డ్రైవర్ లెస్ కార్లు వస్తే డ్రైవర్లంతా ఏమవుతారు?

 రోడ్ల మీద జరిగే ప్రమాదాాలన్నింటికి మానవతప్పిదాలే కారణం. వాహనం నడిపే డ్రైవర్  తనకు అప్పగించిన పనిమాత్రమే చేసే రొబో కాదు. అతగాడికి డ్రైవ్ చేస్తున్నపుడు లక్ష ఆలోచనలుంటాయి. ఇంట్లో సమస్య, ఆర్థిక సమస్య,  ఆల్కహాల్ సమస్య, ప్రేమ సమస్య, ఆరోగ్య సమస్య, నిద్ర సమస్య… ఇలా సమస్యలనన్నీ డ్రైవింగ్ సీట్లో ఉన్న మనిషి మెదడును తొలిచేస్తుంటాయి. ఇంతవరకు జరిగిన ప్రమాదాలన్నింటికి ఇవే కారణాలని చెబుతుంటారు. అందువల్ల చేేస్తున్న పని తప్ప మరొక ఆలోచన చేయని కంప్యూటర్ లేదా ఆల్కోరిథమ్ (Algorithm)కారును డ్రైవ్ చేస్తే ప్రమాదాలుండవేమో. ఈ ఆల్గోరిధమ్  తయారు చేసే పనిలో గూగుల్ వంటి కంపెనీలు నిండా మునిగి ఉన్నాయి. అది వస్తే కార్లకు, బస్సులకు, ట్రక్కులకు డైవర్లుండరు. ఈ వాహనాలకు అపుడు సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలనే ధ్యాస తప్ప, ఆర్థిక సమస్యలొండవు, ఆల్కహాల్ సమస్యలుండవు,  ఆఫీసులో బాసు బెడద వుండదు…human error తో జరిగే ప్రమాదాలండవు. ఇలాంటి డ్రైవర్ లెస్  (Driverless or autonomous vehicles AV)వాహనాలొస్తే… పరిస్థితి ఎలా ఉంటుంది…
మనంచూస్తుండగానే చాలా ఉద్యోగాలు మాయమయ్యాయి. అయితే, అపుడు కొత్తరకం ఉద్యోగాలొచ్చేవి. మనుషులు వాటిలో ఉపాధికి కుదిరే వాళ్లు. అయితే, చరిత్రలో మొదటిసారి, మనిషి అవసరమే లేని పరిస్థితి వస్తాంది. మనిషిని ఉద్యోగం నుంచి తొలగించే ఆల్గోరిథమ్స్ వస్తున్నాయి. అపుడు సమాజంలో పనికిరాని మనుషులెక్కువవుతారని మేధావులు చెబుతున్నారు. వీళ్ల పరిస్థితి ఏమిటి?
పూర్వం ఆఫీసుల్లో పంకా (punkah) పుల్లర్ ( విసనకర్ర లాగే వాడు, విసిరే వాడు కాదు) అనే వుద్యోగం ఒకటి వుండేది. ఉన్నతాధికారులు కూర్చునే ప్రదేశం పైన,  కప్పు నుండి ఒక పెద్ద విసనకర్ర లాంటి పరదా వేలాడుతూ వుండేది. దాన్ని ఓ పొడవాటి తాడు తో ఒక మనిషి లాగుతూ, వదుల్తూ విసిరే వాడు. అపుడు ఆఫీసర్ కు చల్లటి గాలి పోకేేది. ఈ భారీ విసనకర్ర లాగడమే అతని వుద్యోగం. ఆ తరువాత మనిషి అవసరం లేకుండానే పంకా  విసిరే  యంత్రాలు తయారయ్యాయి.
మార్చి 3, 1856 నాడు, కలకత్తా నివాసి, జార్జి ఆల్ఫ్రెడ్ డీపెన్నింగ్ అనే సివిల్ ఇంజనీరు ఒక యంత్రాన్ని తయారు చేశాడు. దీన్ని  “An Efficient Punkah-Pulling Machine”. అన్నాడు. దాని పేటెంటు హక్కులకు అప్లై చేశాడు.  ఇదే భారత దేశపు మొట్టమొదటి పేటెంటు కావడం ఒక విశేషం. ఈ యంత్రం ఇంతకు ముందున్న పంకా పుల్లర్ మనిషికి  ప్రత్యామ్నాయమయింది.
ఆ తరువాత ఈ పంకాలు పోయాయి, ఫంకా పుల్లర్ వుద్యోగాలూ పోయాయి. సాంకేతికత వృద్ధి చెంది, విసిరే ప్రక్రియలో మార్పులొచ్చి మన ఈ నాటి ఫ్యాన్లు వచ్చాయి. ఎసిలొచ్చాయి. ఇప్పుడు చాలా మందికి  పంకా పుల్లర్ అనే వుద్యోగం ఒక పుడు ఒకటుండేదని కూడా తెలియక పోవచ్చు.
ఇలాగే, కాల క్రమేణా ఎన్నో రకాల నైపుణ్యాలూ, జీవనోపాధులూ అంతరించి పోయాయి . ఒకప్పుడు జట్కా బళ్లు,  టాంగాలూ వుండేవి. అవి తగ్గిపోయి కొన్ని చోట్ల పూర్తిగా అంతరించి పోయాయి కూడా. సైకిలు రిక్షాలూ అంతే.  ఆటొ రిక్షాలు వచ్చాక సైకిలు రిక్షాల జాడ లేదు. “రిం ఝిం రిం ఝిం హైదరాబాద్ రిక్షా వాలా జిందా బాద్” లాంటి పాటలూ, శభాష్ రాముడు సినిమాలో ని రిక్షా రేసు లాంటివి ఇప్పుడు చరిత్రే. జట్కాలూ , సైకిలు రిక్షాలూ జీవనోపాధి గా వుండిన వాళ్లంతా ఏమయ్యారు?
ఇలాగే మరొక ఉపద్రవం జరగ బోతోందా?
ఈ నాటి డ్రయివరు వుద్యోగాలు తొందర్లో మాయమవుతాయంటున్నారు. డ్రయివర్ రహిత కార్ల (Driverless cars) తయారీ కోసం గూగుల్ వంటి పేరున్న అంతర్జాతీయ టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. అవి విజయవంతమయి, డ్రైవింగ్ వీల్ (Driving wheel) లేని కార్లు, బస్సులు, టక్కులు వస్తే… ఏమవుతుంది? ఇదే  ఇపుడు పెద్ద చర్చ.
 60, 70 యేళ్ల తరువాత మన భావి తరం వాళ్లు ” పూర్వం కారు డ్రయివర్ అని ఓ వుద్యోగం వుండేది….” అని కథలు కథలు చెప్పుకోవలసి వస్తుంది.
ఫిబ్రవరి 14, 2016 న గూగుల్ సెల్ఫ్ డ్రివెన్ కార్ ( తనంతట తాను నడిచే కారు) ఒక ఆక్సిడెంటు కు గురి అయింది. 2009 నుండి , ఆటోనమస్ వెహికల్స్  (AV) రూపం లో గూగుల్ స్వతంత్రంగా  నడిచే కార్ల పరీక్షలు నిర్వహిస్తూ వుంది. ఈ కార్లు అప్పటివరకు దాదాపు 13 లక్షల కిలోమీటర్లు ప్రయాణించాయి. 17 సార్లు ఆక్సిడెంట్లకు గురి అయ్యాయి. అయితే ఈ 17 సార్లు కూడా ‘ప్రమాదాలకు మా కారు తప్పేలేదు’ అని  ఇతర వాహనాలు చేసిన తప్పుల వల్ల (అంటే డ్రైవర్లున్న కార్లు) ఆక్సిడెంట్లు జరిగాయని గూగుల్ ప్రకటించింది. అంటే ఆగి వున్న AV ని వెనకనుంచి వచ్చిన వాహనం తాకడం  లాంటివి.
అయితే ఈ సారి జరిగిన ఆక్సిడెంటుకు గూగుల్ బాధ్యత వహించింది. దానికి కారణమేమిటంటే,
ఈ కారు ఒక చోట కుడి పక్క మలుపు తిప్పడానికి  లేన్ లో కి మారింది. సరిగ్గా మలుపు దగ్గర ఒక గండి లాంటి దాన్ని పూడ్చడం కోసం వేసి వున్న ఇసుక బస్తాలను గమనించి ఆగింది. ఆ తరువాత తన వెనుక వున్న కొన్ని కార్ల ను పోనిచ్చి స్థలాభావం వల్ల కొద్దిగా ఎడమ పక్కకు వచ్చి కుడి మలుపు తీసుకో బోయింది.  ఆపుడు దాని వేగం గంటకి 2 మైళ్లు ఉంది. ఈ లోపు వెనక నుంచి వస్తున్న ఒక బస్సు ఈ కారును తాకింది. ఈ బస్సు వేగం గంటకి 15 మైళ్లు ఉంది. ఈ ఆక్సిడెంటులో ఎవరికీ దెబ్బలు తగల లేదు కాని AV ముందరి ఎడమ చక్రం, ఎడమ వైపు ఫెండర్ దెబ్బ తిన్నాయి. నిజానిక్ ప్రతి AV కారులోను ఒక టెస్టు డ్రైవర్ వుంటాడు. అతను కారు నడపడు. పైనుండి గమనిస్తూ వుంటాడు, ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి వస్తే ఆదుకుంటాడు.  ఈ కార్లోను ఒక టెస్టు డ్రైవర్ వున్నాడు. అతడు వెనక వస్తున్న బస్సును రియర్ వ్యూ మిర్రర్ లో గమనించాడు. కారు కదలికను చూసి బస్సు ఆగుతుందిలే “అనుకున్నాడు”.కారు కొద్దిగా వెనక్కు జరిగింది. వెంటనే బస్సూ వచ్చింది. కారు బస్సును తాకింది. ప్రమాదం జరిగింది.
ఈ సంఘటనకి స్పందిస్తూ గూగుల్ తాము ఇంకా పరీక్షలు ముమ్మరంగా చేయాలని లేక పోతే ఈ “అనుకోవడా”ల వల్ల వచ్చే సమస్యల్ని నివారించడం కష్టమని చెప్పింది.
అందువల్ల ఇలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండాలంటే,  మొత్తం రోడ్ల మీద తిరిగే వాహానాలన్నీ ఒకే నెట్ వర్క్ పరిధిలోకి వస్తే, అపుడు ప్రతి వాహనం ఇతర వాహానాల మువ్ మెంట్ తెలుసుని లేన్ మారడం,కుడివైపు తిరగడం, స్పీడ్ తగ్గించుకోవడం,ఆగడం లేదా సైడ్ ఇవ్వడం వంటి నిర్ణయాలు తీసుకుంటాయి.  అందువల్ల ప్రమదాలు లేకుండా ఉండాలంటే డ్రైవర్ లెస్ వాహనాలు రావాలని, ఇక ముందు డ్రైవింగ్ లో ఆల్గోరిథమ్ ప్రమేయమే తప్ప మనిషి ప్రమేయం ఉండకుండా చేయడమే మార్గమనే ఫిలాసఫీ బలపడుతూ ఉంది.
ఏదయినా ఒక హాలీవుడ్ సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ని గుర్తు తెచ్చుకోండి. దాన్లొ వాటంతటికి అవే కదిలే రక రకాల వాహనాల్లో మనుషులు (ప్రస్తుతానికి మనుషులే అనుకుందాం)   ఎంతో వేగంగా  “జుమ్మ” ని అటూ ఇటు తిరుగుతూ వుంటారు. అలా రేపటి ప్రపంచం లో మన పిల్లలు ఈనాడు రిమోట్ తో నడిపే కార్ల లాగా మన రోడ్ల మీద తమంతట తాము గా నడిచే కార్లు అటూ ఇటూ తిరుగుతూ వుంటాయి.
కొండొకచో కనిపించని డ్రయివర్లతో కారు రేసులు కూడా జరుగుతూ వుండవచ్చు.
ఆ కార్లన్నీ ఒక దానితో ఒకటి అను సంధానం లో వుంటాయి. వాటికి సంబంధించిన , అంటే తామెక్కడ వున్నదీ, ఎంత వేగంగా వెళుతున్నదీ, తమ దగ్గర్లో కానీ, చుట్టు కానీ వున్న అపాయాలూ, ట్రాఫిక్ వగైరా  సమాచారాన్ని అవసరమైన వారికి చేరవేస్తూ వుంటాయి. ఒక సమర్థ వంతమైన ట్రాఫిక్ నిర్వహణా వ్యవస్థ వుంటే, అత్యుత్తమమైన మార్గాన్ని అన్వేషించి కార్లను ఆ మార్గాలగుండా త్వరగా, సులభంగా తీసుకువెళ్లే  సౌలభ్యం పొందవచ్చు. (ఇంకా నయం రోడ్లన్నీ నేలమీదే వుంటాయి కాబట్టి మన ఆలోచనల్ని కూడా ద్విమితీయం (two dimensional) గా వుంచుకో వచ్చు. ఎగిరే కార్లు వచ్చినపుడు ఈ వ్యవస్థ ఇంకొంచం క్లిష్టతరం కావచ్చు).
విచిత్రమేటంటే ఈ విషయాన్ని మనలో చాలామంది ఇప్పట్లో  ఇష్టపడకపోవచ్చు, అనవసరం అనుకో వచ్చు. నిరసించవచ్చు. కానీ, ఒక గుర్రపు బగ్గీ తెస్తే కారు వదిలేసి ఎంతమంది ఇప్పుడు తిరిగి గుర్రపు బగ్గీలో ప్రయాణానికి సిధ్ధ పడతారు ?
ఈ రూపేణా నేటి డ్రయివర్ల పరిస్థితి, నిన్నటి గుర్రాల పరిస్థితే లాగే మారుతుందా?
కార్లు తయారయిన కొత్తల్లో వాటిని కొనడానికి ప్రజలు ఇష్టపడే వారు కాదు. క్లీవ్ లాండ్, అమెరికా “ది వింటన్ మోటార్ క్యారేజి కంపెనీ”     గుర్రపు బగ్గీ ఆకారం లో నే వుండే తొలి కారును  అమ్మడానికి ముందు,  తయారు చేసిన వ్యాపార ప్రకటన ఆసక్తి కరంగా వుంటుంది. స్థూలంగా దాని రూపం ఇది.

“గుర్రాన్ని వదిలించుకోండి. దాన్ని సాకడానికి అయ్యే ఖర్చు, శ్రధ్ధ, ఆత్రుత లను తగ్గించు కోండి. ఒక మోటారు క్యారేజీని నడపడానికి అయ్యే ఖర్చు మైలుకి అర సెంటు మాత్రమే.  ది వింటన్ మోటార్ క్యారేజి  ఈ రకమయిన అత్యుత్తమ వాహనం. ఇది అందంగా, ధృడంగా మరియు తేలికగా వుంటుంది. చాలా హుందాగా వుంటుంది. దీన్ని నిర్వహించడం చాలా సుళువు. దీనితో గంటకు 3 నుండి 20 మైళ్ల వేగం తో ప్రయాణించ వచ్చు……”
రేపు డ్రైవర్ లెస్ కార్లు, బస్సులు, ట్రక్కులు వస్తే…
నేటి రవాణా వ్యవస్థలో డ్రయివర్ల పాత్ర ఎంతో ప్రముఖం. వున్నట్లుండి ఈ డ్రయివర్లందరూ మాయమై పోతే , ఆధునిక జీవితం ఆగిపోతుంది.  వీరు లేకపోతే, సరుకులు సూపర్ మార్కెట్ల కు చేరవు, ఆహార పదార్థాల సరఫరా ఆగిపోతుంది, మన ఇండ్లలో వుండే చెత్తా చెదారం ఇళ్లలోనే మురిగి పోతుంది, పిల్లలు స్కూళ్లకు వెళ్లలేరు. సంఘానికి ఇక ఏ మాత్రం అవసరం లేని ఒక నైపుణ్యాణ్ణి వుంచుకుని, నిరుద్యోగులుగా మిగిలిపోయే ఈ డ్రయివర్లందరూ ఏవుద్యోగానికి ఎక్కడికి వెళతారు? జీవనో పాధికి ఏం చేస్తారు? ఏమయిపోతారు ??
మనిషి ప్రపంచం లో కి వచ్చిన తొలి ర్రోజుల్లో విషయ పరిజ్ఞానం చాలా తక్కువగా వుండింది. ఆయు ప్రమాణం కూడా అప్పట్లొ తక్కువే. సూర్యోదయం నుంచీ సుర్యాస్తమయం వరకు మాత్రమే మనిషి పని చేసే వాడు. ఆ పని కూడా ఆహారం సంపాదించుకోవడానికి మాత్రమే. ఇక ఏదయిన కొద్దిపాటి సమయం దొరికితే,  రాళ్ల రాపిడి వల్ల ఉష్ణం పుట్టించ వచ్చనో, లేక కొండరాళ్లను అరగదీసి ఆయుధాలు తయారు చేయవచ్చనో తెలుసుకునే వాడు. జీవితం లో ఆవిష్కరణల భాగం నత్త నడక నడిచింది.  రాను రాను  పరిసరాల అవగాహన, పెరిగింది.. ఆలోచన పెరిగింది. ఆయు ప్రమాణం పెరిగింది. అవసరాలు పెరిగాయి. ఆవిష్కరణలూ పెరిగాయి.  జీవిత వేగం పెరిగింది.
నిజానికి మార్పు మనిషి పుట్టినప్పటి నుండి నిరంతరం జరుగుతూనే వుంది. “ఈ ప్రపంచం లో స్థిరంగా వుండేది ఒక్క మార్పు మాత్రమే”  అన్నాడొక మహాను భావుడు. మనిషి నైపుణ్యాలలో, జీవనోపాధుల్లో, వుద్యోగాల్లో ఎన్నొ మార్పులొచ్చాయి. ఎన్నొ నిష్క్రమించాయి మరెన్నో కొత్తవి పుట్టుకొచ్చాయి. కమ్మరి, కుమ్మరి, కంసాలి లాంటి వృత్తులు కనుమరుగవుతున్నాయి. ఇప్పుడు దర్జీలు తగ్గిపోతున్నారు. అయితే ఒక వృత్తి మరో వృత్తి లోకి రూపాంతరం చెందడానికి పట్టే సమయం ఎక్కువే. ఈ లోపు జీవన భృతి కి ఏం చేయాలి?
ఇంతకు ముందు రైతులుగా వున్న వారు వ్యవసాయాన్ని వదిలేసి ఫాక్టరీలలో చేరారు. పరిశ్రమల్లో ఉద్యోగులయ్యారు. అక్కడా ఆటొమేషన్ వచ్చింది.  అసెంబ్లీ లైన్లు వచ్చాయి. మళ్లీ జీవనోపాధికి వెతుకులాట. చేతనయిన వాళ్లు కంప్యూటర్ ఇంజినీర్లు గా మారారు. అయితే వీళ్లు తమ తరువాతి తరం వారికి జ్ఞానోఫదేశం చేశారు. రైతుల పిల్లలు పరిశ్రమల్లో చేరారు. పరిశ్రమల్లో వున్న వాళ్ల పిల్లలు చదువుకుని కంప్యూటర్ ఇంజినీర్లు అయ్యారు.  ఇలా సంఘం లో జీవనోపాధికి వెతుకులాట నిరంతరం  సాగుతూనే వుంది. ఈ నేపధ్యం లో  ఇప్పుడున్న డ్రయివరు ఉద్యోగాలు ఏమవుతాయి?  సంఘం లో మార్పు త్వరగా వస్తుంది కానీ మనుషులు మారడం, నైపుణ్యాలు సంపాదించుకోవడం  అంతే వేగంతో జరగదు.
ఇప్పుడే ఆలోచించి ఈ డ్రయివర్ల భవిష్యత్తుకు తగ్గ శిక్షణ కానీ, ప్రత్యామ్నాయం కానీ వూహించగలమా? ఎందుకంటే ఇలాంటి మార్పు నిరంతరం జరుగుతూనే వుంటుంది. ఇలాంటి సమస్యకు సమాధానం వెతక గల్గితే, మున్ముందు తలెత్తబోయే ఇలాంటి సమస్యలకు పరిష్కారం సాధ్య మవుతుంది. లేదా మనకెందుకులే అనుకుంటే ఒక జీవన భృతి ముగిసిపోతుంది. జీవితం మాత్రం సాగుతూనే వుంటుంది. ఇలా ఒక్కొక్కటే ఆల్గోరిథమ్ వచ్చి మనుషుల్ని అనేక రంగాలనుంచి రీప్లేసే పరిస్థితి వస్తేపరిస్థితి ఎలా ఉంటుందనే  ప్రశ్నను ఫ్రొఫెసర్ యువల్ నోఆ హరారి (Prof Yaval Noah  Harari) తన పుస్తకం   Homo Deus చక్కగా చర్చించాడు.ఆయన మరొక ఉదాహరణ ఇచ్చారు. ఇపుడు ఒక నేరస్తుడినుంచినిజం చెప్పడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. లాయర్లు, ఫోరెన్సిన్ నిపుణులు, డిటెక్టివ్ లు, పోలీసులు, కోర్టు, ఇంటరా గేషన్ ఇలా. నిజం,అబద్దం అనేవాటిని మెదుడులోని వేర్వేరు భాగాలు నియంత్రిస్తూ ఉంటాయి. ప్రతిఆలోచన, చేసిన పని ఇక్కడ రికార్డవుతాయి. నేరుగా మనిషి మెదడులోని భాగాాలను స్కాన్ చేసి అక్కడి రికార్డరయిన ఆలోచలను ఒక్కే ఒక్క సెకన్ లో బయటకు తీసుకువచ్చే fMRI (functional magnetic resonance imaging) ఆల్గోరిథమ్ వస్తే… ఏమవుతుంది. ఎంతమంది లాయర్లు, డిటెక్టివ్ లు,ఇన్వెస్టిగేటివ్ ఏజంట్లు, పోలీసులు… ఉద్యోగాలు కోల్పోతారు. తీరిక ఉన్నపుడు Homo Dues లో The Great Decoupling (Pages 356-408)చదవండి. కాలజ్ఞానం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.

 

Ahmed Sheriff

(Ahmed Sheriff, PMP, CMQ/OE, ACS, FLMI, PSM, Consultant, PMP Certification, Project Management &Quality Mob: +91 9849310610)