తెలంగాణ కేబినేట్ లో ఇద్దరు మహిళలకు ఛాన్స్

తెలంగాణ కేబినేట్ లో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేసీఆర్  ఈ విషయాన్ని తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, కేబినేట్ లోనే మహిళలకు అవకాశం లేకుంటే సమాన అవకాశాలు ఎలా వస్తాయని ఆమె ప్రశ్నించారు. దీంతో కేసీఆర్ మాట్లాడుతూ…

 “సబితా ఇంద్రారెడ్డి గారు మీరేం చింత చేయవద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇద్దరు మహిళా మంత్రులను కేబినేట్ లోకి తీసుకుంటాం. ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది. ఆ ఆరుగురిలో ఇద్దరు మహిళా మంత్రులు ఉంటారు. దయచేసి మీరు తప్పుడు ఆలోచనలు పెట్టుకోవద్దు. గత కేబినేట్ కూర్పులో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి కాబట్టే మహిళలకు అవకాశం ఇవ్వలేకపోయాం. ఈ సారి ఖచ్చితంగా ఇద్దరు మహిళా మంత్రులను నియమిస్తాం. వారికి మంచి స్థానం కల్పిస్తాం.” అని సీఎం కేసీఆర్ అన్నారు. దీంతో ఆ ఇద్దరు మంత్రులు ఎవరనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో మొదలైంది.

ప్రస్తుతం టిఆర్ఎస్ నుంచి  రేఖా నాయక్, పద్మా దేవేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి  ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సత్యవతి రాథోడ్ కు అవకాశం కల్పించనున్నారు. దీంతో  ఈ నలుగురిలో ఎవరికి అదృష్టం దక్కనుందోనన్న చర్చ జరుగుతోంది.

అయితే మంత్రి పదవి రేసులో ముందున్న వారు పద్మాదేవేందర్ రెడ్డి. పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె గత ప్రభుత్వంలో డిప్యూటి స్పీకర్ గా పని చేశారు. ప్రస్తుతం ఉన్న నలుగురు మహిళల్లో కూడా సీనియార్టి, విధేయత ప్రకారం ఖచ్చితంగా పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం దక్కనున్నట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం కేబినేట్ లో ఎస్టీ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనివ్వలేదు. దీంతో ఈ  సారి ఎస్టీ కోటాకు అవకాశం ఇచ్చి అందులో మహిళకు ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖానాయక్ కు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరో ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి. ప్రస్తుతం ఈమె ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ప్రభుత్వంలో విప్ గా పని చేశారు. ఈ సారి సునీతకు చీఫ్ విప్ లేదా పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కనున్నట్టు తెలుస్తోంది. సునీతా మహేందర్ రెడ్డి మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సామాజిక వర్గాల కారణంగా ఆమెకు మంత్రి పదవి దక్కే అవకాశం లేనట్టు చర్చ జరుగుతోంది.

సబితా ఇంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు కేసీఆర్ చెప్పిన సమాధానం ద్వారా ఇద్దరు మహిళా మంత్రులకు లైన్ క్లియర్ అయినట్టు స్పష్టమైంది. గత కేబినేట్ లో మహిళలకు అవకాశం లేకపోవడంతో టిఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఈ సారి ఆ విమర్శలకు తావు లేకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ఇద్దరు మహిళలకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే పార్లమెంటు ఎన్నికల తర్వాతనే మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేసి వీరికి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *