వెంకటగిరి దుర్గం… యూట్యూబ్ చానెల్ లో మంచి వీడియో

వెంకటగిరి దుర్గం కోట కాదు, రహస్య స్థావరం మాత్రమే…

(జింకా నాగరాజు*)
ఈ మధ్య కాలంలో కుర్రవాళ్లలో యాత్రా స్పృ హ బాగా పెరిగింది. సోషల్ మీడియా  కల్చర్ బాగా ప్రాచుర్యంలోకి రావడంతో మాట్లాడేందుకు రాసేందుకు స్వేచ్ఛ వచ్చింది.పూర్వం పత్రికల్లో ఒక వ్యాసం రావాలంటే గొప్ప పండితుడో పరిశోధకుడో అయి ఉండాలి. పండితులు కాని వాళ్ళ అభిప్రాయాలకు పత్రికల్లో చోటే లేదు.
అయితే, యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ వంటి సోషల్ మీడియా ప్రసార సాధానాల మీద పండితుల మోనొ పలి పోయింది. స్టార్ట్ ఫోన్ ప్రతిఒక్కరు ఒక్కొక్క కొలంబస్ అయిపోయి దేశం మూలమూలలా గాలించి ఇంతవరకు మనిషి కంట పడని అనేక విచిత్రాలను వెలికితీస్తున్నారు. వెర్నాక్యులరైజేషన్ (vernacularization of media culture) అంటే ఇదే నేమో!
నిజానికి ఇలాంటి పని ప్రభుత్వం చేసి పర్యాటక రంగాన్ని పెంచి పోషించి నాలుగు డబ్బుల ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. మన ప్రభుత్వాలకు ఆ స్పృహలేదు.
దాంతో ఇపుడు సాధారణ పౌరులే ముందు కొచ్చి  కొండలు, గుట్టలు, అడవులు, కోనలు ఎక్కిిదిగి మనపక్కనే  దాగి ఉన్న ప్రకృతి , చారిత్రక వింతలను వెలుగులోకి తెస్తున్నారు. ప్రముఖ రచయిత భూమన్ ఈ మధ్య లెక్కలేన్ని ఇంతవరకు ప్రపంచానికి తెలియన అనేక తిరుపతి సమీప ప్రకృతి సౌందర్యాలను వెలుగులోకి తెచ్చారు. ఒక మచ్చు తునక ఇదిగో:
* భీమవరం జలపాతం… తిరుపతి పక్కనే అయినా ఎవరికీ తెలియని అద్భుతం
ఈ మధ్య నేను అనేక ఔత్సాహికల వీడియోలను యుట్యూబ్ (Youtube) లో చూశాను, వారు చేస్తున్న పని చూసి ఆశ్చర్యపోయాను. నేచర్ లవర్ నాగేంద్ర,ఆళ్ల గడ్డ రాజు వంటి వాళ్లు మనచుట్టూర ఉన్న ఎన్నో వింతలను వెలుగులోకి తీసుకువస్తున్నారు.
వెంకటగిరికి చెందిన నాగేంద్ర  (Nature Love Nagerndra)  Youtube channel చూశాను. ఆయన  వెంకటగిరి దుర్గం మీద చిత్రీకరించిన రెండు వీడియోలు చూశాక ఈ సమీక్ష రాస్తున్నాను.
తప్పకుండా ప్రోత్సహించాల్సిన Youtube channel అది. ఇందులో వీడియో చిత్రీకరణ చాలా బాగుంది.చిత్రాలు చాలా స్పష్టంగా, అందగా ఉన్నాయి. వీడియోగ్రాఫర్ అనుభవజ్ఞుడు కాదు,కేవలం ఎమెచ్యూర్ అని ఈ వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. అయితే,వీడియో క్వాలిటీలో  ఏ ప్రొఫెషనల్ కు తీసిపోని విధంగా ఉన్నాయి. వెంకటగిరి దుర్గాన్ని బాగా శోధించి రెండు వీడియోలను పోస్టు చేశారు. రెండు కూడా మంచి వీడియోలు.
Nature Lover Nagendra
వెంకటగిరి దుర్గంతో సమస్యేంటంటే, దీనిని గురించి సాహిత్యం పెద్దగా అందుబాటులో లేదు. ఈ దుర్గం కోట కాదు.  వెంకటగిరి రాజులెవరూ ఈ కోటని కేంద్రంగా చేసుకుని పరిపాలించ లేదు.ఉదాహరణకు గండికోటను తీసుకుందాం. కడప జిల్లా జమ్మలమడుగు సమీపాన పెన్నానది పక్కనే ఎత్తయిన కొండ మీద ఉన్న గండికోట ఒకపుడు పాలనా కేంద్రం.
వెంకటగిరి దుర్గం అలాంటిది కాదు. దుర్గం అని పేరున్నా ఇక్కడ కోట లేదు. బురుజులు లేవు. కొన్ని నిర్మాణాలున్నాయి. అవి కేవలం భవనాలే తప్ప పాలనా కార్యాలయాలు కాదు. మరి ఇవేంటివి? మొదటనిర్మాణాలెవరు చేపట్టారో కూడ సరిగ్గా తెలియదు.
దుర్గం అంచున…
వెంకటగిరి దుర్గం వెంకటగిరి పట్టణానికి ఏనిమిది మైళ్ల దూరాన ఉంటుంది. సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తున ఉన్న కొండమీద కట్టిన దుర్గం ఇది. Nature Lover Nagendra వంటి  సోషల్ మీడియా యాక్టివిస్టుల పుణ్యాన ఇక్కడికి ఇపుడు వందల సంఖ్యలో యువకులు ట్రెకింగ్ వెళ్తున్నారు. వెంకటగిరి దుర్గం ఇపుడు ప్రపంచానికి బాగా పరిచయమయినని ట్రెకింగ్ హబ్.  ప్రభుత్వానికి ఈ  పరిణామం గురించి ఇంకా తెలిసినట్లు లేదు. అందుకే ఇంకా దీనిని శ్రీలంక సిగిరియా కొండలాగా ఒక అద్భుతమయిన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్న దాఖలా లేదు. ఇది వేరే విషయం.
నాగేంద్ర, మేనల్లుడు శ్రవన్ ఈ దుర్గాన్ని జల్లెడపట్టి గాలించారు. నీళ్లకోసం వినియోగం లో ఉన్న ఒక సొరగంలోకి కూడా దూరి అక్కడ ఏలా ఉందో చూపించారు.ఇక్కడ శిధిల భవనాలను చూపించారు.చుట్టూర ఉన్న ఎత్తయిన పర్వతాలను, అడవులను, పరిసర ప్రకృతిని చాలా అందంగా చూపించారు వీడియో ఎంత క్లియర్ గా ఉందంటే, ఇది చూస్తే ఒక సారి తప్పని సరిగా వెంకటగిరి దుర్గం ఒక్క సారైనా ఎక్కి రావాలని పిస్తుంది.
సొరంగంలో…
ఈ దుర్గం ప్రస్తావన కొంత వెంకటగిరి రాజుల వంశచరిత్రలో కనబడుతుంది. అందులోనే ఇది రహస్య ప్రదేశమనేందకు ఆధారాలున్నాయి.
A Family History of Venkatagiri Rajas పేరుతో అల్లాడి జగన్నాథ శాస్త్రి (BA&LT) 1922లో ఒక అద్భుతమయిన పుస్తకం రాశారు. ఆయన వెంకటగిరి పట్టణంలోని RVM స్కూల్ హెడ్ మాస్టర్. ఈ పుస్తకం తెరిచి చదవడం మొదలు పెడితే పూర్తయ్యే దాకా మూయలేం.
ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఇలాంటి పుస్తకం రాశాడంటే నమ్మలేం. శాస్త్రి గొప్ప పరిశోధకుడని ఈ పుస్తకం చెబుతుంది. ఈ పుస్తకం లో 29 తరాల వెంకటగిరి రాజాల చరిత్ర ఉంది. ఆసక్తికరమయిన విషయమేంటంటే  ఆంధ్రప్రదేశ్ లోని జమిందారీ వెలమ కుటుంబాలన్నీ ఒకరే. వెలుగోడు, వెంకటరిగి, పిఠా పురం, బొబ్బిలి, కాళహస్తి పిల్లల మర్రి అన్ని ఒకే కుటుంబాలే.  ఒకరింట్లో పిల్లలు లేకపోతే, మరొక కుటుంబం నుంచి మరొకరు దత్తతతీసునే వాళ్లు. వెలమలు, వీళ్ల పేరు చివర నాయుడు ఉంటుంది. వీళ్ల వంశపూర్వీకుల్లో రెడ్డి అనే పేరుకూడా ఉంది.  11 వశతాబ్దంలో ఉన్న వంశ మూలపురుషుడి పేరు చెవిరెడ్డి. ఆయన మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రిలో ఉండేవాడు.
సరే, ఇపుడు మళ్లీ వెంకటగిరి దు ర్గం దగ్గిరికి వద్దాం. ఇది కోటకాదు,  ఒక రహస్య ప్రదేశం. శత్రువుల దాడులు జరుగతాయని అనుమానం వచ్చినపుడు రాజకుటుంబానికి చెందిన మహిళలను, సంపదను ఈ దుర్గానికి చేర్చి కాపాడుకునే వాళ్లు. అందుకోసమే దీనిని వాళ్లెపు డూ జనబాహుళ్యానికి దూరంగా ఉంచారు. ఇలాంటి సంఘటనొక దాన్నిజగన్నాథ శాస్త్రి ఈ పుస్తకంలో ఉదహరించారు (పేజీలు 83-84, 86,119).
1922 లో తీసిన ఫోటో. ఇపుడీ ఫిరంగి లేదు…
వెంకటగిరి రాజవంశానికి చెందిన బంగారు యాచమ నాయుడిని అర్కాట్ నవాబ్ (1753), ఢిల్లీ చక్రవర్తి(1755)లో  జమిందారుగా ప్రకటించారు.  ఈయన కాలంలో  వెంకటగిరి నిర్మాణాలు పట్టిష్టంగా జరిగాయి. వెంకటగిరి ప్రధాన రాజభవం నిర్మాణం కూడా 1775లో జరిగింది. అంతకు ముందుగానే   వెంకటగిరి పట్టణానికి ఎనిమిది మైళ్ల దూరాన ఉన్న వెంకటగిరి దుర్గం భవనాలనుకూడా ఈయన పటిష్టపరిచాడు. అక్కడ  మంచినీళ్ల వసతి కూడా ఏర్పాటు చేశాడు. కొండమీద రెండు కొత్త భవనాలను కూడా నిర్మించాడు. ఇక్కటి భవనాల చుట్టు భద్రతకోసం ప్రాకారం కూడా కట్టించారు. అంతేకాదు, తరచు మహమ్మదీయుల దాడులు జరుగుతున్నందున జమిందారీ ట్రజరీని కొండ మీదకు మర్చారు. ఈ కాలంలోనే ఈ కుటుంబం బ్రిటిష్ వారికి దగ్గిరయింది.  ఈ దశలో హైదర్ అలీకి వెంకటగిరి రాజాకు విబేధాలొచ్చాయి.రాజా బ్రిటిష్ వారితో  ఉండటం హైదర్ అలీకి నచ్చలేదు.బ్రిటిష్ వాళ్లు రాజాని అతిగా అభిమానిస్తూ ఉండటం కంట్లో కారం కొట్టినట్లుంది. ఆయన తర్వాత కుమార యాచమనాయుయడు రాజా అయ్యారు.  1782లో  కుమార యాచమనాయుడు మద్రాసులో ఉన్నపుడు హైదర్ కొంత సైన్యాన్ని పంపించి వెంకటగిరి ని దోచుకుని, రాజభవనాన్ని కాల్చి రమ్మన్నాడు. హైదర్ ఇలాంటిదేదో చేస్తాడని పసిగట్టి, రాజావారు తాను మద్రాసు వెళ్లేముందు  అంత:పుర స్త్రీలను,  సంపదను, విలువయిన రికార్డులను  వెంకటగిరి దుర్గానికి తరలించాడు. రాజా మద్రాసు నుంచి తిరిగొచ్చే సరికి పట్టణాన్ని హైదర్ మూకలు నాశనం చేసి వెళ్లారు. రాజభవనాన్ని ఆయన భారీ ఖర్చుతో పున: నిర్మించుకోవలసి వచ్చింది. అయితే, కుటుంబ సభ్యులను సంపదను కాపాడుకోగలిగాడు.
పూర్వం వెంకటగిరి దుర్గానికి, వెంకటగిరి పట్టణానికి సరైన దారి కూడా లేనట్టుంది. ఎందుకంటే, ఇది ఒక రహస్య స్థావరంగా వాడుకున్నారు కాబట్టి, ఇక్కడి మార్గం కనిపించకుండా చేశారు. కొండపైకిచేరుకునేందుకు మెట్లు మాత్రం ఉన్నాయి
శత్రువులు దాడి చేసే అవకాశం ఉన్నపుడల్లా అంత:పుర స్త్రీలను  ఇక్కడికి చేర్చి వారికి హాని జరగకుండా చూశారు. అందుకే  ఇక్కడ సాధారణంగా కోటల్లో కనిపించే ఎత్తయిన భారీ నిర్మాణాలు లేవు. ఉన్నవల్లా  కొన్ని భవనాలే. వాటిని అపుడపుడూ మరమ్మతులు చేసుకుంటూ వచ్చారు.
బ్రిటిష్ వాళ్ల కాలంలో ఇది జమిందారీ కుటుంబీకులకు, యూరోపియన్లకు వేసవి విడిదిగా పనిచేసింది. ఈ దుర్గాన్ని ఒకపుడు కలిమిలి దుర్గం అని పిలచే వాళ్లు. వెంకటగిరి పూర్వపు పేరు కలిమిలి. అపుడు గొబ్బూరి పాలెగాళ్లు ఈ ప్రాంతాన్ని పాలించేవాళ్లు.  వెంకటగిరి వంశానికి చెందిన 18వ తరం వెంకటాద్రినాయుడు గొబ్బూరి పాలెగాళ్లను ఓడించి  కలిమిలి ని స్వాదీనం చేసుకున్నాడు. వెంకటాద్రి నాయుడు విజయచిహ్నంగా ఈ వూరి పేరు వెంకటగిరి అయింది.  అయితే వంశానికి చెందిన 23 వ తరంలోనే వెంకటగిరి సంస్థానానికి రాజధాని అయింది.

 

 

 

(*జింకా నాగరాజు, పూర్వం Times of India, Asianet (Telugu)లో పని చేశారు. ప్రస్తుతం thelede.in కన్సల్టెంట్ ఎడిటర్ గా ఉంటున్నారు.)