స్త్రీల లైంగిక విషాదగాధలు అనే టాగ్ లైన్ తొ వచ్చిన “హస్బెండ్ స్టిచ్” అనే ఈ కథా సంపుటి లో 13 కథలున్నాయ్. డా. భారతి గారు గీతాంజలి అనే పేరుతో తెలుగు సాహితీ లోకానికి పరిచితులు. వీరి ఇతర కథలు నేను చదవలేదు. ఒక సెక్సాలజిస్ట్ గా కౌన్సలర్ గా తాను చూసిన స్త్రీల జీవితాలను చర్చించుకోడానికి ఇష్టపడని స్త్రిల లైంగిక సమస్యల వెనుక ఉన్న సామాజిక, కారణాలను వీరు ఇందులో విశ్లేషించారు. వీరు రాసిన కథలన్నీనిజ జీవితాల కథలే అనే స్పష్టంగా చెప్పారు. ఇటువంటి విషయంతో సాహిత్య సృజన అవసరమా అంటే మరి కామసూత్ర పుట్టిన మన దేశంలో నే సెక్స్ కి సంబంధించి సైధాంతిక చర్చల అవసరం ఉంది. అందులో స్త్రీల లైంగిక సమస్యల పై చర్చ అత్యవసరం. పితృస్వామ్య సమాజంలో స్త్రీ ని తమ ఆస్థి గా భావించిన పురుషులందరూ స్త్రీపై తమ ఆధిపథ్యాన్ని ప్రదర్శించడానికి సెక్స్ ని ఒక ఆయుధంగా ఈగో సాటిస్ఫయింగ్ పాయింట్ గా ఉపయోగించుకుంటారు. దానివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతుతాయి. స్త్రీ మానసిక, శారీరిక దోపిడికి గురి అవుతూనే ఉంది. అయితే ఈ పుస్తకంలో రాయబడిన సంఘటనలు ప్రతి ఒక్క స్తీ జీవితంలో జరగక పోవచ్చు. కాని ఆ సమస్యేలే లేవన్నది భావ్యం కాదు. ఉదాహరణకి చైల్డ్ అబ్యూస్ నాకు జరగలేదు కాబట్టీ ఎవ్వరికీ జరగదు అనుకోవడం వెర్రితనం. నా తండ్రి దేవుడు కాబట్టి కన్నబిడ్డలను తమ లైంగిక వాంచకి బలి చేసే తండ్రులే లేరని అనడం చాలా తప్పు. మన చుట్టూ లైంగిక దోపిడికి గురి అవుతున్న స్త్రిలు వేలల్లో కనిపిస్తారు. వారిని మనం గుర్తించకపోవడానికి కారణం మన సురిక్షిత గూళ్ళనుండే ప్రపంచాన్ని అంచనా వేసే మన అర కొర సామాజిక జ్ఞానం.
శారీరిక సంబంధం విషయంలో చాలా మంది స్త్రీలకు చాయిస్ తక్కువ. ఇప్పటి ఆధునిక యువతుల లైంగిక స్వేచ్చ కూడా ఒక రకమైన దోపిడి వ్యవస్థ పరిణామమే. పెళ్ళి పేరుతో లేదా మరే పేరుతో నన్నా కాని స్త్రీ ని లైంగిక వస్తువుగా పరిగణించే బంధాలే మన చుట్టూ. Woman is for pleasure ఆనే ఫిలాసఫీ మన సమాజంలో చొచ్చుకుపోయింది. లైంగిక సుఖం తన హక్కు అని పురుషుడు భావించే సమాజమే మన చుట్టూ. స్త్రీలను కూడా అలాంటి లైంగిక వస్తువులుగానే సమాజం తయారు చేసుకుంటూ వస్తుంది. అందుకే స్త్రీ శరీర కొలతలు, రంగు, చాలా ముఖ్యమైన విషయాలు. అసలు మన చుట్టూ రేషన్ షాపుల కన్నా బ్యూటీ పార్లర్లు ఎక్కువయిపోయాయి. అలంకరణ అందులో స్త్రీల అలంకరణ సామాగ్రీ పై జరుగుతున్న వ్యాపారం చూస్తే మన ప్రాధ్యాన్యతలేంటో అర్ధం అవుతుంది. ఇలాంటి సమాజంలో చాలా మంది స్త్రీలు కేవలం వస్తువులు గానే చూడబడుతున్నారు. మరో కోణంలోంచి చూస్తే వస్తువులుగా తమను తాము మలచుకోవడానికి తాపాత్రయపడి అదే జీవితం అనే అపోహతో జీవిస్తున్నారు. వస్తువుగా మారలేని మనుష్యులలో రేగే ఆలోచనలు స్త్రీవాదానికి పునాది. వస్తువులుగా మారి అసహజమైన అనుభవాల కారణంగా ఉద్బవించే శారీరకమైన, మానసికమైన బాధలతో ఎందరో స్త్రీలు అలమటిస్తునారు. అయితే రచయిత్రి చెప్పిన జీవితాలలోనే కాకుండా నేను చూసిన చూస్తున్న స్త్రీలలో కూడా తమను వస్తువుగా మార్చుకోనే నేపధ్యంలో ఆ ప్రక్రియ ఎక్కువ బాధాకరం కాకూడదను కునే స్త్రీలే కనిపిస్తున్నారు కాని అసలు మేం వస్తువులం ఎందుకవుతాం అనే వారి సంఖ్య చాలా తక్కువ. ఉదాహరణకి మగపిల్లవానికోసం, కేవలం పిల్లల కోసం “పూయని తావిననే అపవాదు రాకుండా” ఉండడం కోసం వైద్య పరిజ్ఞానంలో సులువైన మార్గాలను ఆశ్రయించే స్త్రీల సంఖ్య ఎక్కువ కాని నా శరీరాన్ని ఇబ్బంది పాలు చేసుకోను అని అనుకునే స్త్రీలు కనిపించరు. పిల్లలు లేని స్త్రీలను స్త్రీలే కించపరిచే సమాజం ఇది. శుభకార్యాలలో చూస్తే, వితంతువులను, పిల్లలు లేని స్త్రీలను భర్తకు దూరమైన స్త్రీలను ఈ రోజుకి కూడా కొంత పక్షపాత వైఖిరితో పురుషుల కన్న స్త్రీలే చూస్తారు. పురుష సమాజం దోపిడిని ఎదుర్కోవాలని అనుకుంటూనే స్త్రీలే దోపిడీకి గురి అవుతున్న సాటి స్త్రీల కోసం నిలబడరు. ఒక ఇంట్లో లైంగిక హింస జరుగుతుంటే ఆ ఇంటీ స్త్రీ లందరూ ప్రతిఘటించే రోజు రావాలంటే స్త్రీలల్లో మార్పు రావాలి. పురుషుని చుట్టూ మాత్రమే తమ జీవితం అని ఒక పురుషున్ని తమ గుప్పేట్లో పెట్టుకోవడమే తమ జీవితపు ధ్యేయమని అదే సాధించే గొప్ప విజయమని అనుకునే స్త్రీలను సమాజం తయరు చేస్తున్నంత కాలం హస్బెండ్ స్టిచ్ కోసం శరీరాలను హింసించుకునే స్త్రీలే కనిపిస్తారు.
స్వేచ్చ, లైంగిక హక్కుల పోరాటాలు కూడా దోపిడి దిశగానే పయనిస్తున్నాయి. శారీరిక ప్రదర్శన నా హక్కు అనే దిశగా కాక నా శరీరాన్ని నేను గౌరవించుకుంటాను. దాన్ని బజారులో వస్తువుగా పెట్టను. నా శరీరం పెట్టుబడిగా జరిగే వ్యాపారాలను జరగనివ్వను, నా శరీరాన్ని ఏ బంధం పేరుతో ఆటవస్తువును కానివ్వను, అన్నిటికన్నా నా శరీరాన్ని నా మనసును నేను గౌరవించుకుంటాను, వీటిని వస్తువులుగా మార్చుకోను అనే భావం స్త్రీలకు రానంత కాలం స్త్రీ సమస్యలకు ముగింపు లేదు.ఈ 13 కథలలో కూడా పితృస్వామ్య సమాజానికి తలవంచిన స్త్రిలు, అందులోని హింసను ఎదుర్కోవడంలో నలిగిపోయే స్త్రీల జీవితాలే కనిపిస్తాయి. పసి పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు. తండ్రి చేతిలో బలయిపోతున్న చిన్ని మొగ్గలు, సమాజంలో పూజలందుకుంటూ ఊరందరికీ సుఖాన్ని పంచే జోగినీ లు, మగబిడ్డ్లల కోసం తమ శరీరాలను ప్రయోగశాలగా మార్చుకునే తల్లులు, భర్త శారీరిక అవసరాల కోసం ఇష్టం లేని క్రియలలో పాల్గొనే సాంప్రదాయ స్త్రీలు, తమ శారీరిక మర్పులు గుర్తించక కేవలం తమ కోరికే ప్రధానమని నమ్మే భర్తలకు భార్యలు, భర్త లైంగిక సుఖం కోసం ఆపరేషన్లు చేయించుకునే స్త్రీలు, ఇలాంటి గాధలు కథల రూపంలో మనలను ప్రశ్నిస్తాయి. భర్తను సుఖపెట్టడం భార్య బాధ్యత అనుకునే భావజాలం నుండి అసలు సెక్స్ అన్నది సుఖం కోసమేనా? అయితే ఇద్దరు వ్యక్తులు పాల్గొనే క్రియలొ సుఖం ఏకపక్షం అయినప్పుడు అది దోపిడి కాని సుఖం అవ్వదు కదా, మరి దోపిడి లో సుఖపడేది ఎవరు? దాని పర్యావసానం అనారోగ్యకరమైన సమాజమే అయినప్పుడు ఈ దోపిడిని ప్రశ్నించే భాద్యత అందరిదీ కదా అనే ఆలోచన కలిగించడం కోసం రచయిత్రి ఈ కథలను రాశారు అనిపించింది. Sex with passion కన్నా sex with compassion ముఖ్యమని, sex with force కన్నాsex with submission అవసరం అని sex for curiosity కాదు sex for harmony అని Sex for power కాదు Sex for emotional Interchange అన్నది అర్ధం అయినప్పుడే లైంగిక నేరాలు తగ్గుతాయి. అటువంటీ భావజాలం ఉన్న సమాజాన్ని సృష్టించుకునే దిశగా స్త్రీవాదులు, మనవతా వాదులు అందరూ ప్రయత్నించాలి. ఈ సమస్యలపై నిర్బయంగా, చర్చించవలసిన అవసరం అందరికీ ఉంది. ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేయవలసిన అవసరం ఇప్పుడు అందరిదీ.
(ఫేస్ బుక్ గ్రూప్ Nacchina Pustakam నుంచి)