Home Features ‘జిగిరి’ నవల ఎందుకు చదవాలంటే… లోమాటి వివేకా పుస్తక సమీక్ష

‘జిగిరి’ నవల ఎందుకు చదవాలంటే… లోమాటి వివేకా పుస్తక సమీక్ష

59
0
SHARE
నవలంతా కరీంనగర్ యాసలో సాగుతున్నప్పటికీ అది ఎక్కడా అడ్డంకి కాదు. పాత్రలతో పాటు మన ప్రయాణమూ మొదలవుతుంది.
(వివేకానందరెడ్డి లోమాటి)
మన చుట్టూ సమాజం తాలూకు ఆలోచనలు కొన్ని చిన్నప్పటి నుండి మనతో పాటు అలా ప్రయాణిస్తూ ఉంటాయి. అవి బయట ఎవర్నైనా అడిగి తెలుసుకునేంత పెద్దవయి ఉండవు అలాగని వదిలేసేంత చిన్నవి కాదు. మెదల్లలో అలా నిక్షిప్తమై ఉంటాయి. అదే పనిగా వాటి గురించి ఎంత వెతికినా సమాధానం దొరకదు గానీ ఒక్కోసారి మనం చూస్తున దృశ్యాలో లేక మనం చదువుతున్న పుస్తకాలో యాదృచ్చికంగా అందులోని మర్మాన్ని బయటపెడతాయి. అచ్చంగా అలాంటిదే ఈ జిగిరి.
నాకు చిన్నప్పటి నుండి కుక్కల పట్ల అలాంటి సందేహమే ఉండేది(ఇప్పటికీ). నాకు బాగా గుర్తు అప్పట్లో ఒక కుక్కకు రోజూ నేను ఎంత బువ్వ పెట్టినా నా పట్ల అంటీ ముట్టనట్టుండేది గానీ మా ఊర్లోనే ఒకడు దాన్ని బానిసలా చూసినా, కొట్టినా ఆఖరికి బువ్వ పుట్టకున్నా కూడా ఎప్పుడూ వాడి వెంటే తిరిగేది. కుక్కలు విశ్వాసంగా ఉంటాయని తెలుసు గానీ మరి నేను కూడా బువ్వ పెడ్తున్నాను గదా నా వెంట రాదెందుకు అని.. ముందల్లా తెలిసేది కాదు గానీ ఈ జిగిరి చదివిన తర్వాత నాకు అర్థమైంది నాకు ఆ కుక్కకు మధ్య కొరవడిందేదో..
కూటి కోసం కోటి విద్యలన్నట్టు వీధుల్లో ఎలుగుబంటిని ఆడించి, పిల్లలకు గాలి ధూలి సోకకుండా దాని చేత వెంట్రుకల తాయత్తును పిల్లలకు కట్టిస్తూ పొట్ట నింపుకునే నేపథ్యం ఇమామ్ కుటుంబానిది. తాతల కాలం నుంచి అదే వారసత్వం. ఇమామ్ తండ్రి మరణించిన రోజే అప్పటిదాంకా తన ఆటలతో తిండి పెట్టిన ఎలుగు కూడా చనిపోతుంది. ఎలా ఎలా అంటుండగా పక్కన అడవిలో ఉన్న ఒక ఎలుగు పిల్ల గురించి తెలుస్తుంది. అది నెలల పిల్ల. రెండ్రోజుల పాటు ఎంతో శ్రమ పడి, చాకచక్యంగా తల్లి ఎలుగు నుంచి వేరు చేసి ఇంటికి తెస్తారు. దానికి ముద్దుగా షాదుల్ అని పేరు పెట్టుకుంటారు.
అడవిలో పుట్టిన జీవం అయిందాన బయటి ప్రపంచానికి అలవాటు పడలేక కొద్దిరోజులకే జీవితం చివరి అంచుకు వెళ్తుంది. ఆకు మందులు, ఆవు పాలు ఎన్ని పోసినా కోలుకోలేక పోతే చివరికి ఇమామ్ భార్య బూబమ్మ తన పాలు పట్టిస్తుంది. ఒక రొమ్ము పాలు తన కొడుకు చాంద్ కు మరో రొమ్ము పాలు షాదుల్ కు. అప్పట్నుండి నాకు ఇద్దరు కొడుకులు అనుకుంటుంది బూబమ్మ. చాంద్ షాదుల్ కూడా అన్నదమ్ముల్లలా కలిసి ఆడుకుంటారు. అది కోలుకుంటుంది. చూస్తూ చూస్తుండగానే పెరిగి పెద్దదై ఆటలన్నీ నేర్చి ఇమామ్ కుటుంబానికి అండగా నిలబడుతుంది. మధ్యలో ఒకసారి షాదుల్ కు జబ్బు చేస్తే కొడుకును ఒక భుజాన, షాదుల్ ను మరో భుజాన వేసుకుని అంతలక్కలా తిరిగి బతికించుకుంటుంది.
కాల గమనంలో ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ ఇరవై సంవత్సరాలు షాదులే ఇమామ్ కుటుంబాన్ని ఆదుకుంటుంది. చాంద్ కు వేరే స్నేహితులు లేరు షాదుల్ తప్ప. అంత అభిమానంగా సాగిపోతున్న వారి జీవితంలో ప్రభుత్వమిచ్చే రెండెకరాల భూమి చిచ్చు పెడుతుంది.
ఆ ఊరికి కొత్తగా వచ్చిన వీరి కులపు ఎస్సై అడివి జంతువులను పట్టుకుని ఆడించడం నేరం మీరు ఎలుగుబంటిని వదిలేస్తే మీకు ప్రభుత్వ భూమి ఇప్పిస్తా అని చాంద్ కు చెప్తాడు. ఇంకెన్నాళ్లు ఈ సంచార జీవితం అనిపించిందేమో షాదుల్ చచ్చిపోయిందని ఎస్సైకి అబద్దం చెప్తాడు. అప్పటి వరకూ షాదుల్ ని కన్న కొడుకులా పెంచిన బీబమ్మ కూడా పేగు బంధం వైపే మొగ్గు చూపుతుంది.
అక్కన్నుంచి మొదలవుతుంది అసలు సంఘర్షణ. ప్రభుత్వం ఇచ్చే రెండెకరాల భూమి కోసం ఇరవై సంవత్సరాల పాటు తమకు కూడు పెట్టిన షాదుల్ ను వదిలిపెట్టడానకి ఇమామ్ కు మనసొప్పదు. చాంద్ మొండిచేస్తాడు. ఉంటే షాదుల్ గాడైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలని పట్టబడతాడు. వాళ్ల పోడు తట్టుకోలేక అడివిలో వదులుతాడు. అడవిని వదిలేసిన షాదుల్ అక్కడ బతకలేక తిరిగి ఇంటికి వస్తాడు. బామ్మర్దులకు అమ్మమని చెప్తారు. అదీ కుదరదు. బతికుండగానే పూడ్చి పెడతా అని ఇంటి ముందరే గుంత తొవ్వుతాడు. వద్దులే అని ఎర్రిమందు పెడతానని అడవికి తొడుకోనిపోతాడు. పెట్టడానికి మనసొప్పక మందు పని చేయడం లేదని ఇంటికొచ్చి అబద్ధం చెప్తాడు ఇమామ్. ఒప్పుకోడు చాంద్. అది తినే అన్నంలో సెనైడ్ కలపాలని మందు తెస్తాడు. బతకాల్సినోడిని నువ్వెందుకులే ఆ మందు నేనే పెడతా అని అంటాడు ఇమామ్. మనసొప్పదు. చివరికి ఏం చెయ్యలేక అడవిలో పెట్టి అక్కడే చంపేస్తా అని ఇంటినుంచి బయల్దేరిన ఇమామ్ ఇంటికి తిరిగిరాడు. అక్కడితో ముగుస్తుంది. క్లుప్తంగా ఇదీ కథ.
చదివిన చాలాసేపటి వరకూ షాదుల్, ఇమామ్ మాయ నుంచి బయటికి రాలేము. అక్కడే రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారి ఔచిత్యం తెలుస్తుంది. పాత్రల మధ్య సంఘర్షణని, ప్రేమానుభూతుల్ని ఎంత సహజంగా చిత్రీకరించారని. నవలంతా కరీంనగర్ యాసలో సాగుతున్నప్పటికీ అది ఎక్కడా అడ్డంకి కాదు. పాత్రలతో పాటు మన ప్రయాణమూ మొదలవుతుంది.
ఒకసారి షాదుల్ కు జబ్బు చేస్తుంది. వానికి బాగవ్వడం కోసం ఇద్దర్నీ భుజానేసుకుని వర్షంలో తిరిగితే చాంద్ కు జ్వరమొస్తుంది. ఇమామ్ కోప్పడతాడు. బీబమ్మ మాత్రం భయపడేలేదు “వీనికేంది… నాలుగు బుక్కలు పాలు ఎక్కువ ఇత్తే జరం గిరిం అంత పోతది. కాదంటే రెండు గోళీలు ఏత్త. షాదుల్ గాని పాణమెట్ల” అని తండ్లాడింది.
అశోక్ కుమార్ గారు పాత్రల మధ్య ఎంతగా లీనమైపోయాడు అని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించిన బీబమ్మ, సొంత అన్నలా భావించిన చాంద్ లు షాదుల్ వదిలించుకోవడానికి చేసే ఆలోచనలు, షాదుల్ మీద ప్రేమను చంపుకోలేక ఇమామ్ పదే మానసిక వేదన అత్యంత హృద్యంగా చిత్రీకరించాడు రచయిత. తెలుగు సాహిత్య ప్రియులు, మరీ ముఖ్యంగా అడవి ప్రేమికులు తప్పక చదవాల్సిన నవల.
Vivekananda Reddy Lomati

(వివేకానందరెడ్డి లోమాటి, వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అయితే, కడప మాండలికంలో కథలు రాస్తాడు. పుస్తక పరిచయం చేస్తాడు. విపరీతంగా పుస్తకాలు చదువుతాడు. అడవన్నా, చెట్లుచేమలన్నా అక్కడ మసలే జంతువులున్నా, పక్షలన్నా వివేకాకు చాలా ఇష్టం.  ఏ  పని చేసిన అందులో వివేకా ముద్ర ఉంటుంది. అదే వివేకా విశేషం. సొంతవూరు బద్వేల్ దగ్గిర నందిపల్లె.)