెంబ్లీలో ఒక అనూహ్యమైన వాదనను లేవనెత్తారు. ఆ వాదన ప్రకారం చూస్తే, పై ఆరోపణను విస్తృతంగా ప్రచారం చేసిన టీడీపీ అనుకూల మీడియావారు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లే కనిపిస్తోంది.
మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా నిన్న మంత్రి కొడాలినాని అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీలోని కమ్మ సామాజికవర్గం నాయకులు, పత్రికాధిపతులు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడులపై తనదైన శైలిలో నాని చెణుకులు విసిరారు.
 
ఒకవైపు పంచారామాలలో ఒకటైన సుప్రసిద్ధ శివాలయం, మరోవైపు బౌధ్ధ స్థూపం ఉన్న చారిత్రక ప్రదేశం అమరావతిని చంద్రబాబు పాడుబెట్టారంటూ నాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. శాతవాహనులకు రాజధానిగా ఉండి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న పాత అమరావతిని పాడుబెట్టి, అక్కడకు 25 కిలోమీటర్లదూరంలో రాజధానికోసం తాను సృష్టించినదే అసలు అమరావతిగా బాబు తప్పుడు ప్రచారం చేశారని గుర్తుచేశారు. ఈ విషయం ముమ్మాటికీ నిజమనే చెప్పాలి. ఎందుకంటే గుంటూరు జిల్లాలోని స్థానికులు తప్పితే బయటవారిలో చాలామంది, రాజధాని కడుతున్న ప్రదేశమే చారిత్రక ప్రాధాన్యమున్న, బౌద్ధస్థూపం ఉన్న అమరావతిగా పొరపడుతున్నారు. ఇది పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించటమేననటంలో ఎటువంటి సందేహం అవసరంలేదు. పాత అమరావతి పేరుపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్ ఇమేజిని ఈ కొత్త రాజధానిఖాతాలోకి లాక్కోవటంకోసమే చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాజధాని ప్రాంతానికి ఛత్తీస్‌గడ్ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్‌లాగా నయా అమరావతి అనో, న్యూ అమరావతి అనో పేరు పెట్టి ఉండేవారు. 

రాజధాని అంటే రాష్ట్రం నడిబొడ్డున ఉండాలంటూ చంద్రబాబు నాయుడు, ఆయనకు బాకా ఊదే పత్రికాధిపతుల దుష్ప్రచారాన్నికూడా నాని తిప్పికొట్టారు. దేశరాజధానిగా ఉన్న ఢిల్లీనగరం దేశానికి మధ్యలో లేదని, చెన్నై తమిళనాడుకు ఉత్తరాన ఉందని, బెంగళూరు కర్ణాటకకు మధ్యలో లేదని, ముంబై మహారాష్ట్రకు మధ్యలో లేదని, కొల్‌కతా పశ్చిమ బెంగాల్‌కు మధ్యలో లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. 
 
అమరావతినుంచి రాజధానిని తరలించటంవలన కృష్ణా, గుంటూరు జిల్లాలు నష్టపోతాయన్న వాదననుకూడా నాని తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని గతంలో మద్రాసులో, కర్నూలులో, హైదరాబాద్‌లో ఉండేదని గుర్తుచేశారు. మద్రాసులో ఉన్నప్పుడుగానీ, కర్నూలులో ఉన్నప్పుడు గానీ, హైదరాబాద్‌లో ఉన్నప్పుడుగానీ కృష్ణా, గుంటూరు జిల్లాలలో అభివృద్ధి యధాతథంగానే ఉంది, ఏమీ ఆగిపోలేదని చెప్పారు. అయితే చంద్రబాబు అమరావతిని రాజధాని చేయటంవలన మిగిలిన ప్రాంతాలవాళ్ళకు ఇక్కడి ప్రాంతంపై ద్వేషం పుట్టేటట్లు చేశారని నాని అన్నారు. 
ఇక అసలు విషయానికొస్తే, కమ్మ సామాజికవర్గంలోని కొందరు చేస్తున్న ఆరోపణలపై, నిష్ణాతుడైన న్యాయవాదిని తలపించేటట్లు నాని ఒక పాయింట్ లేవనెత్తారు. కమ్మవారిపై జగన్ కక్ష కట్టాడని, కమ్మవారిని నాశనం చేయటానికే జగన్ అమరావతినుంచి రాజధానిని తరలిస్తున్నాడని ఈనాడు అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తమ పత్రికల్లో రాతలు రాయించారని నాని గుర్తు చేశారు. ఇక టీవీ5 ఛానల్ అధినేత బీఆర్ నాయుడు అయితే, రాజధాని మార్పువలన ప్రపంచం తల్లకిందులైపోయిందన్నట్లుగా 24 గంటలూ ఇదే వార్తలను చూపిస్తున్నాడని అన్నారు. కమ్మకులానికి చెందిన స్వయం ప్రకటిత మేధావులు టీవీ డిబేట్లలో కూడా కమ్మవాళ్ళపై ద్వేషంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ ఊదరగొడుతున్నారని చెప్పారు. అమరావతినుంచి రాజధాని తరలిస్తే కమ్మ కులాన్ని దెబ్బతీసినట్లు రామోజీరావు, రాధాకృష్ణ వంటివారందరూ భావిస్తున్నారంటే, రాజధానిని అక్కడ ఏర్పాటు చేసింది కమ్మకులంకోసమేనని ఒప్పుకున్నట్లుగానే ఉందని అన్నారు.
 
నాడు రామోజీరావు, రాధాకృష్ణ ఇచ్చిన సలహాలమేరకు కమ్మకులాన్ని ఉద్ధరించటంకోసమే రాజధానిని అమరావతిలో పెట్టారా అని నాని చంద్రబాబును అడిగారు. ఇదికూడా ఒక రకంగా సహేతుకమైన ప్రశ్నే అని చెప్పాలి. ఎందుకంటే తమను నాశనం చేయటంకోసమే అమరావతినుంచి రాజధాని మారుస్తున్నారు అన్నది పలువురు కమ్మప్రముఖుల వాదన. రాజధాని ఇక్కడ ఉంటే తాము అభివృద్ధి చెందుతామనే అక్కసుతోనే జగన్ తమను తరలిస్తున్నాడన్నది వారు పదే పదే చేస్తున్న ఆరోపణ. నాని లేవనెత్తేవరకు ఎవరూ గమనించలేదుగానీ, ఈ ఆరోపణకు అర్థం ఏమిటో ఇప్పుడు బోధపడుతోంది. ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాకూడా, కమ్మవారికి లబ్ది కలిగించటంకోసమే ఖరీదైన, సారవంతమైన జరీబు భూములున్న వెలగపూడి ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేశారన్న వాదన నిజమేనని ఈ ఆరోపణ అన్యాపదేశంగా చెబుతోంది. సదరు ఆరోపణ చేస్తున్న ఆ సామాజికవర్గ ప్రముఖులు, స్వయంగా ఆ వాదనను తమకు తామే ఒప్పుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు కొట్టొచ్చినట్లు కనబడుతోంది.
 
మరోవైపు అమరావతి నిర్ణయం కమ్మ సామాజికవర్గానికి అనుకూలమనే గుంటూరు, కృష్ణాజిల్లాలలోని కమ్మేతర కులాలలోని అధికశాతం అభిప్రాయపడుతున్నారు. అమరావతి ప్రాంతంలో సంఖ్యాపరంగా కమ్మవారు తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు అక్కడ ఎక్కువగా భూములు ఉన్నది వారికే కాబట్టి రాజధాని తరలింపు వ్యవహారం వారికి సంబంధించినదిగా మిగిలినవారు భావిస్తున్నారు. అందుకే అమరావతి పరిరక్షణ ఉద్యమంలో 90శాతం కమ్మవారే తప్పితే మిగిలినవారు లేరు. మీడియాలో జగన్‌ను బూతులు తిడుతున్న మహిళలు(వైసీపీవారు వీరిని ‘బేబక్కయ్యలు’ అని పిలుస్తున్నారు)కూడా చంద్రబాబును పొగుడటంద్వారా తమ ఐడెంటిటీని తామే బయటపెట్టుకున్నారు.  గుంటూరుజిల్లాలో మిగిలినచోట్లనుంచిగానీ, కృష్ణాజిల్లాలోగానీ అందుకే వారికి మద్దతుకూడా లభించలేదు.                            
 
సోషల్ మీడియా ద్వారా, టీడీపీకి తొత్తులైన డబ్బా ఛానల్స్ ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, వారి కుటుంబసభ్యులను, చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆడవాళ్ళు, తాగుబోతులతో పచ్చిబూతులు తిట్టిస్తున్నారని నాని అన్నారు. మామనుంచి బలమైన పార్టీ లాక్కుని, 70 ఏళ్ళ వయస్సు వచ్చికూడా, సొంత కొడుకును గెలిపించుకోలేని చంద్రబాబునాయుడు బతుకుకంటే చనిపోయికూడా తన కీర్తితో కుమారుడిని ముఖ్యమంత్రిని చేసిన వైఎస్‌ చావు ఎంతో గొప్ప అని నాని అన్నారు. 
 
కమ్మ సోదర, సోదరీమణులందరికీ నాని ఒక విజ్ఞప్తి చేశారు. కమ్మ సామాజికవర్గంపై జగన్మోహనరెడ్డి కక్ష కట్టాడన్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. కమ్మవారిని ఎవరూ దెబ్బతీయలేరని, విశాఖపట్నంలోకూడా అత్యధిక వ్యాపారాలు కమ్మవారివేనని గుర్తుచేశారు. డాల్ఫిన్, దసపల్లా, నొవాటెల్ వంటి నాలుగు ఫైవ్ స్టార్ హోటల్స్, 80శాతం సినిమా ధియేటర్లు, ఆటోమొబైల్ వ్యాపారాలు కమ్మవారివేనని చెప్పారు. తమవారు ఎక్కడికి వెళ్ళి అయినా బ్రహ్మాండంగా బతకగలరని అన్నారు. కమ్మవారికి ఇప్పుడు రెండు రాజధానులు వచ్చాయని, మరిన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు.  
 
చంద్రబాబునాయుడుకు నాని ఇవాళ సభలో విసిరిన సవాల్ నిజంగా సమర్థనీయమైనదనే చెప్పాలి. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక సందర్భంలో తెలంగాణవాదం సమసిపోయిందని ఎం.సత్యనారాయణరావు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ కేసీఆర్ తమ పార్టీ ప్రజాప్రతినిధులు అందరితో రాజీనామా చేయించి ఉపఎన్నికలకు వెళ్ళి గెలిచారని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టగానే 18మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్ళీ గెలిచారని గుర్తు చేశారు. అదేవిధంగా అమరావతికి జనంలో మద్దతు ఉందని చంద్రబాబు నాయుడు నిరూపించదలుచుకుంటే తమకున్న ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి గెలవాలని నాని సవాల్ విసిరారు. 
 
చంద్రబాబు నాయుడు 1995-2004 పదవీకాలంలో తరచూ చెప్పిన విజన్ – 2020 గురించి నాని చెప్పిన వ్యాఖ్యానం సభలో నవ్వులను పూయించింది. ఇది 2020 సంవత్సరమని, టీడీపీ తరపున గెలిచిన 23మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు వెళ్ళిపోగా, చంద్రబాబువెనక ఇప్పుడు 20 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, యాధృచ్ఛికంగా ఇవాళ తేదీకూడా 20వ తేదీయేనని నాని గుర్తు చేశారు. 
 
కొసమెరుపు: కమ్మవారిపై, కృష్ణా-గుంటూరు జిల్లాలపై తనకు కక్ష ఉందన్న వాదనపై జగన్మోహన్ రెడ్డికూడా తన ప్రసంగంలో స్పందించారు. తన మేనత్తను ఇచ్చింది కృష్ణా జిల్లాయేనని చెప్పారు. తనకు కుడిభుజంలాగా ఉండే కొడాలి నానిగానీ, తన వ్యవహారాలన్నీ చూసుకునే తలశిల రఘురామ్‌గానీ కమ్మవారేనని జగన్ గుర్తుచేశారు.
 
(శ్రవణ్ బాబు, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, 9948293346