హీరో సచిన్ జోషి అరెస్ట్

గుట్కా అక్రమ రవాణా కేసులో సినీ నటుడు, నిర్మాత, వ్యాపార‌వేత్త సచిన్‌ జోషిని హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాన్‌ మసాలాల ముసుగులో నిషేధిత గుట్కాలు తయారీ, సరఫరా చేస్తున్న ఆయనను ముంబై విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ లో  భారీ ఎత్తున గుట్కా ప్యాకెట్లు దొరకగా, నిందితులను విచారించిన పోలీసులు, సచిన్ జోషి ప్రమేయంపై ఆధారాలు సేకరించి, నిఘా పెంచారు. ఆపై సచిన్ ను అరెస్ట్ చేసేందుకు కొన్ని రోజులుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి సచిన్ జోషి ముంబైలో పెట్టుబడ్డాడు.

అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని నిషేధిత మత్తు పదార్థాల రవాణా సెక్షన్లు 273, 336 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. కోట్ల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లున్న బాక్స్ లను సచిన్ జోషి, హైదరాబాద్ కు చేర్చే విషయంలో సహకరించాడని, ఆయనపై స్మగ్లింగ్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశామని తెలిపారు.

కాగా, బాలీవుడ్ లో సంపన్న కుటుంబాల్లో సచిన్ జోషి కుటుంబం కూడా ఉంది. సచిన్ తండ్రికి గుట్కా వ్యాపారం ఉండగా, దీనిలో ఆయన వందల కోట్లు సంపాదించారు. ఇప్పుడు సచిన్ ను అరెస్ట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపింది. ఓ వైపు మహారాష్ట్రలో, మరోవైపు హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలో వీరు గుట్కా అక్రమ దందాను సాగిస్తున్నారని తెలుస్తోంది.

నటుడిగా సచిన్ జోషి పలు తెలుగు చిత్రాల్లోనూ నటించాడన్నసంగతి తెలిసిందే. మౌనమేలనోయి, నిను చూడక నేనుండలేను, ఒరేయ్ పండు, జాక్ పాట్, వీరప్పన్, వీడెవడు, నెక్ట్స్ ఏంటి, అమావాస్ తదితర సినిమాల్లో నటించాడు.