Home Features శిథిల సౌందర్యం, చంద్రగిరి దుర్గం (తిరుపతి జ్ఞాపకాలు-4)

శిథిల సౌందర్యం, చంద్రగిరి దుర్గం (తిరుపతి జ్ఞాపకాలు-4)

252
0
SHARE
(తెలంగాణ నుంచి వచ్చి తిరుపతిలో  స్థిరపడిన  ప్రముఖ జర్నలిస్టు,రచయిత ఆలూరు రాఘవ శర్మ తన తిరుపతి జ్ఞాపకాలను షేర్ చేస్తున్నారు.)
(రాఘ‌వ శ‌ర్మ)‌
మేం పెరుమాళ్ళ పల్లెకు వచ్చి అప్పుడే రెండు నెలలవుతోంది.
ఆ రోజు పొద్దున్నే సైకిళ్ళ పైన చంద్రగిరి బయలు దేరాం, నేను శంకర్ రెడ్డి, సుబ్రమణ్యం. అది 1973 ఆగస్టు నెల.
పెరుమాళ్ళ పల్లె నుంచి చంద్రగిరి (Chandragiri Fort) అయిదారు కిలో మీటర్లు ఉంటుంది.శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధాని కదా !
చంద్రగిరి ఎలా ఉంటుంది !?
చంద్రగిరి లోకి ప్రవే శించాం. ఊ రు చాలా సాదా సీదాగా ఉంది. అప్ప‌టికి (1973) అదొక పెద్ద గ్రామమే.
“తిమ్మరుసు ఊరు అబ్బా ఇదీ… ఈడ నే చదువుకున్నా డంట ” అన్నాడు సుబ్రమణ్యం ఆ ప‌రిస‌ర‌ ప్రాంతంలో నివ‌సిస్తున్నందుకు చాలా గర్వప‌డుతూ .
ఊరు దాటుకుని వచ్చాం. చిత్తూరు వెళ్లే రోడ్డులో కుడి వైపు చంద్రగిరి కోటకు వెళ్లే దారి.
దూరంగా కోటకు చుట్టూ పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన ఎత్తైన కోట గోడలు . వాటికి బురుజులు. దాని చుట్టూ పూడిపోయిన లోతైన కందకం.
ఆ దారిలో కాస్త ముందుకు వెళితే ఎదురుగా దేవాలయం. ఆలయానికి ఎదురుగా పెద్ద రావి చెట్టు. దాని చుట్టూ పెద్ద తిన్నె.
అది శత్రు దుర్భేద్యమైన కోట. ఆలయం పక్క నుంచి కోట లోనికి ప్రవేశించడానికి ఇరువైపులా పెద్ద పెద్ద బండ రాళ్లతో నిర్మించిన కోట గోడలు. చాలా మలుపులు తిరిగి ఉన్నాయి.
శత్రువు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే గోడల పైనుంచి దాడి చేయ డానికి అనుకూలంగా నిర్మించారు.
దారి మలుపులు పూర్తి కాగానే, రాతితో చెక్కిన పెద్ద సింహ ద్వారం. ద్వారం నుంచి లోపల వైపు ఒక పెద్ద రాతి మండపం.
మళ్లీ మామూలు రహదారి. కోటలోకి ప్రవేశించాక కోట గోడలు కనిపించవు. నేల నుంచి కోట గోడల వరకూ ఏ ట వాలుగా ఉంది. లోపలి నుంచి మామూలుగా నడుచుకుంటూ నే కోట గోడ పైకి చేరుకోవచ్చు.
ఇరవై అయిదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోట ఆవరణలో అనేక శిథిల దేవాల‌యాలు, ఎన్నో నిర్మాణాలు.
మరి కొద్ది దూరం వెళ్ళ గానే మళ్లీ రహదారి మలుపులతో ఉంది. రాతితో నిర్మించిన మరొక ద్వారం, దానిని ఆనుకుని పెద్ద రాతి మండపం.
కాస్త దూరం వెళ్ళగానే లేత గులాబీ రంగులో ఎత్తైన రాజమహల్. ఒక వెలుగు వెలిగిన ఆ రాజమహల్ ఎలాంటి ఆలనా పాలనా లేకుండా ఇప్పుడొక ( 1973) అనాథ లాగా ఉంది.
రాజులు, రాణులు, అష్ట దిగ్గజాల వంటి కవి పండితులు కొలువు దీరిన ఈ రాజ్ మహల్ లో పావురాలు కాపురాలు పెట్టాయి.
ఆ తరువాత కొన్నేళ్ళకు ఈ కోటను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది. దాని చారిత్ర విష‌యాలు త‌రువాత తెలుసుకున్నా.

Read this also

*శ్రీ‌వారి మెట్టు – మహద్వారం (తిరుప‌తి జ్ఞాప‌కాలు-3)

*స్నేహ గవాక్షం పెరుమాళ్ళపల్లె (తిరుపతి జ్ఞాపకాలు-2)
*వనపర్తితో ప్రారంభం (తిరుపతి జ్ఞాపకాలు-1)

నారాయణ వనాన్ని పాలించిన నారసింగ దేవరాయ 12 వ శతాబ్దంలో ఈ చంద్రగిరి దుర్గాన్ని నిర్మించాడు.
సాళువ వంశస్థులు ఈ దుర్గాన్ని 15 వ శతాబ్దంలో విస్తరించారు.
ఇందలి నిర్మాణాలన్నీ 16, 17. శతాబ్దాలలో నిర్మించినవే.
ఆ పరిసర ప్రాంతాలలో దొరికిన శతాబ్దాల నాటి శిల్పాలు, కంచు విగ్ర‌హాలు, ఆయుధాలు, ఉపయోగించిన ఇతర సామాగ్రిని సేకరించి మ్యూజియం ఏర్పాటు చేశారు.
ఇటుక, కొయ్య ఉపయోగించ కుండా దీన్ని కొండరాయి, సున్నంతో నిర్మించారు.
రాజ్ మహల్ మొదటి అంతస్తు మధ్యలో రాజు కొలువు తీరే ద‌ర్బారు హాలు. రాణులు, రాజ పరివారం మూడవ అంతస్తు నుంచి ద‌ర్బారు హాలులో రాజాస్తానాన్ని వీక్షించడానికి అనుగుణంగా ఏర్పాటు చేశారు.
రాజ్ మహల్ పైకి ఎక్కితే మధ్యలో పెద్ద మండపం,ఎత్తైన , అందమైన పైన గోపురం.
మండపం మధ్యలో రాజపరివారం ఉయ్యాల ఊ గడాని కి అనుగుణంగా ఏర్పాటు చేసినట్టు ఉంది.
పైకి ఎక్కి ఉత్తరాభిముఖంగా చూస్తే ఎత్తైన కొండ. కొండ అంచుల్లో కోట గోడలు, బురుజులు. మొత్తం భద్రతా వలయంలో ఉన్న చక్రవర్తిని, అతని పరివారాన్ని ఈ కొండ తన బాహువుల్లో భద్రంగా కాపాడుతున్నట్టు ఉంటుంది.
కొండ అంతా ఏ ట వాలుగా బండ. ఆ బండపైనుంచి పడిన వర్షపు నీళ్లతో కింద సహజ సిద్ధంగా ఏర్పడిన కోనేరు. దాని నిండా తామరాకులు, తామ‌ర‌ పూలు.
కోనేరు లో దిగడానికి మూడువైపులా రాతి మెట్లు.  కోనేరు నిండితే నీళ్ళు బైటికి పోవడానికి కాలువ. మండు వేసవిలో కూడా కోనేరులో నీళ్ళు ఉంటాయి.
రాజ మహల్ కు ఈశాన్య దిక్కున మరొక నిర్మాణం రాణిమహల్.
రెండంతస్తుల ఈ రాణి మహల్ లో రాణులు నివసించడానికి అనువైనది కాదు. బహుశా సైన్యాధిపతి, అంగరక్షకులు సర్వ సన్నద్ధంగా ఉండడానికి అనుగుణమైన నిర్మాణం కావచ్చు.
ఈ దుర్గం ఎక్కు దాం అన్నాడు శంకర్ రెడ్డి. సరే అని ముగ్గురం బయలు దేరాం.
రాణి మహల్ కు ఈశాన్య వైపు నుంచి దుర్గం పైకి వెళ్లే కాలి బాట ఉంది.
కాస్త దూరం వెళ్ళ గానే పురాతన కాలంలో రాతితో చాలా అందంగా నిర్మించిన బావి కనిపి స్తుంది. బావి నుంచి ఉత్తర దిశగా దుర్గం పైకి వెళుతున్నాం.
కాస్త ముందుకు వెళితే కుడి వైపున గుట్ట పైన చిన్న గంటా మండపం.  ఇక్కడ గంట మోగి స్తే రాజమహల్ లో వినిపించేదట. ఇది బహిరంగంగా ఉరి తీసే ప్రాంతమని ప్రజల్లో ఒక‌ ప్రచారం కూడా ఉంది.
ఎడమవైపున‌ ఏట వాలుగా కొండపైకి నడక దారి. కాస్త ముందుకు వెళితే సుందరమైన రాజమహల్, దాని ముందు కోనేరు. ఆ పక్కనే రాణి మహల్ కనిపిస్తాయి.
కోనేరు ముందు కొండపైనుంచి ఏ ట వాలుగా ఉన్న బండ. ఏ మాత్రం జారామా దొర్లుకుంటూ వెళ్ళి కోనేరులో పడిపోతాం.
కోట చుట్టూ రాతితో నిర్మించిన ఎత్తైన కోట గోడ కొండ అంచుల వరకు ఉంది.

Like this story? Share it with a friend!

ఈ రాజమహల్ కు తూర్పు నుంచి వచ్చిన ప్రధాన ద్వారం లాగానే , పడమటి దిక్కున కూడా పెద్ద ద్వారం ఏర్పాటు చేశారు.
అనేక మ‌లుపులు తిరుగుతూ, వాయువ్య దిశ‌గా ప‌య‌నిస్తూ, కాస్త నిటారుగా సాగితే ఎదురుగా ఎత్తైన కోట బురుజు.
బురుజు ప‌క్క నుంచి రాళ్ళ‌తో నిర్మించిన మెట్ల దారి.
లోనికి ప్ర‌వేశిస్తే ఎదురుగా శిల్పాలు చెక్కిన మండ‌పాలు.
ఒక నాడు ర‌క్ష‌ణ వ‌ల‌యంలో ఉన్న మండ‌పాలు ఇప్పుడు నిర్మానుష్యంగా , శిథిల‌మై, పిచ్చిమొక్క‌లు పెరిగి బావురుమంటున్నాయి. రాతి మండ‌పాల‌పై ద‌శావ‌తారాలు చెక్కి ఉన్నాయి.
మండ‌పం దాటాక ఏట‌వాలుగా పెద్ద బండ‌. జాగ్ర‌త్త‌గా ఎక్కాలి. తోస్తే కింద‌కు దొర్లి పోతాయా అన్న‌ట్టు ఉంటాయి.
గోడ‌ప‌క్క‌నే లోనికి వెళ్ల‌డానికి పెద్ద రాతి ద్వారం. మ‌ళ్ళీ శిథిల మండ‌పం. దీని పైన కూడా శిల్పాలు చెక్కి ఉన్నాయి.
ఇక్క‌డ నుంచి ఓపిక‌గా కొండ నిట్ట నిలువునా ఎక్కాలి. పై కొచ్చేశాక రెండు పెద్ద పెద్ద బండ రాళ్ళ మ‌ధ్య లోతైన కోనేరు.
ఈ కోనేట్లో వేస‌విలో కూడా నీళ్ళుంటాయి. కోనేరు నిండా ప‌చ్చ‌ని బోద పెరిగింది.
ఈ మ‌ధ్య‌నే ఈ కోనేరులో ప‌డి ఇద్ద‌రు యువ‌కులు మ‌ర‌ణించారు.
కొండ‌పైన కూడా ఈ దుర్గం చుట్టూ ర‌క్ష‌ణ వ‌ల‌యంగా నాలుగడుగుల రాతి గోడ నిర్మించారు. ఆ రాతి గోడ‌కు అక్క‌డ‌క్క‌డా బురుజులు.
కొండ ప‌డ‌మ‌ర వైపున‌కు వెళితే రంగంపేట‌, నారావారి ప‌ల్లె, ఒక‌ప్పుడు క‌ళ్యాణీ న‌ది పారిన ఆన‌వాళ్ళు క‌నిపిస్తాయి.
ఈ క‌ళ్యాణి న‌దే స్వ‌ర్ణ ముఖిలో క‌లిసి స‌ముద్రంలో క‌ల‌వ‌డానికి ముందుకు సాగుతుంది.
క‌ళ్యాణి డ్యాం క‌ట్టాక క‌ళ్యాణి న‌ది పూర్తిగా ఎండిపోయింది.
కొండ‌కు ఈశాన్య దిక్కున తిరుమ‌ల‌కు వెళ్ళే శ్రీ‌వారి మెట్టు దారి క‌నిపిస్తుంది.
కొండ‌పైన ఒక ర‌హ‌స్య ప్రాంతంలో చిన్న నీటి గుంట క‌నిపించ‌కుండా చుట్టూ చిన్న క‌ట్ట‌డాన్ని నిర్మించారు.
ఒక్క మ‌నిషి మా త్ర‌మే లోనికి దిగ‌డానికి వీలైన రంద్రం ఏర్పాటు చేశారు.
ఆ గుంట‌లో నీళ్ళ‌ను రెండుగా విభ‌జించేలా మ‌ధ్య‌లో చిన్న పిట్ట గోడ నిర్మించారు.
దానికి ఒక ప‌క్క నీళ్ళు ఉప్ప‌గా ను, మ‌రొక ప‌క్క చ‌ప్ప‌గా ఉంటాయి.
దీన్ని ఉప్పు శెట్టి ప‌ప్పు శెట్టి అంటారు.
ప‌డ‌మ‌ర దిశ‌గా వెళితే ఒక రాతి బండ‌కు పెద్ద చీలిక‌. తొంగి చూస్తే ప‌డిపోతామేమోన‌న్న భ‌యం .
తొలి సారి నేను శంక‌ర్ రెడ్డి, సుబ్ర‌మ‌ణ్యం క‌లిసి వెళ్ళిన‌ప్పుడు (1973) ఆ రాతి చీలిక‌లో మ‌నిషి శ‌వం క‌నిపించింది. కాస్త భ‌య‌ప‌డ్డాం.
బ‌హుశా తెలిసిన వాళ్ళే పైకి తీసుకొచ్చి చంపేసి ఆ రాతి చీలిక‌లో ప‌డేసి ఉండ‌వచ్చు.
ఆ దుర్గం ఎప్పుడు ఎక్కినా 47 ఏళ్ళ క్రితం చూసిన దృశ్యం క‌ళ్ళ ముందు మెద‌లాడుతుంది.
పురావ‌స్తు శాఖ వారు దుర్గం పైకి రోడ్డు నిర్మిస్తున్నారు. అనుమ‌తి లేనిదే ఎవ‌రూ ఎక్క‌డానికి వీలు లేదు.
చంద్ర‌గిరి దుర్గం ఒక నాటి రాచ‌రిక వ‌ర్గాల‌కు స్వ‌ర్గం.
నే డది గత వైభవ చిహ్నం.
Raghava Sarma

(సీనియర్ జర్నలిస్ట్ రాఘవ శర్మ వివిధ పత్రికల్లో, వివిధ జిల్లాల్లో పనిచేశారు. ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, వర్తమానం, వార్త, సాక్షి పత్రికల్లో స్టాఫ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్ గా, సీనియర్ సబ్ ఎడిటర్ గా పని చేసి ఏడేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు .తిరుపతి, విజయవాడ, హైదరాబాదు, నెల్లూరు, ఏలూరు, కాకినాడ ప్రాంతాలలో పని చేశారు. వివిధ పత్రికల్లో రాజకీయ, సాహిత్య, సామాజిక అంశాలపై అనేక కథనాలు రాసారు . చైనా ఆహ్వానం మేరకు భారత – చైనా మిత్రమండలి తరపున 2015 లో ఆ దేశంలో పర్యటించారు. ఆ పర్యటనానుభవాలతో ‘ ఓ కొత్త బంగారు లోకం ‘ అన్న పుస్తకాన్ని రాసారు. చిత్తూరు జిల్లా సాహితీ దిగ్గ జాల గురించి తన సంపాదకత్వంలో _’ సాహితీ సౌ గంధం ‘ అన్న పుస్తకాన్ని వెలువరించారు. కోస్తా జిల్లాల్లో పుట్టి, తెలంగాణా లో పెరిగి, రాయలసీమ ( తిరుపతి ) లో స్థిరపడ్డారు)