తిరుమలలో మొట్టమొదటి స్కామ్ 215 సంవత్సరాల కిందట జరిగింది, ఏంటది?

ఈ విషయం చాలా మందికి తెలియదు, ఒకప్పుడు భారతదేశాన్ని పరిపాలించిన ఈస్టిండియా కంపెనీ దక్షిణ  భారత దేశంలో ఆలయ పరిపాలనను బాగా మెరుగుపరిచింది.
జమిందారులనుంచి, రాజులనుంచి భూభాగాన్ని కంపెనీ ఏలుబడిలోకి తీసుకున్నా ఆలయాల విషయంలో చాలా ఆదర్శవంతమయిన విధానం  పాటించారు నాటి పాలకులు. మొదట్లో ఆలయాలను అజమాయిషీ చేసినా 43 సంవత్సరాలకాంలోనే ఇది సరైన పద్ధతి కాదు, హిందూఆలయాలో ప్రభుత్వం జోక్యం వద్దని  గుర్తించారు. ఆలయాల పరిపాలన నుంచి కలెక్టర్లను ఉపసంహరించుకున్నారు. అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులొస్తే విచారణ చేసి దోషులను శిక్షించారు.
ఈ విషయంలో కొత్తగా జిల్లాల పాలకులుగా వచ్చిన కలెక్టర్లు కేవలం రాబడి పెంచేందుకు ఆలయాలకు సంబంధించి తీసుకున్న చర్యలను   కూడా తోసిపుచ్చింది.  ఆలయాల పూజలు కుంటువడకుండా నిధులను మంజూరుచేసింది.
ఈస్టిండియాకంపెనీ ప్రభుత్వం రాగానే దక్షిణ భారత దేశాన్ని జిల్లాలుగా విభజించి, జిల్లాకొక కలెక్టర్ ను నియమించి,కంపెనీకి రావలసి రెవిన్యూ వసూళ్లు  మొదలు పెట్టారు.
ఈ కలెక్టర్లు చాలా చోట్ల ఆలయాలకు వెళ్తున్న ఆదాయాలను  ప్రభుత్వతానికి మళ్లించారు.  అపుడు బోర్డ అఫ్ రెవిన్యూ జోక్యం చేసుకుని కలెక్టర్ల  సిఫార్సులను తోసిపుచ్చి, గుళ్లకు పూజలకు, అర్చకుల జీతాలకు వార్షిక ఆర్థికసాయం చేసింది. కోస్తాలోని పలు ఆలయాలకు ఇలా వార్షిక నిధులు రెండు వేల రుపాయల నుంచి మూడు వేల రుపాయల దాకా అందాయి.
ఉదాహరణకు తిరుపతి గుడిలో ఒక వివాదం వచ్చింది.  తిరుపతి గుడి మొత్తం కాంట్రాక్టర్ల చేతిలో ఉండేది. ఈస్టిండియా కంపెనీ వచ్చాకా కూడా ఇదే విధానం కొద్ద రోజులు కొనసాగింది. అంటే సేవలని ఒక్కొక్క కాంట్రాక్టర్ కి  అప్పగించే వాళ్లు. పూర్వం ఆర్కాట్ నవాబుకు, తర్వాత ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ రెంటు చెల్లించే వారు.

చిత్తూరు జిల్లా( అపుడు నార్త్ ఆర్కాట్ జిల్లా, జిల్లా కేంద్రం చిత్తూరు) కలెక్టర్ జార్జ్ స్ట్రాటన్ శ్రీనివాసరావు అనే కాంట్రాక్టర్ టెండర్ ని మద్రాసు ప్రభుత్వానికి రికమెండ్ చేశాడు. ప్రభుత్వం  ఈ కాంట్రాక్టర్ ను ఎంపిక చేయలేదు. అంతేకాదు, ఈ  సేవల నుంచి ప్రభుత్వానికి రాలసిన రెంట్ మొత్తాన్ని మాఫీ చేసింది.
ఇలాగే శ్రీవారి సొమ్ము కాజేస్తున్నవారి మీద కూడా ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

Like this story? Share it with a friend!

తిరుపతి వెంకన్న సొమ్మున కాజేస్తున్న మొదటి కుంభకోణం 1805లో బయటపడింది. 1813 దాకా  దేవుడి సొమ్ము కాజేస్తున్న వారిమీద 150 పిటిషన్లు  గవర్నర్ –ఇన్ –కౌన్సిల్ కు అందాయి.
 శ్రీనివాస తాతాచార్లు (Rayagooroo Latchmy Camra Streenivasa Tatacharloo) అనే వ్యక్తి గాడిచర్ల వెంకన్న అనే మరొకరితో కలసి ఈ పిటిషన్లు వేశాడు.
తిరుపతి గుడిలో నిధుల దుర్వినియోగం జరుగుతున్నదని, దేవుడి అభరణాలను కూడా దొంగలిస్తున్నారని, అక్రమంగా కొన్ని రకాల పనులు చేపడుతున్నారని  వారు   ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.  తాము ఈవిషయాలను అధికారులు దృష్టికి తీసుకు వెళ్లామని,  కలెక్టర్ గాని, జడ్జి గాని వారి సిబ్బంది గాని తాము లేవనెత్తిన అంశాల మీద చర్య తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. అందువల్ల తాము పిటిషన్లలో పేర్కొన్న అంశాల మీద విచారణ జరిపి చర్య తీసుకుని ఆలయాన్ని , భక్తుల మనోభావాలను కాపాడాలని వారు పిటిషన్లలో పేర్కొన్నారు.
తమ ఫిర్యాదుల మీద అధికారులేమయినాచేసుంటే అది నామమాత్రంగా విచారణ చేయడమేనని,  తర్వాత  అక్రమాలను నిర్లక్ష్యం చేశారని వారు కలెక్టర్, తదితర అధికారుల గురించి కూడా పిటిషన్లో  పేర్కొన్నారు.
‘వాళ్ళని  మీరు నియమించింది న్యాయం జరగాలని. కాని వాళ్లు, వాళ్ల కింది అధికారులు, వాళ్ల సిబ్బంది వారి వారి ఇష్టాను సారం ప్రవర్తించి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. దీనితో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందువల్ల మీరు తిరుపతి ఆలయంలో జరుగుతున్న అక్రమాల మీద బోర్డాఫ్ రెవిన్యూ నుంచి  విచారణ జరపాలి,’ అని కోరారు.
“… you have appointed them to distribute justice, but they as well as the people under them, do great injustice according to their pleasure by which the country is much alarmed, you will send for our petitions and make a proper enquiry, whereby the company will derive advantage and the pagoda will be put in a state of improvement… If your honour should not think it necessary to make enquiry placing your confidence in their representation, great anarchy would prevail. The Officers appointed by your honour and their people do one and report another to your honour”.
తాతాచార్లు  చేసిన ఫిర్యాదులోని అంశాలు:
  1. తిరుమల ఆలయం స్టోర్ రూం ను పర్యవేక్షిస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడి, దేవుడికి ఎక్కువ మొత్తం ఖర్చు చేసినట్లు దొంగలెక్కలు చూపి 5 వేల పగోడాలు కాజేశారు.
  2. ఆలయానికి సరుకులు సరఫరా చేస్తున్న వ్యాపారస్తులు తూనికలు, కొలతల్లోనే కాకుండా ధరల విషయంలో కూడా మోసం చేశారు.
  3. దేవుడి అభరణాలను దొంగిలించారు.
  4. ఆలయ సేవకులు ప్రభుత్వం నియమాలను ఉల్లంఘించి అక్రమాలకుపాల్పడుతుండటంతో అటు ప్రభుత్వానికి రెవిన్యూ తగ్గింది. ఇటు ఆలయ ఆదాయం పడిపోయింది. ఆలయం అభాసు పాలయింది.
  5. ఆలయ అధికారులు లంచాలు తీసుకుని ఆలయ పరిసరాల్లో నివసించే వారి రెంటు తగ్గించారు. ఎవరైనా పేదలు రెంటు చెల్లించలేకపోయినా, కనికరం లేకుండా వీళ్లే రెంటు పూర్తిగా వసూలు చేసుకుని కాజేశారు.
ఇలాంటి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయవద్దని  కంపెనీ ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. దీనితో కలెక్టర్  విచారణ కోసం తగిన ఆధారాలు తీసుకుని రావాలని పిటిషనర్లను కోరారు.
1812లో నార్త్ ఆర్కాట్ కలెక్టర్ బోర్డ్ ఆఫ్ రెవిన్యూకు ఇలా రిపోర్ట్ చేశాడు: “ఉగ్రాణం (Store room) ఇన్ చార్జ్ గా ఉన్న శీనయ్య, మోత్రుడ్డి రామారావు అనే ఇద్దరు  ఉద్యోగులు  ఆలయ సొమ్మును బాగా కాజేశారు. 1805 జూలై 12 నుంచి 1810 ఫిబ్రవరి 24 మధ్య సుమారు నాలుగున్నర సంవత్సరాల పాటు వారు అక్రమాలకు పాల్పడ్డారు. కాని, దీనితో  డిపార్టమెంటులో అక్రమాలు జరిగాయని తెలిసిన మరుక్షణం వారిద్దరిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశాము. వాళ్లిద్దరు ఈ అక్రమాలకు పాల్పడినట్లు కలెక్టర్ విశ్వసిస్తున్నప్పటికీ దీనికి తగిన సాక్ష్యాలు అందించడం కష్టంగా ఉంది. అయిన్పటికీ , ఆలయ ఉగ్రాణంలో  490-36-48  స్టార్ పగోడాల (ఒక స్టార్ పగోడా అంటే మూడున్నర రుపాయలు) అక్రమాలకు పాల్పడినందుకు వాళ్లమీద సివిల్ క్రిమినల్ కేసులు పెట్టేందుకు రెవిన్యూ బోర్డు అనుమతినీయాలి.”
అయితే, 1802 రెగ్యులేషన్ XXXIII కింద కలెక్టర్ కు ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి వారిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చని బోర్డాఫ్ రెవిన్యూ  చిత్తూరు కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.
ఇదే విధంగా 4000 వేల పగోడాల విలువయిన శ్రీవారివిగ్రహం మీది ఆభరణాలను ఎవరో దొంగిలించిన విషయాన్ని కూడా కలెక్టర్ బోర్డు దృష్టికి తీసుకువచ్చారు.
ఎప్పటి నుంచో ఈ అభరణాలు అర్చకుల అజమాయిషిలోనే ఉంటూ వస్తు న్నాయి. ఆలయంలో ఉన్న నలుగురు అర్చకుల్లో ఒకరయిన  దీక్షితులు (Paupan Deechut) దగ్గిర గుమాస్తాగా ఉన్న వెంకటరామయ్య  ఈ దొంగతనానికి పూనుకున్నాడని అనుమానం గా ఉంది. ఎవరు కాజేసినా  ఈ విలువయిన ఆభరణాలు మటుమాయం కావడానికి నలుగురు అర్చకులను బాధ్యులు చేయాలని, ఈ ఆభరణాల విలువను వాళ్ల నుంచి వసూలు చేయాలని కలెక్టర్ బోర్డుకు సూచించారు.
1817లో కూడా బోర్డ్ ఆఫ్ రెవిన్యూ నుంచి ఆలయంలో జరిగిన అక్రమాల మీద అనేక ఫిర్యాదులందాయి.  ఇందులో ఎక్కువ ఫిర్యాదులు  ఆలయ సంరక్షుడు (యాక్టివిస్టు) అని చెప్పుకుంటున్న శ్రీనివాస తాతాచార్లు నుంచి అందాయి. ఆలయానికి ఆదాయాన్ని తీసుకురావలసిన కొన్ని సేవలను కాంట్రాక్టర్లకు అప్పగించడంలో జరిగిన అక్రమాల గురించి ఆయన ఫిర్యాదుచేశారు.
ఆ రోజుల్లో భక్తులకు తలనీలాలు సమర్పించే కాంప్లెక్స్ కాంట్రాక్టును క్షురకులకు కొంత రెంటుకు అప్పగించేవారు.  అదే విధంగా స్వామి వారి పుష్కరిణిని కొంతమంది బ్రాహ్మణులకు కాంట్రాక్టుకు ఇచ్చే వారు.
పుష్కరిణిలో స్నానానికొచ్చేవారి నుంచి బ్రాహ్మణులు పన్నువసూలు చేసేవారు. ఇందులో కొంతమొత్తాన్ని రెంటు కింద ప్రభుత్వానికి చెల్లించే వారు.
అయితే, తాము ప్రభుత్వానికి పెద్ద మొత్తం ఫీజు చెల్లిస్తున్నామని చెప్పి ఈ కాంట్రాక్టర్లు భక్తులనుంచి భారీగా ఫీజు వసూలు చేసేవారు. తలనీలాలు సమర్పించడం, పుష్కరిణిలో స్నానం చేయడమనేవి మొక్కుబడులు కాబట్టి, భక్తులు గత్యంతరం లేక దేవుడి హుండీలో వేసేందుకు తెచ్చిన   ముడుపునుంచి వీళ్ల కి అధిక మొత్తం చెల్లించే వారు. దీనితో హుండీ రాబడి పడిపోయింది. ప్రభుత్వ ఆదాయమూ పడిపోయిందని తాతాచార్లు ఫిర్యాదుచేశాడు.
ఇదే విధంగా మరొక అక్రమాన్ని కూడా తాతాచార్లు బోర్డాఫ్ రెవిన్యూ దృష్టికి తీసుకువచ్చారు.
లక్కలోని శేషయ్య అనే వ్యక్తి ‘ముద్ర మంటపం’ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. ఇక్కడే శ్రీవారి  ఆయుధాలు శంఖు చక్రాలుంటాయి.  ఈ రెండు ఆయుధాలను  భక్తుల భుజాల మీద కొద్ది సేపు అలంకంచి డబ్బు వసూలు చేయడం శేషయ్య మొదలుపెట్టాడు. ఇది సంప్రదాయ విరుద్ధం.  ఈ విషయం మీద ఫిర్యాదుచేసినా తాశీల్దారు పట్టించుకోలేదని తాతాచార్లు ఏకంగా బోర్డాఫ్ రెవిన్యూ కు ఫిర్యాదు చేశాడు.
ఇలా చాలా ఫిర్యాదులు రావడం మొదలయింది.
ఇలాంటి సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు టెంపుల్ అడ్మినిష్ట్రేషన్ గురించి  1817- రెగ్యులేషన్ తీసుకువచ్చారు..
ఆలయ రాబడిని ప్రయవేటు వ్యక్తులు కాజేయకుండా, దుర్వినియోగ చేయకుండా చూడటమే కాకుండా ఈ రాబడిని  కేవలం ఆలయానికి మాత్రమే వినియోగించాలనిపేర్కొనడం ఈ రెగ్యులేషన్ విశేషం. దీనితో  హిందూ ఆలయాలేకాదు, ముస్లిం సంస్థలు బోర్డాఫ్ రెవిన్యూ కంట్రోల్ లోకి వచ్చాయి. దీనిని ఆధారం చేసుకుని మొట్టమొదటి సారి తిరుమల ఆలయ పరిపాలన సజావుగా సాగేందుకు 5 చర్యలు తీసుకున్నారు.
అవి 1. దిట్టం ( శ్రీవారి సేవలకు రోజూ బియ్యం, నెయ్యు వంటి సరులకు ఎంత అవసరమవుతాయో తొలిసారి లెక్క కట్టారు.) 2. కైంకర్య పట్టి(  ఆలయ సేవకులందరికి జీతాభత్యాలు లెక్కించారు.దీనిని శెరిష్టదారు ఎ రంగారావు, తాశీల్దార్ ఆర్ సుబ్బారావులు తయారు చేశారు. 3. బ్రూస్ కోడ్. ఆలయపరిపాలనకు సంబంధి అప్పటి నార్త్ ఆర్కాట్ కలెక్టర్ బ్రూస్ తయారు చేసిన 42 అంశాల నియమావళి. 4.సవాల్-జవాబు పట్టి (1819లో ఇది ఆలయానికి సంబంధంచిన మొత్తం సమాచారం)5. పైమాయిషీ అకౌంట్: గుడుల కొలతల,దేవుళ్ల జాబితా.
ఈ బ్రూస్ కోడ్ ప్రకారం తిరుమల ఆలయ పరిపాలన ఈస్టిండియా కంపెనీ  పర్యవేక్షణలో 1843 దాకా సాగింది.  ఆయేడాది హిందూఆలయాలలో ప్రభుత్వం జోక్యం వద్దని ఇంగ్లండుప్రభుత్వం ఆలయ పరిపాలన నుంచి తప్పుకోమని కలెక్టర్లను ఆదేశించింది. దీనితో ఆలయాలకు స్వయం ప్రతిపత్తి వచ్చింది. తిరుమల కూడా స్వతంత్ర   పరిపాలన కిందకు వచ్చింది. ఆలయ పాలనను శ్రీహథీరామ్ మఠానికి అప్పగించారు.  శ్రీ మహంత్ సేవాదాస్ తిరుమల ఆలయ పరిపాలకుడయ్యాడు. నిజానికి తూర్పుఇండియా పరిపాలనా కాలమే తిరుమల వివాదాలకు దూరంగా ఉండింది. ఇపుడన్నీ వివాదాలే.

(Source: History of the Hindu Religious Endowments in Andhra Pradesh: Koutha Nirmala Kumari (1998), Northern Book Centre. New Delhi)