తెలంగాణ అందాలు చూడండి

చిక్కటి అడవి, అందమైన ప్రకృతి, గలగలా పారే సెలయేర్లు ఇవీ తెలంగాణ అడవుల్లో అందాలు. ఈ ప్రకృతి అందాలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం ఎకో టూరిజాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. తెలంగాణ అడవులకు తలమానికం అయిన భూపాలపల్లిలో ఎకో టూరిజం టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను అటవీ శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఏటూరు నాగారం వణ్యప్రాణి  సంరక్షణ కేంద్రం, లక్నవరం సరస్సు, బొగత వాటర్ ఫాల్స్, సమ్మక్క సాలక్క జాతర ప్రాంతం, కాలేశ్వరం గుడి, ప్రతాపగిరి కోట లాంటి ప్రాంతాలను పర్యాటక ప్రేమికులకు చూపేందుకు వీలుగా మూడు ప్రత్యేక ప్రాకేజీలు అందుబాటులోకి వచ్చాయి.

పర్యాటకులు ఒకట రెండు రోజుల అడవిలోనే గడిపేందుకు వీలుగా తాడ్వాయి హట్స్ కూడా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఇక అడవిలోనే గడిపేందుకు వీలుగా టెంట్లలో కూడా రాత్రి పూట బస సౌకర్యాన్ని కూడా అటవీ శాఖ కల్పిస్తోంది. అడవిలో సైక్లింగ్, ట్రెక్కింగ్,  పర్యావరణంపై అవగాహన కల్పించే సెంటర్ సందర్శన, ఆదిమ మానవుల గుహలు, బ్లాక్ బెర్రీ ద్వీపం, కొండేటి వ్యూ పాయింట్ లాంటి ప్రాంతాలకు ఒక రోజు బస, భోజన సౌకర్యం, గైడ్ తో కలిపి ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున ఒక ప్యాకేజీ, అలాగే లక్నవరం ఫెస్టివల్ లో భాగంగా మరో ప్యాకేజీ కూడా అందుబాటులోకి రానుంది. దీనిలో భాగంగా రాత్రి పూట టెంట్లలో బస, క్యాంప్ ఫైర్, బోటింగ్, ద్వీపం సందర్శన, అడవిలో ట్రెక్కింగ్, ఎడ్ల బండిపై విహారం, లేక్ వ్యూ సఫారి ఈ రెండో ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

దీనికి కూడా ఒక్కొక్కరికి ఒక రోజుకు రెండు వేల చొప్పున ఫీజుగా అటవీ శాఖ నిర్ణయించింది. ఇక మూడవ ప్యాకేజీలో పాండవుల గుట్ట సందర్శన ఉంటుంది. అక్కడ రాక్ క్లైంబింగ్, రాప్లింగ్, ట్రెక్కింగ్, బౌల్డరింగ్ లాంటి సహాస క్రీడలను ఇష్టపడే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను అటవీ అధికారులు చేశారు. నిపుణులైన పర్యవేక్షకుల సహకారంతో ఇక్కడ సాహస క్రీడలను ఆస్వాదించవచ్చు. ప్రతీ వారం శని, ఆది వారాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు మధ్యలో భోజనంతో సహా ఒక్కొక్కరికి  ఐదు వందల రూపాయలను రుసుముగా నిర్ణయించారు. పర్యాటకులు www.ecotourism.bhupalapally.com వెబ్ సైట్ ద్వారా గానీ, లేదంటే ఎకో టూరిజం సమన్వయ కర్త సుమన్ ను ఫోన్ లో  ( 7382619363) సంప్రదించటం ద్వారా తమకు ఇష్టమైన ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. భూపాల పల్లి అటవీ ప్రాంతం అందాలను ప్రతీ ఒక్కరు ఆస్వాదించేందుకు వీలుగా, పెద్దలకు, పిల్లలకు, సాహస క్రీడలను ఇష్టపడేవారికి ప్రత్యేకంగా ప్యాకేజీలు రూపొందించామని, హైదరాబాద్ నుంచి వచ్చే విద్యార్థులు, ప్రొఫెషనల్స్ కోసం కూడా ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పిస్తామని భూపాలపల్లి డీ.ఎఫ్.ఓ రవి కిరణ్ వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా అడవుల్లో ఉన్న కొత్త వ్యూ పాయింట్లు, జల పాతాలు, ఇతర అటవీ అందాలను గుర్తిస్తున్నామని, పర్యావరణహిత పర్యాటకానికి అనువుగా ఉన్న ప్రాంతాలను అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీసీసీఎఫ్ పీ.కే.ఝా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *