Home Entertainment లైలామజ్ను సృష్టికర్త, పాత తరం సినీ దర్శకుడు పి.ఎస్ రామకృష్ణ జయంతి నేడు

లైలామజ్ను సృష్టికర్త, పాత తరం సినీ దర్శకుడు పి.ఎస్ రామకృష్ణ జయంతి నేడు

62
0
SHARE
(చందమూరి నరసింహారెడ్డి)
పాతతరం సినిమా రంగంలో  ఆయన సహ దర్శకుడిగా, దర్శకుడిగా ,నిర్మాతగా, కథా రచయితగా, నిర్మాణ సంస్థ అధిపతి గా అనేక విభాగాలలో పనిచేసి సినీ చరిత్రలో నిలిచిపోయారు. గాయని, ప్రముఖ సినీ నటిగా పేరు తెచ్చుకున్న భానుమతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయనెవరో ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఆయనే పి.యస్. రామకృష్ణారావు.
రామకృష్ణారావు 1918 అక్టోబర్ 12 న కర్నూలులో జన్మించారు. 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్ అయ్యారు. హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.
1943 లో కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది.1943, ఆగష్టు 8 న వీరి వివాహం జరిగింది.

భానుమతి 1926 సెప్టెంబరు 7 న ప్రకాశం జిల్లా, ఒంగోలులో జన్మించింది. పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే భరణీ స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు నిర్మించారు.
భానుమతి, ఆమె భర్త పి.ఎస్.రామకృష్ణారావు స్థాపించిన భరణీ పిక్చర్స్ వారి తొలి చిత్రం. రత్నమాల సినిమా .ఇది1948 జనవరి2 న విడుదలైంది.
పి.ఎస్.రామకృష్ణారావు దర్శకత్వం,నిర్మాతగా వ్యవహరించారు. అక్కినేని నాగేశ్వరరావు భానుమతి, చిలకలపూడి, సీతారామంజనేయులు, గోవిందరాజులు సుబ్బారావు, హేమలత,ఆరణి సత్యనారాయణ, సీతారాం నటించారు.
ధనంకన్నా బంధం ముఖ్యమని చూపిన ఎన్ టి రామారావు ‘‘ఆత్మబంధువు’’ చిత్రానికి రామకృష్ణ రావు దర్శకత్వం వహించారు.
మానవుల్లోని మాలిన్యాన్ని మట్టుబెట్టి, మమతలను పెంపొందించడానికి సహాయపడి డబ్బుపిచ్చితో అధోగతిలో పడుతున్న సమాజాన్ని పునరుద్ధరించే యువకుడి కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఆత్మబంధువు’. పి.ఎస్. రామకృష్ణారావు దర్శకత్వంలో 1962, డిసెంబర్ 14న విడుదలైంది.ఈ చిత్రంలో ఎన్.టి.ఆర్. సావిత్రి, యస్వీ రంగారావు, కన్నాంబ, రేలంగి, గిరిజ, పద్మనాభం, సూర్యకాంతం, హరనాధ్, రీటా తదితరులు నటించారు.
సి. నారాయణరెడ్డి రాసిన ‘అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న’, ‘చదువురానివాడవని దిగులు చెందకు’, ‘మారదూ మారదూ మనుషులతత్వం మారదు’ మొదలైన పాటలు ప్రజాదరణ పొందాయి.
source: wikimedia
దర్శకత్వం1949లో లైలామజ్ను భరణి సంస్థ వారి రెండవ చిత్రం. ఈ చిత్రానికి పి.రామకృష్ణరావు దర్శకునిగా నిర్మాతగా వ్యవహరించారు.
అక్కినేని నాగేశ్వరరావు, పి.భానుమతి, కస్తూరి శివరావు, ముక్కామల కృష్ణమూర్తి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, సురభి బాలసరస్వతి నటించారు. లైలా మజ్ను నాగేశ్వరరావును ట్రాజెడి కింగ్ ఆఫ్ తెలుగు మూవీస్ గా మారిస్తే, డైరెక్టర్  గా రామకృష్ణరావు ని తారాస్థాయికి తీసుకువెళ్లింది. లైజామజ్ను చిత్ర నిర్మాణం వెనక ఆసక్త కరమయిన ఉదంతం ఉంది.
నటుడు ప్రొడ్యూసర్ నజీర్ తీసిన  హిందీ లైజామజ్ను(1945) చూసి పిఎస్ రామకృష్ణ థ్రిల్ అయిపోయాడు.  తెలుగులో లైజా మజ్ను తీయాలనుకున్నాడు. అయితే, మద్రాసు న్యూటోన్ స్టూడియో వాళ్లు కూడా తమిళంలో లైలా మజ్ను తీస్తున్నట్లు ఆయన కు తెలిసింది.అంతేకాదు, వాళ్లు దాని తెలుగు వర్షన్ కూడా తీయాలనుకుంటున్నట్లు కూడా తెలిసింది.దీనితో ఆయన పరుగు పెట్టాల్సి వచ్చింది. అప్పటికి వాహినీ స్టూడియో కంప్లీట్ కాలేదు. ఒక ఫ్లోర్  మాత్రమే తయారయింది. అయినా సరే ముందుకెళ్లాలనుకున్నాడు. స్టూడియో బయట ఖాళీ స్థలంలో ఎడారి సృష్టించారు. వేదాంతం రాఘవాచార్య కథ సృష్టించారు.  సంగీతానికి సిఆర్ సుబ్రహ్మణ్యాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ టీమ్ తో కోరియాగ్రాఫర్ వేదాంతం రాఘవయ్య కలిశారు.అంతే మ్యాజిక్ పనిచేసింది. అద్భుతమయిన పాటలు తయారయ్యాయి. ముఖ్యంగా ఓ ప్రియతమా పయణమాయే ప్రియతమా  సూపర్ హిట్టయింది. తమిళ లైలా మజ్ను ఏమయిందో గాని, తెలుగు లైలామజ్ను మాత్రం గొప్ప చలన చిత్ర కావ్యంగా మిగిలిపోయింది. ఈ పాటలోని ఎడారి మొత్తం వాహినీ స్టూడియో లో సృష్టించినదే…

గృహలక్ష్మి భరణీపిక్చర్స్ బేనర్‌పై 1967,ఏప్రిల్ 7న విడుదలైన తెలుగు సినిమా.
1967 లో గృహలక్ష్మి చిత్రానికి పి.ఎస్ రామకృష్ణారావు
దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథను కూడా ఈయనే రచించారు.
భానుమతి,అక్కినేని నాగేశ్వరరావు,ఎస్వీ రంగారావు,
పద్మనాభం, ర్యకాంతం, రమణారెడ్డి నటించారు. రామకృష్ణారావు సుమారు 50 చిత్రాలకు పైగా దర్శకుడిగా నిర్మాతగా నిర్మాణం చేపట్టారు.
రామకృష్ణారావు 1986, సెప్టెంబరు 7 న మద్రాసులో మరణించాడు.
Chandamuri Narasimhareddy

(చందమూరి నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఖాసా సుబ్బారావు అవార్డు గ్రహీత)