ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం సాక్షిగా ఎపి సిఎం చంద్రబాబు నాయీ బ్రాహ్మణుల మీద చిందులేశారు. నాయీ బ్రాహ్మణులపై గుడ్లురిమి చూశారు. వారిని బెదిరించారు. సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆగ్రహంతో ఊగిపోయారు. వివరాలు చదవండి.
తమ వేతనాలు పెంచాలని కోరుతూ నాయీ బ్రాహ్మణులు పోరుబాట పట్టారు. ప్రస్తుతం ఎపి అంతటా దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులు సమ్మెచేస్తున్నారు. వారి ఆందోళన సోమవారం ఉగ్రరూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఎపి సిఎం చంద్రబాబునే వారు అడ్డుకున్నారు. సిఎంతో వాగ్వాదానికి దిగారు. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కానీ చంద్రబాబు వారి డిమాండ్లను పరిష్కరించలేమని స్పష్టం చేశారు. క్షరకులను ఉద్యోగులుగా గుర్తించలేమని తేల్చి చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే జనాల్లోకి వెళ్లి పోరాటం చేస్తామని ముందే నాయీ బ్రాహ్మణులు తేల్చి చెప్పారు. దీంతో వారిపై బాబు అగ్రహోదగ్రుడయ్యారు. అసలు ఇక్కడి వరకు రానీయడం పొరపాటు అంటూ వారిపై చిందులేశారు. ఈ సందర్భంగా కేశ ఖండనకు 25 రూపాయలు ఇస్తామని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు నాయీ బ్రాహ్మణులు. మీకు నచ్చితేనే పనిచేయండి.. లేదంటే వెళ్లిపోండి అంటూ బాబు ఈ సందర్భంగా వారికి వార్నింగ్ ఇచ్చారు.
చంద్రబాబు తీవ్రమైన హెచ్చరికల నేపథ్యంలో నాయీ బ్రాహ్మణులు తమ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఎపిలో సర్కారు వర్సెస్ నాయీ బ్రాహ్మణులు వార్ ముదిరే అవకాశాలు కనబడుతున్నాయి.
అంతకుముందు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నాయీ బ్రాహ్మణుల సంఘం నేతలతో చర్చలు జరిపారు. తక్షణమే సమ్మె విరమించాలని కోరారు. కానీ క్షరకులు కేఈ వినతిని పట్టించుకోలేదు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.