కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీలో జాప్యమెందుకంటే…

(TTN Desk)
కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీకి  ఇంకా చాలా సమయం పట్టేట్లు ఉంది. నిజానికి కరోనావైరస్ సమాచారం శాస్త్రవేత్తలదగ్గిర సమృద్ధిగా ఉంది. గతంలో సార్స్ (SARS)  వచ్చినపుడు, అలాగే  మిడిల్ ఈస్ట్ రెస్సిరేటరీ సిండ్రమ్ (MERS) ఉధృతంగా (pandemic) వచ్చినపుడు ఈ వైరస్ ల మీద విపరీతంగా పరిశోధన జరిగింది. ఈవ్యాధి తెచ్చే వైరస్ లు కూడా కరోనా కుటుంబానికి చెందినవే.
అయితే, ఈ వైరస్ ల వ్యాప్తి ఆగిపోగానే,  వ్యాక్సినేషన్ లేదా మందుల  తయారీకోసం బయోటెక్ కంపెనీలు పడిన ఆదుర్దా కూడా తగ్గిపోయింది. ఎందుకంటే, కంపెనీలను శాసించేంది  వ్యాక్సిన్ కు ఉన్న డిమాండే కదా. ఇపుడు విపరీతంగా ఖర్చు పెట్టి  మందో మాకో తయారు చేసేటప్పటికి  కోవిడ్ -19 తగ్గిపోయిందనుకో, అపుడు ఈ మందుకు లేదా వ్యాక్సిన్ కు డిమాండ్ తగ్గిపోతుంది. వాటిని కొనే వాళ్లవరూ ఉండరు. కంపెనీలు నష్టపోతాయి. అందువల్ల చాలా కంపెనీలు ఈ నావెల్ కరోనావైరస్  వ్యాధికి ముందు కనుగొనే పరిశోధనల మీద ఖర్చు చేసేందుకు వెనకాడుతున్నాయి.
అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం ప్రకారం ఇపుడు 44 కంపెనీలు వ్యాక్సిన్ లేదా మందు కొనుగోనేందుకు పోటీపడుతున్నాయి.
కొత్త కరోనా వైరస్ లో దాదాపు 79 శాతం జన్యు పదార్థం సార్స్ వైరస్ ను పోలి ఉంటుంది. అదే విధంగా 50 శాతం MERS జన్యుపదార్థాన్ని పోలి ఉంటుంది. అందువల్ల ఈ పునాది మీద మందో , వ్యాక్సిన్ కనుగొనేందుకు అవకాశం ఉన్నా వ్యాపార కారణాలు ఈ పరిశోధనకు అడ్డంకిగా తయారయ్యాయి.
వ్యాక్సిన్ అంటే ఏమిటి? మనశరీరంలోకి నిస్సారమయిన (inactive) వైరస్ Pathogen)ని ఎక్కించి, వాటికి విరుగుడును శరీరంలోని రోగ నిరోధక శక్తి నుంచి పుట్టించడమే వ్యాక్సినేషన్. (ఈ పాథో జెన్ వైరస్ కావచ్చు, బ్యాక్టీరియాకావచ్చు, కొన్నిరకాల పుప్పొడి కావచ్చు, రసాయన పదార్థాలు కూడా కావచ్చు.)
ఈ నిస్సారమయిన వైరస్ వల్ల జబ్బు రాదు. అయితే, మన శరీరం, దీనిని నిజంగానే వైరస్ (antigen) అనుకుని దానికి మీద దాడి చేసేందుకు యాంటీబాడీ (antibodies) సైన్యాన్ని తయారు చేస్తుంది. అపుడు భవిష్యత్తులో నిజంగానే వైరస్ దాడి చేసినా జబ్బురాదు.ఇదిసాధారణం వ్యాక్సిన్ తయారీ. ఇపుడు నిస్సారమయిన వైరస్ ను కాకుండా ఏకంగా వైరస్ జనెటిక్ మెటీరియల్ ను ల్యాబ్ కాపీ చేసి శరీరంలోకి ఎక్కించి రోెగనిరోధక శక్తి పెంచే ప్రక్రియను కనిపెట్టారు. ఈ పద్ధతిలో తయారయిన వ్యాక్సిన్ ను ఇంకా అమెరికా ప్రభుత్వ అనుమతి లభించలేదు. ఇలాంటి ఇపుడు తొలిసారిగా నావెల్ కరోనా  వైరస్ మీద కొంతమంది ప్రయోగించబోతున్నారు.

 

నావెల్ కరోనా వైరస్ వ్యాక్సిన ఆలస్యానికి కారణాలు
వ్యాక్సిన్ తయారీ దారులు  తాము తయారు చేసిన వ్యాక్సిన్ ను మొదట జంతువుల మీద ప్రయోగించి ఫలితాలు పరీక్షిస్తారు. తర్వాత మనుషుల మీద ప్రయోగించి (clinical trials ) కూడా ఫలితాలు పరిశీలిస్తారు. ఇప్పటి దాకా తయారవుతూ ఉన్న నావెల్ కరోనా వైరస్ వ్యాక్సిన్ లలో మనుషుల్లో ప్రయోగానికి సిద్ధమయింది ఒక్కటే . అదే మాడెర్నా (Moderna) కంపెనీ వ్యాక్సిన్. మాడెర్నా మందులు ఎలా కనుక్కుంటుందో ఇక్కడ వివరంగా రాసి ఉంది.
ఈ కంపెనీ  జంతువుల మీద ప్రయోగాలు చేయకుండా నేరుగా మనుషుల్లోకి వ్యాక్సిన్ ను ఎక్కించి ప్రయోగాలు చేస్తూ ఉంది. సాధ్యమయింత తొందరగా వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఈ కంపెనీ ఇలా నేరుగా మనుషుల మీద పరీక్షించేందుకు సిద్ధమయింది.
జంతువుల మీద ప్రయోగించి ఫలితాలుచేసే విధానం దాటవేయగలిగినా, మనుషుల మీద వెంటనే ప్రయోగించి, మార్కెట్లోకి విడుదల చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే, మనుషుల్లో కూడా మూడు దశలలో ట్రయల్స్ ఉంటాయి.  ఇందులో మొదటి దశలో  మనుషులకు ఇది సురక్షితం అని చెప్పేందుకు తక్కువ స్థాయిలో ప్రయోగం చేస్తారు.  ఈ దశలో సాధారణంగా నూరు మందికి  వ్యాక్సిన్ ఎక్కిస్తారు. ఈ ట్రయల్స్ ఫలితాలు పరిశీలించేందుకు కూడా నెలలు  పడుతుంది. ఇక్కడి ఫలితాలు బాగుంటే రెండో దశకు వెళ్తారు.
రెండోదశ ట్రయల్స్ మరింత ఎక్కువ మందితో అంటే వేల సంఖ్యలోఅనేక ఆసుపత్రుల నుంచి  రోగులను ఎంచుకుని చేస్తారు.  వ్యాక్సిన్  వైరస్ ను ఎంతమేరకు ఎదుర్కొనగలిగిందనేది తెలుసుకునేందుకు ఎంతో కొంత కాలం ఎంచుకుని ఈ ట్రయల్స్ చేస్తారు. ఈ దశ కొన్ని నెలల నుంచి సంవత్సరాల వరకు కొనసాగవచ్చు.
ఇక మూడో దశలో ఇంకా ఎక్కువ మందికి విస్తృత స్థాయిలో చేస్తారు. ఫలితాలు పరీశీలిస్తారు.ఈ ఫలితాలు బాగా ఉన్నాయనుకోండి, అపుడేవ్యాక్సిన్ వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు మనుషుల చికిత్సలో వాడేందుకు  లైసెన్స్ కోసం దరఖాస్తు చేస్తారు.  అపుడు ఇతర శాస్త్రవేత్తలు కూడా ఈ వైరస్ ను పరీక్షిస్తారు.
జుంతువుల మీద ట్రయల్స్ చేయకుండా నేరుగా మనుషుల్లోనే ప్రయోగాలు చేసినా, వ్యాక్సిన్ తయారయేందుకు అవసరమయిన ప్రొటోకోల్ పాటించేందుకు కనీసం 12 నుంచి 18 నెలలు పడుతుంది. ఇది మనిషిప్రాణాలతో చెలగాటం  కాకూడదు కాబట్టి ఈ కాలాన్ని ఇంతకు మించి తగ్గించి ఫాస్ట్ ట్రాక్ చేయడం సాధ్యం కాదు.
మాడెర్నా ట్రయల్స్
మాడెర్నా అనేది కేంబ్రిడ్జి బయోటెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీ కరోనా వైరస్ ను రెండు మూడు దశ ల ట్రయల్స్ కోసం ఉత్పత్తి ప్రారంభించింది. అయితే,  మొదటి దశ ట్రయల్స్ పూర్తయేందుకు మరొక రెండు మూడునెలలు పడుతుందని కంపెనీ సిఇవొ స్టీఫెన్ బాన్సెల్ అంటున్నారు.
ఎమ్ ఐ టి  ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించి వ్యాక్సిన్ తయారీకి అడ్డొచ్చే కారణాలను వివరించారు. ‘ప్రయివేటు కంపెనీలు ప్రయోగాల సమయంలో ఎక్కువ మోతాదులో వ్యాక్సిన్ ను తయారు చేయవు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో సత్ఫలితాలు వచ్చినపుడే వారు రెండో దశ ట్రయల్స్ కోసం వ్యాక్సిన్ తయారు చేసుందుకు డబ్బు ఖర్చు చేస్తారు. మొదటి దశలో మంచి ఫలితాలు రాకపోతే, వారు ముందుకు పోరు.
అయితే, మాడెర్నా అనేది వ్యాపార సంస్థ కాదు కాబట్టి  ఎక్స్ ట్రా డోస్ వ్యాక్సిన్ లను తయారు చేసి క్లినికల్ ట్రయల్స్ ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటూ ఉందని బాన్సెల్ చెప్పారు.   దీనికోసం అమెరికా ఫెడరల్ ఫండింగ్  ‘బయోమెడికల్ అడ్వాన్స్ డ్ రీసెర్చ్ అండ్ డెవెలప్ మంట్ అధారిటీ’ సాయంకోరాలనుకుంటూ ఉంది.
మాడెర్నాక్లినికల్ ట్రయల్స్ విజయవంతమయినా, ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాదికి గాని మార్కెట్ లోకి రాదని ఆయన చెప్పారు.
వ్యాక్సిన్ డెవెలప్ మెంట్ రిస్కీ వ్యవహారం
  నావెల్ కరోనావైరస్ వ్యాక్సిన్ తయారు చేసేందుకు  ఏడాది కంటే ఎక్కువ కాలం పడుతుంది. ఒక యేడాది కోట్ల డాలర్లు ఖర్చు చేసి రేయింబగలు శ్రమించి వ్యాక్సిన్ తయారు చేస్తు, అది క్లినికల్ ట్రయల్స్ లో పాసయి, కమర్షియల్ ప్రొడక్షన్ కు లైసెన్స్ తెచ్చుకునేసమయానికి వైరస్ వ్యాప్తి ఆగిపోవచ్చు. వైరస్ ముప్పు తొలగిపోవచ్చు. అపుడు ఈ వ్యాక్సిన్ గాని లేదా మందుకు గాని డిమాండ్ ఉండదు. బయో టెక్నాలజీ కంపెనీలను నిరుత్సాహపరుస్తున్నదీ విషయమే. నావెల్ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారీ జాప్యానికి ప్రధాన కారణం ఇదే. అయితేకూడా చాలా కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారీ పరుగులో ఉన్నాయి.  చాలా కంపెనీలు 2021 లో మరొక సారి కోవిడ్-19 ప్రబలుతుందని విశ్వసిస్తున్నాయి. అపుడు వ్యాక్సిన్ లేదా ఔషధానికి బాగా డిమాండ్ ఉంటుందని వాళ్ల నమ్మకం. ఇలాంటి నమ్మకంతో ఉన్న కంపెనీలు  మాత్రం వ్యాక్సిన్ లేదా ఔషధం కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
ఇలా మహమ్మారిలా ఏదైనా రోగం విజృంభించినపుడు  పరుగులు పెట్టి వ్యాక్సిన్ లు, మందులు తయారు చేసిన కంపెనీలు కొన్ని తర్వాత డిమాండ్ లేక చేతులుకాల్చుకున్నాయి. సార్స్  కరోనావైరస్  మహమ్మారి 2003లో ఎదురయినపుడు ఏమిజరిగింది, పరిశోధనల్లో కోట్లు ఖర్చు పెట్టిన కంపెనీలు మందులు మార్కెట్ లోకి విడుదల చేసేలోపు సార్స్ మామయింది.
ఇదే అనుభవం ఇబోలా (Ebola) విషయంలో, స్వైన్ ఫ్లూ తెచ్చిన H1N1 విషయంలో కూడా ఎదురయింది. అందుకే ఇపుడు పెద్ద పెద్దఫార్మా కంపెనీలు నావెల్ కరోనావైరస్ వ్యాక్సిన్ కనిపెట్టే పరిశోధనల్లో పూర్తిగా దూకేందుకు వెనకాడుతున్నాయని SmartPharm Therapeutics చీఫ్ ఎగ్జిక్యూటివ్ Jose Trevejo  చెప్పారు.
అయినా సరే చాలా కంపెనీలు కోవిడ్ -19 కి మందో మాకో కనుగొనేందుకు ముందుకు వస్తున్నాయి. వాటిలో అందరికంటే ముందున్న కంపెనీ మాడెర్నా. వ్యాక్సిన్ ని క్లినికల్ ట్రయల్స్ దాకా తీసుకెళ్లిన మొదటి కంపెనీ ఇదే. అయితే ఈ కంపెనీ కూడా మరొక 12 నుంచి 18 నెలలు పడుతుందని కంపెనీ ఒక పబ్లిక్ డాక్యుమెంట్ లో పేర్కొంది